లేడీ విలన్‌ గా స్టార్ హీరోయిన్‌

కాజల్ అగర్వాల్ దశాబ్దం నుంచి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. సౌత్‌లో చాలా మంది స్టార్ హీరోల సరసన కాజల్ అగర్వాల్ నటించిన విషయం తెలిసిందే. మూడు పదుల వయసులో కూడా కాజల్ క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన.. ‘క్వీన్’ రీమేక్‌‌గా తమిళంలో తెరకెక్కుతున్న ‘పారిస్ పారిస్‌’ చిత్రంలో కాజల్ నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కి మంచి స్పందన వచ్చింది.
అయితే ఇప్పటి వరకూ హీరోయిన్‌గా అలరించిన ఈ ముద్దుగుమ్మ త్వరలో విలన్‌గా దర్శనమివ్వనుందట. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో కాజల్ నెగెటివ్ రోల్‌లో నటిస్తున్నట్లు సమాచారం. ఓ ఆంగ్ల వెబ్‌సైట్ ప్రచురించిన కథనం ప్రకారం ఈ సినిమాలో కాజల్ ‘సీత’ అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బు పిచ్చి ఉన్న ఓ అమ్మాయి పాత్రలో కాజల్ మనకు కనిపిస్తుందని సమాచారం. కాజల్ కెరీర్‌లోనే తొలిసారిగా ఇలాంటి పాత్రలో నటిస్తుందని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మరి ఈ విషయంపై మనకు క్లారిటీ రావాలంటే కాస్త టైం పడుతుంది.
 
సాహసాలు చేయడానికి సిద్ధం !
నాడీ పోరాట కళలో నటి కాజల్‌ శిక్షణ తీసుకుంటున్నది. ఇప్పుడు హీరోయిన్లు హీరోలకు తీసిపోమంటున్నారు.  సినిమాల్లోనూ సాహసాలు చేయడానికి హీరోయిన్లు రెడీ అంటున్నారు. అందుకు వారు తగిన శిక్షణ తీసుకుంటున్నారు కూడా. ఇంతకు ముందు నటి అనుష్క ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ చిత్రాల కోసం కత్తిసాము, గుర్రపు స్వారీ లాంటి సన్నివేశాల్లో శిక్షణ తీసుకుని నటించింది. ఈ మధ్య నటి సమంత కూడా ‘సీమరాజా’ చిత్రం కోసం కర్రసాములో శిక్షణ తీసుకుని నటించింది. ఇక ఆ మధ్య నటి శ్రుతీహాసన్‌ ‘సంఘమిత్ర’ చిత్రం కోసం ఆస్ట్రేలియాలో కత్తిసాములో తర్ఫీదు పొందింది. అయితే అనివార్యకారణాల వల్ల ఆ చిత్రం ప్రారంభం కాలేదు. కాగా ఇప్పుడు అందాలతార కాజల్‌అగర్వాల్‌ సాహసాలు చేయడానికి సిద్ధం అవుతోంది. 
 
శంకర్‌ దర్శకత్వంలో కమల్‌కు జంటగా ‘ఇండియన్‌–2’లో నటించడానికి తనను తాను సిద్ధం చేసుకుంటోంది. ఈ అనూహ్య గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తన వంతు ప్రయత్నానికి ప్రిపేర్‌ అవుతోంది. 22 ఏళ్ల క్రితం కమలహాసన్‌ నటించిన ఇండియన్‌ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న చిత్రం ఇండియన్‌–2. అందులో కమలహాసన్‌ టైటిల్‌ పాత్ర నాడీ పోరాట కళతో అవినీతి పరులను శిక్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ నాడీ పోరాట కళను శంకర్‌ నటి కాజల్‌అగర్వాల్‌తో ప్రదర్శింపనున్నారు. ఇందుకోసం కాజల్‌ నాడీ పోరాట కళలో శిక్షణ తీసుకుంటోందట. ఈ కళ తనకు నిజజీవితంలోనూ ఉపయోగపడుతుందని భావించి సీరియస్‌గానే నాడీ పోరాట కళను నేర్చుకుంటున్నట్లు కాజల్‌ వర్గం పేర్కొన్నారు. పనిలో పనిగా కలరి(మలయాళంలో ప్రాచుర్య విద్య) విద్యలోనూ శిక్షణ పొందుతోందట. మొత్తం మీద ఇండియన్‌–2 చిత్రంలో కాజల్‌ను ఒక పోరాట నారీగా చూడవచ్చునన్న మాట.