ఇక్కడేమో ఫ్లాపులు… అక్కడేమో సూపరు !

కాజల్ అగర్వాల్..  ఈ మధ్య తెలుగులో చేసిన ‘సీత’, ‘రణరంగం` సినిమాలు పరాజయాలుగా నిలిచాయి. దీంతో ఆమెకు టాలీవుడ్ నుంచి అవకాశాలు పెద్దగా రావడం లేదు. అయితే ఇటీవల విడుదలైన తమిళ సినిమా`కోమాలి`ఘనవిజయంగా నిలిచింది.
తమిళంలో కాజల్ అగర్వాల్ నటించిన `పారిస్ పారిస్` విడుదలకు ముందే సెన్సార్ సమస్యలతో సంచలనంగా మారినా.. బిజినెస్ మాత్రం అంతంత మాత్రం గానే జరిగింది.ఇటీవల విడుదలైన `కోమాలి` సినిమా ఘనవిజయంగా నిలిచింది. `పారిస్ పారిస్` కూడా విజయం సాధిస్తుందని కాజల్ ధీమాగా ఉంది. మరోవైపు కమల్-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం `భారతీయుడు2`లో నటిస్తోంది. తాజాగా మరో బంపరాఫర్ కాజల్ చెంతకు వచ్చింది. తమిళ స్టార్ హీరో సూర్య సరసన మరోసారి నటించే అవకాశం కాజల్‌కు దక్కింది. గతంలో `మాట్రన్` సినిమాలో కలిసి నటించిన సూర్య, కాజల్.. శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో మరోసారి కలిసి కనిపించబోతున్నారు. ఇలా, తెలుగులో అవకాశాలు తగ్గిపోయినా వరుస సినిమాలతో కాజల్ కోలీవుడ్‌లో దూసుకుపోతోంది.
 
మన నిత్య జీవితంలో జరిగేవే
‘మా కష్టాన్ని వృథా చేయకండి’’ అని వాపోతున్నారు కాజల్‌ అగర్వాల్‌. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ప్యారిస్‌ ప్యారిస్‌’. హిందీ హిట్‌ చిత్రం ‘క్వీన్‌’కు ఇది తమిళ రీమేక్‌. హిందీ ‘క్వీన్‌’ చిత్రం తెలుగు వెర్షన్‌ ‘దటీజ్‌ మహాలక్ష్మి’గా మలయాళంలో ‘జామ్‌ జామ్‌’గా, కన్నడలో ‘బటర్‌ఫ్లై’గా రీమేక్‌ అయ్యాయి. ‘జామ్‌ జామ్‌’, ‘బటర్‌ ఫ్లై’ చిత్రాలకు సెన్సార్‌ బోర్డ్‌ యుఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ ను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి పాతిక కత్తెర్లు ఇచ్చింది సెన్సార్‌ బోర్డ్‌. దీంతో చిత్రబృందం రివైజింగ్‌ కమిటీకి వెళ్లింది.
 
ఇటీవల ఈ విషయంపై కాజల్‌ అగర్వాల్‌ స్పందిస్తూ –‘‘హిందీ ‘క్వీన్‌’ చిత్రాన్ని దక్షిణాది ప్రేక్షకులకు చూపించాలని ఓ మంచి ప్రయత్నం చేశాం. కానీ సెన్సార్‌ వారు ఇన్ని కట్స్‌ చెప్పారన్నప్పుడు షాకయ్యాను.వారు చెప్పిన కట్స్‌లో చాలా సన్నివేశాలు మన నిత్య జీవితంలో జరిగేవే ఉన్నాయి. ఈ సినిమా కోసం చాలా కాలం సమష్టిగా కష్టపడ్డాం. ఆ కష్టానికి తగ్గ ఫలాన్ని అందుకోవాలనుకున్నప్పుడు ఇలా జరుగుతోంది. ఎటువంటి సెన్సార్‌ కట్స్‌ లేకుండానే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
 
హాలీవుడ్ సినిమాలో
మంచు విష్ణు ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు కాజల్‌ అగర్వాల్ కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కాజల్‌, విష్ణు సరసన హీరోయిన్‌గా నటించటం లేదట. ఈ ఇద్దరు ఈ మూవీలో అన్నా చెల్లెల్లుగా కనిపించనున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్నా చెల్లెల్ల పాత్రలు కీలకం కావటంతో విష్ణు, కాజల్‌లు అంగీకరించినట్టుగా తెలుస్తోంది.
 
ప్రశాంత్ వర్మ ‘ఆ’ సీక్వెల్ లో
ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ప్రశాంత్‌ వర్మకు ఆఫర్‌లు కూడా బాగానే వచ్చాయి.ఇటీవల కల్కి సినిమాతో మరోసారి ఆకట్టుకున్న ప్రశాంత్‌, త్వరలో అ! సినిమాకు సీక్వెల్‌ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.