వారిని ఆదుకోవడం కంటే సామాజికసేవ మరొకటి ఉంటుందా?

స్టార్‌ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ సీనియర్‌, యంగ్ హీరోలతో నటిస్తూ ఇటీవల బిజీగా గడిపారు. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్‌లు ఆగిపోవడంతో ఇంట్లోనే ఉంటూ లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ప్రచార హడావుడి లేకుండా సామాజిక సేవ చేయడంలో ముందుంటారు కాజల్‌. అరకు ఏజన్సీ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన గిరిజన పిల్లలకు ఉచిత విద్య, బాలికలు, యువతుల ఆరోగ్యానికి సంబంధించిన సేవలు, శానిటైజేషన్‌ లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు.
 
కాజల్‌ తనలో మానవత్వం తట్టిలేపిన ఓ విషయం గురించి చేసిన ట్వీట్‌ నెటిజన్ల హృదయాలను స్పందింప చేస్తోంది. అదేమిటంటే..
”మీకు సస్పెండ్‌ కాఫీ లేదా సస్పెండ్‌ మీల్స్‌ అంటే తెలుసా? మీకు తెలియకపోతే నేను చెబుతాను. నార్వేలో ఓ యువతి రెస్టారెంట్‌కు వెళ్లి కౌంటర్‌లో డబ్బులు ఇచ్చి ‘ఐదు కాఫీ.. అందులో రెండు సస్పెండెడ్’‌ అంటూ ఐదు కాఫీలకు డబ్బులు చెల్లించి.. మూడు కాఫీలు తీసుకుంది. మరో వ్యక్తి పది కాఫీలు చెప్పి ఐదు సస్పెండెడ్‌ అంటూ పది కాఫీలకు డబ్బులు చెల్లించి.. ఐదు కాఫీలే తీసుకున్నాడు. ఇంకో వ్యక్తి వచ్చి ‘ఐదు మీల్స్‌.. రెండు సస్పెండెడ్’‌ అంటూ ఐదు మీల్స్‌కు డబ్బులు చెల్లించి.. మూడు మీల్స్‌ ప్యాకెట్స్‌ తీసుకెళ్లాడు. ఆ తరువాత ఓ ముసలి వ్యక్తి రెస్టారెంట్‌కు వచ్చి కౌంటర్‌లో కూర్చున్న వ్యక్తితో సస్పెండెడ్‌ కాఫీ ఉందా? అని అడిగాడు. వెంటనే కౌంటర్‌లో ఉన్న వ్యక్తి ‘ఉంది’ అంటూ వేడి వేడి కాఫీని అందించాడు. ఆ తరువాత బాగా గడ్డం పెరిగి పేదవాడిలా కనిపించే మరో వ్యక్తి వచ్చి ‘సస్పెండెడ్‌ మీల్స్‌ ఉందా?’ అని అడిగితే.. ‘ఉంది’.. అంటూ వేడి వేడి భోజనం ప్యాక్‌ చేసిన పార్శిల్‌, ఓ వాటర్‌ బాటిల్‌ అందించాడు.
విషయం ఏమిటంటే ..అవకాశం ఉన్నవాళ్ళు ‘సస్పెండెడ్‌’ పేరుతో ఇబ్బందుల్లో ఉన్నవారి సహాయంకోసం రెస్టారెంట్ లో ఇస్తారు. దాన్ని రెస్టారెంట్ వారు అవసరంలో ఉన్నవారికి ఇచ్చి సహకరిస్తారు.సమాజంలో పేదరికం, ఆకలితో బాధపడే వారు ఎవరో మనకు తెలియదు. అలాంటి వారిని ఏదో ఒక రూపంలో ఆదుకోవడం కంటే సామాజిక సేవ మరొకటి ఉంటుందా? ఇలాంటి సహాయం యూరప్‌లోని కొన్ని దేశాల్లో జరుగుతున్నది. ఈ రకమైన స్వచ్ఛంద సంస్థ సేవ పలు దేశాలకు విస్తరిస్తున్నది. మనం కూడా ఇలాంటి సేవలు అందించే స్థాయికి చేరుకోవాలని అశిస్తున్నాను” అంటూ కాజల్‌ అగర్వాల్‌ ట్వీట్‌ చేసి నెటిజనుల ప్రశంసలు అందుకుంటోంది.
విలువైన పాఠాలు వినడానికి వీలు చిక్కింది!
తాను భగవద్గీత, శ్రీమద్భాగవతము వింటున్నానని కాజల్‌ అగర్వాల్‌ వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం మరో కథానాయిక తమన్నా సైతం భగవద్గీత శ్రవణం, వేద పఠనంలో తనకు స్వాంతన లభిస్తోందనీ, పురాణ ఇతిహాసాలను చదువుతూ అర్థం చేసుకుంటున్నానని వెల్లడించిన విషయం విధితమే. లాక్‌డౌన్‌ సమయాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించుకోవడానికి వినియోగిస్తున్న తారల జాబితాలో తాజాగా కాజల్‌ కూడా చేరారు. ‘‘భగవద్గీత, శ్రీమద్భాగవతము… ఈ కథలంటే నాకు ఎల్లప్పుడూ ఆసక్తి ఉంటుంది. నా దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. చివరకు, వీటిలోని విలువైన పాఠాలను వినడానికి.. అర్థం చేసుకోవడానికి ఇప్పుడు వీలు చిక్కింది’’ అని కాజల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’, కమల్‌ హాసన్‌ ‘ఇండియన్‌ 2’, మంచు విష్ణు ‘మోసగాళ్ళు’ చిత్రాలు చేస్తున్నారామె.