సినిమా అనేది ఛారిటీ కాదు.. తగ్గ ప్రతిఫలం దక్కాల్సిందే!

“నేను రెమ్యూనరేషన్‌ విషయంలో క్లారిటీగా ఉంటా. మంచి పాత్ర లభించి, అది కష్టంగా ఉంటుందనిపిస్తే.. పారితోషికం విషయంలో కాస్త డిమాండ్‌గా ఉంటా. ఎందుకంటే సినిమా అనేది ఛారిటీ కాదు.. నటన అంత సులభమూ కాదు. చెమటోడ్చి పని చేసినప్పుడు.. దానికి తగ్గ ప్రతిఫలం దక్కాల్సిందే’’ అని అంటోంది కాజల్‌. సినిమా ఛారిటీ కాదు. పక్కా వ్యాపారం..అని అందరికీ తెలుసు. హీరో నుంచి టెక్నీషియన్ల వరకూ ఎవరూ తమ పారితోషికం తగ్గించుకోవడానికి ఇష్టపడరు. అలాగని కాజల్‌ ఛారిటీలకు దూరం అనుకుంటే పొరపాటే. పారితోషికం చేతిలో పడ్డాక ఆమె ఎక్కువగా ఖర్చు చేసేది సేవా కార్యక్రమాలకే . అరకు ప్రాంతంలో గిరిజనుల కోసం కాజల్‌ ఓ స్కూల్‌ నడిపిస్తున్నారు. అవకాశం ఉన్న ప్రతిసారీ అక్కడికి వెళ్లి.. ఆ స్కూల్లో చదివే విద్యార్థుల యోగ క్షేమాలు చూస్తారు. కానీ ఇవేమీ కాజల్‌ బయటకు తెలియనివ్వరు. ‘‘మనం చేసే పని అవసరార్థులకు ఉపయోగపడితే చాలు. ‘నేను ఫలానా వారికోసం ఇది చేశా.. అది చేశా’ అని డబ్బా కొట్టుకోవడం నాకు నచ్చదు. నిజంగానే నేను రెమ్యూనరేషన్‌ విషయంలో క్లారిటీగా ఉంటా. అలాగని చెత్త క్యారెక్టర్‌ ఇచ్చి డబ్బు ఆశ చూపితే.. అంగీకరించను’’ అని ఆమె అంటోంది.
 
రొటీన్‌ పాత్రలకు చెక్‌ పెట్టేశా!
గ్లామర్‌ పాత్రలతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన కథానాయిక కాజల్‌ రాబోయే చిత్రాల్లో భిన్న పాత్రల్లో కనిపించనుంది. ఇందులో భాగంగా ‘మోసగాళ్ళు’ చిత్రంలో మంచు విష్ణుకి సోదరిగా నటించింది. అలాగే త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళబోయే.. తమిళ సూపర్ స్టార్ విజయ్, మురుగదాస్ ‘తుపాకి 2’లో హీరోయిన్‌గా చేస్తోంది. అయితే ఈ సినిమాలో కాజల్ చేసేది సెకెండ్ హీరోయిన్ క్యారెక్టర్ అట. అయితే, హీరోయిన్ కి ఉన్నంత ఇంపార్టెన్స్ ఉంటుందని టాక్. వీటితోపాటు బాలీవుడ్‌లో ‘ముంబై సాగా’, కోలీవుడ్‌లో ‘ఇండియన్‌ 2’ చిత్రాల్లోనూ భిన్న పాత్రలు పోషిస్తోంది. అలాగే చిరంజీవి సరసన నటించబోయే ‘ఆచార్య’ చిత్రంలో కూడా కాజల్‌ పోషించే పాత్ర శక్తివంతంగా ఉండబోతోందని తెలుస్తోంది. పాత్రలు, సినిమాల ఎంపికలో మార్పుకి కారణం ఏంటి? అని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు కాజల్.. “నటిగా ఇకపై భిన్నంగా కనిపించాలను కుంటున్నా. అందుకే రొటీన్‌ పాత్రలకు చెక్‌ పెట్టేశా” అని కాజల్‌ సమాధానమిచ్చింది.
 
రానా ‘హాథీ మేరీ సాథీ’ లో గెస్ట్ రోల్
కాజల్ అగర్వాల్ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు ఆసక్తి చూపినట్టు సమాచారం. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రుపొందిస్తున్న ఓ వెబ్‌సిరీస్‌లో అందాల కాజల్ నటించేందుకు ఒప్పుకుందని తెలుస్తోంది. కాగా మొదట తమిళంలో తెరకెక్కనున్న ఈ వెబ్‌సిరీస్.. ఆ తర్వాత తెలుగులోకి కూడా విడుదల కానుంది. అది అలా ఉంటే.. రానా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ హాథీ మేరీ సాథీ’ లో రానాతో పాటు కాజల్ కూడా నటించిందట. అయితే ఈ చిత్రంలో కాజల్.. గెస్ట్ రోల్ చేసిందని టాక్. ఈ సినిమాలో గిరిజన యువతి పాత్రలో కీలక పాత్ర చేసిందట. అంతేకాదు గిరిజన యువతి పాత్ర కావడంతో బ్లౌజ్ లేకుండా చీర కట్టుతోనే కాజల్ కనిపిస్తుందట. ముప్పై నిమిషాల పాటు కాజల్ పాత్ర నిడివి ఉంటుందట. దానికోసం కాజల్ ఏకంగా 70 లక్షల పారితోషికం తీసుకుంతోందని టాక్.