పెళ్లి కొడుకును వెతికే పనిలో మావాళ్లున్నారు! 

కాజల్ పెళ్లి త్వరలోనే జరగ నుందని వార్తలు వస్తున్నాయి. దక్షిణాదిలో మంచి గుర్తింపు సంపాయించుకున్నకాజల్ ప్రస్తుతం కమల్ హాసన్ ’ఇండియన్-2‘ (‘భారతీయుడు 2’) లో నటిస్తోంది. జయంరవికి జోడీగా నటించిన ’కోమలి‘ సినిమా మంచి విజయం సాధించింది. ఆమె నటించిన ’ప్యారీస్ ప్యారీస్‘ విడుదలకు సిద్ధంగా ఉంది.కాజల్ చెల్లి నిషా అగర్వాల్ మొదట్లో సినిమాలు చేసినా .. ఆ తర్వాత  చక్కగా పెళ్ళిచేసుకుని పిల్లల్ని కంటుంటే.. కాజల్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఇంట్లో ఒత్తిడి చేస్తున్నారు. తన పెళ్లిపై వస్తున్న వార్తలపై ఇటీవల కాజల్ క్లారిటీ ఇచ్చింది…
 
“త్వరలోనే తన పెళ్లి విషయాన్ని అభిమానులకు తెలియజేస్తానని కాజల్ స్పష్టం చేసింది . తనకు పెళ్లి కొడుకును వెతికే పనిలో తన కుటుంబ సభ్యులు ఉన్నారని ఆమె వెల్లడించింది. తనకు దైవభక్తి ఎక్కువని… తనకు కాబోయే భర్తకు కూడా దైవభక్తి ఉండాలని ఆమె తేల్చి చెప్పింది. తాను ఎక్కడ షూటింగ్ కు వెళ్లినా చిన్న శివుడి విగ్రహాన్ని వెంట తీసుకెళ్తానని  కాజల్ పేర్కొంది. అయితే కాజల్‌కు కాబోయే భర్త ఎవరంటూ? ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే  సినిమా వ్యక్తిని ఆమె చేసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ‘ముంబయి సాగా’, ‘కాల్‌ సెంటర్‌’, ‘పారిస్‌ పారిస్‌’ వంటి తదితర చిత్రాల్లో కాజల్‌ నటిస్తోంది.
 
యుద్ధ విద్యలు తెలిసిన అమ్మాయి
కాజల్‌ తొలిసారి కమల్‌ సరసన కథానాయికగా సిల్వర్‌ స్క్రీన్‌మీద మ్యాజిక్‌ చేయబోతోంది. సంచలన విజయం సాధించిన ‘భారతీయుడు’ సీక్వెల్‌ ‘భారతీయుడు 2’లో నటిస్తుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఆమె వృద్ధురాలిగా కనిపించనుందట. అయితే ఆ వృద్ధురాలి వయసు మాత్రం చెప్పనని అంటోంది కాజల్‌. ‘ఇందులో నేను యుద్ధ విద్యలు…స్వీయ రక్షణ కళలు తెలిసిన అమ్మాయిగా కనిపిస్తాను. కానీ నా పాత్ర వయసు గురించి చెప్పను. వచ్చే నెలలో తైవాన్‌లో చిత్రీకరణలో నేను కూడా పాల్గొంటాను’ అని తెలిపింది. ‘ఇందులో కమల్‌ సేనాపతిగా 90ఏండ్ల ముదుసలిగా కనిపించనున్నారు. ఈ పాత్ర చేసే వైవిధ్యమైన యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తాయి’ అని స్టంట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌ తెలిపారు. కాజల్‌తోపాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.