జయలలిత జీవితకథ… తో సినిమా తీసేందుకు తమిళ దర్శకులు క్యూ కడుతున్నారు. ఏకకాలంలో అన్నాడీఎంకే దివంగత అధినేత్రి పై మూడు సినిమాలు తెరకెక్కనున్నాయి. ప్రియదర్శిని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నిత్యామీనన్ జయలలితగా కనిపించనున్నారు. మరోవైపు భారతీరాజా కూడా జయలలిత కథతో ఓ సినిమా తీసే పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంకోవైపు యువ దర్శకుడు ఏఎల్ విజయ్ మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందనీ, త్వరలో జయలలిత కుటుంబీకుల అంగీకారం పొందనున్నారనీ తెలుస్తోంది. ప్రస్తుతం ‘యన్.టి.ఆర్’ బయోపిక్‌లో నటిస్తున్న విద్యాబాలన్‌ను ఈ సినిమాలో జయలలిత పాత్రకు, ఎమ్‌జీఆర్ పాత్రకు అరవింద్ స్వామిని ఎంచుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 24న జయలలిత జయంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తారట. ‘అమ్మా ఎండ్రాల్ అన్బు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్న ఈ సినిమాను ఏడాదిలోపు పూర్తి చేసి 2020 ఫిబ్రవరి 24న విడుదల చేస్తారని సమాచారం.
మ్యాథమెటీషిన్ ఎక్స్‌పర్ట్ శకుంతల దేవిగా ….
బాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్‌ను క్రియేట్ చేసిన వారిలో విద్యా బాలన్ ముందుంటారు. ఆమె నటించిన ‘డర్టీపిక్చర్స్’ చిత్రం సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందింది. ఈ సినిమాకు గానూ ఆమె జాతీయ అవార్డునందుకున్నారు. తాజాగా తెలుగులో ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో బసవతారకం పాత్రలో నటిస్తున్న విద్యా బాలీవుడ్‌లో మరో బయోపిక్‌కు సైన్ చేశారట. మ్యాథమెటీషిన్ ఎక్స్‌పర్ట్ శకుంతల దేవి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో శకుంతల దేవి పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని అను మీనన్ దర్శకత్వం వహిస్తుండగా, రోన్నీ స్క్రీవాలా నిర్మిస్తున్నారు. బెంగుళూరుకు చెందిన ఆమె శకుంతల అత్యంత వేగంగా గణితానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి గిన్నిస్ రికార్డ్ సొంతంచేసుకున్నారు. గణన యంత్రం(హ్యూమన్ కాలిక్యూలేటర్)గా ప్రసిద్ధి చెందారు. అంతేకాదు గణిత, ఖగోళ, జ్యోతిష్య శాస్త్రవేత్తగా రాణించారు.
ఇదిలా ఉంటే విద్యాబాలన్ నటించిన ‘డర్టీ పిక్చర్స్’ ఇటీవల ఏడేండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో స్పందిస్తూ… ‘ఏడేండ్ల క్రితం వచ్చిన ‘డర్టీ పిక్చర్’ నా జీవితాన్నే మార్చేసింది. ఇందులో అంత బాగా నటించానంటే దర్శకుడే కారణం. నన్ను ఈజీగా నటించేలా చేశారు’ అని తెలిపారు. ఈ చిత్రం 2011 డిసెంబర్ 2న విడుదలై ఓ ఊపు ఊపిన విషయం విదితమే.