క్రేజ్ తగ్గినా.. ఆమె రేంజ్ మాత్రం తగ్గ లేదు !

పూజా హెగ్డే, కియరా అద్వానీ వంటి వర్థమాన కథానాయికలు.. టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో వరుస ఆఫర్లు కొట్టేస్తున్నారు. అందుకే దశాబ్దకాలంగా పలువురు అగ్ర కథానాయకులతో ఆడిపాడిన కాజల్ అగర్వాల్ వంటి ముద్దుగుమ్మలు రేసులో కాస్త వెనుకబడ్డారు. కథానాయికగా మునుపటి క్రేజ్ లేకపోయినా పారితోషికం విషయంలో ఏమాత్రం పట్టు వీడడం లేదు కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈమె తన అప్‌కమింగ్ మూవీకోసం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటోందట. డిమాండ్ దృష్ట్యా కాజల్ ఏమాత్రం తగ్గలేదనడానికి ఆమె తీసుకుంటోన్న పారితోషికమే ఉదాహరణ. చిరంజీవి రీ-ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ కోసం.. కోటి 75 లక్షలు రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసి సాధించుకుంది కాజల్. ఇక.. ‘ఖైదీ..’ తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘మెర్సల్’, ‘ఎమ్.ఎల్.ఎ’ వంటి విజయాలను తన ఖాతాలో వేసుకున్న కాజల్.. ఇప్పుడు అదే పారితోషికాన్ని తేజ-బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకూ అందుకుంటుందట. కాజల్ క్యారెక్టర్ ఈ సినిమాకి బాగా ప్లస్ అవుతుందని భావించిన నిర్మాత అనిల్ సుంకర.. కాజల్‌కు అంత భారీ పారితోషికాన్ని ఇస్తున్నాడట.
ప్రస్తుతం కాజల్.. బెల్లంకొండ శ్రీనివాస్‌తోనే రెండు సినిమాలు చేస్తుంది. వీటిలో ఒక చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తుండగా.. మరొక చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు. ఇక కాజల్ మరో చిత్రం ‘క్వీన్’ రీమేక్ తమిళ వెర్షన్ ‘పారిస్ పారిస్’.. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. నవంబర్‌లో ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రానుంది.
వీటితోపాటు విజయ్ దేవరకొండతో సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మించే చిత్రంలోనూ నటించడానికి కాజల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకి ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించనున్నాడు. ఆద్యంతం యూరప్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందట. మరోవైపు.. అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ సినిమాలోనూ కాజల్అతిధిగా  అలరించబోతున్నట్టు వార్తలొచ్చాయి. అగ్ర కథానాయకులతో కాస్త తగ్గినా వరుస ఆఫర్లతో ఫుల్‌బిజీగా ఉంది కాజల్. 
ఫైలట్‌గా మారి మరో సాహసం
అందం, అభినయంతో ఓ పక్క ప్రేక్షకులను అలరిస్తూనే మరో పక్క సాహసాలు చేస్తూ కాజల్‌ అందరినీ సర్‌ప్రైజ్‌ చేస్తోంది. ఇటీవల కొండచిలువను మెడలో వేసుకుని ఓ సాహసం చేస్తే, తాజాగా ఫైలట్‌గా మారి మరో సాహసం చేసింది. తన స్నేహితులతో కలిసి కౌలలాంపూర్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌(విమానం)ను నడిపింది. ‘నాకు సాహసాలు చేయడం ఇష్టం. ఇటీవల స్నేహితులతో కలిసి కౌలలాంపూర్‌ వెళ్ళినప్పుడు చిన్న జెట్‌ విమానం ఎక్కాం. నలుగురు కూర్చొనే చిన్న విమానం అది. నడపాలనిపించింది. ఫైలట్‌కు ఆ విషయాన్ని చెప్పాం. ఆయన ఒప్పుకున్నారు. ఫైలట్‌ పక్కనే కూర్చుని సలహాలిస్తుండటంతో నేను ఫ్లైట్‌ను నడిపేశా. ఇది నాకెంతో థ్రిల్‌నిచ్చింది. నా జీవితంలో ఈ స్పెషల్‌ మూమెంట్‌ను మర్చిపోలేను’ అని తెలిపింది.