‘జపనీస్‌ చలన చిత్రోత్సవం’ ప్రారంభం !

చెన్నైలోని జపనీస్‌ రాయబార కార్యాలయం, హైదరాబాద్‌ ఫిల్మ్‌ క్లబ్‌, శ్రీసారథి స్టూడియోస్‌ సంయుక్త ఆధ్వర్యంలో అమీర్‌పేట సారథి స్టూడియోలోని ప్రివ్యూ థియేటర్‌లో సెప్టెంబర్ 22 న ‘జపనీస్‌ చలన చిత్రోత్సవం’ ప్రారంభమైంది. రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ.. భారత్‌తో జపాన్‌కు సత్సంబంధాలున్నాయని, సినిమాలే కాకుండా పరిశ్రమలు, పెట్టుబడుల్లోనూ రెండు దేశాల మైత్రి గొప్పదన్నారు. కార్యక్రమానికి హాజరైన ‘తోషిబా ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌’ సంస్థ సీఎండీ కట్సుతోషి టొడ మాట్లాడుతూ..భారత్‌, జపాన్‌ దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయని, ప్రధాని జపాన్‌ను సందర్శించడంతో అది మరింత బలపడిందన్నారు.
 
ముఖ్య అతిథిగా హాజరైన ఎఫ్‌డీసీఛైర్మన్‌
పి.రామ్మోహన్‌రావు మాట్లాడుతూ..
రామోజీ ఫిల్మ్‌ సిటీ(ఆర్‌ఎఫ్‌సీ)లోడిసెంబరు 1 నుంచి 4వతేదీ వరకు ‘ఇండీవుడ్‌ ఫిలిం కార్నివాల్‌’ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు.అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ కార్నివాల్‌కు సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. చలన చిత్రాల తయారీదారులు, ఈ రంగంలోని పెట్టుబడిదారులకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు.ఈ కార్యక్రమానికి జపనీస్‌ రాయబార కార్యాలయ సమాచార, సాంస్కృతిక విభాగం సలహాదారు మేగుమి షిమడా, సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌, తమిళ, తెలుగు సినీ తారలు స్వాతి, మధుశాలిని, ‘హైదరాబాద్‌ ఫిల్మ్‌ క్లబ్‌’ అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, కార్యదర్శి ప్రకాష్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగే ‘జపనీస్‌ చలన చిత్రోత్సవం’లో రోజూ సాయంత్రం ఆ దేశ చిత్రాలను ప్రదర్శిస్తామని నిర్వాహకులు తెలిపారు.