అతనితో చేస్తే అవకాశాలు తగ్గిపోతాయని చెబుతున్నా…

రజనీకాంత్‌ చేసిన ‘కబాలి’ ‘కాలా’ రెండు చిత్రాలూ తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. ఈ రెండు చిత్రాలకూ పి. రంజిత్‌ దర్శకత్వం వహించారు. ఇప్పుడు రజనీ కొత్త చిత్రం చేయబోతున్నారు. దీనికి కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చిందట. రజనీ చాలా సీనియర్‌ నటుడు, ఆయన పక్కన నటిస్తే అవకాశాలు తగ్గిపోతాయని తన సన్నిహితులు చెబుతున్నా చేసేందుకు ఓకే చెప్పిందట. తెలుగులో మెగాస్టార్‌తో ‘ఖైదీ నంబర్‌ 150’లో చేసింది. ఇప్పుడు తమిళ సూపర్‌స్టార్‌తో చేయబోతుంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ బాణీలు సమకూర్చనున్నాడు. మాస్‌ ప్రేక్షకులను అలరించేవిధంగా ఈచిత్రం తెరకెక్కనుంది.

ఎలా చెక్ పెడుతుందో…
కాజల్ అగర్వాల్‌కు  ఇటు  టాలీవుడ్ అటు కోలీవుడ్‌లో మంచి క్రేజ్  ఉంది. కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా ఈ అమ్మడు ఈమధ్య లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టిపెట్టింది. ‘అ..!’ సినిమాతో టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకున్న కాజల్ ఇప్పుడు కోలీవుడ్‌లో ‘పారిస్ పారిస్’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. బాలీవుడ్ ‘క్వీన్’కు ఈ సినిమా రీమేక్ అన్న విషయం  అందరికీ తెలిసిందే. సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఇందులో కాజల్ కొంచెం కొత్తగా కనిపిస్తున్నప్పటికీ బాలీవుడ్ మూవీలో నటించిన కంగనా రనౌత్‌తో పోలికలు కనిపిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా రీమేక్ కథలలో తమదైన ముద్ర ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కాజల్‌లో మాత్రం పెద్దగా తేడా కనిపించడం లేదనే టాక్ వస్తోంది. మరి ఇలాంటి టాక్‌కు అమ్మడు ఎలా చెక్ పెడుతుందో చూడాలి. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రముఖ దర్శకుడు రమేష్ అరవింద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కన్నడ క్వీన్ రీమేక్‌కు కూడా అతనే దర్శకుడు. ఇక తెలుగుతో పాటు మలయాళంలో కూడా క్వీన్ రీమేక్ అవుతోంది.