“అది అబద్దం కాదు . కానీ…”

కాజల్‌అగర్వాల్‌…  50 చిత్రాలు చేసిన తరువాత కొలీవుడ్‌లో ఒక లక్కీ అవకాశం ఈ అమ్మడిని వరించింది. అదే స్టార్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో ‘విశ్వనటుడు’ కమలహాసన్‌తో జత కట్టే అవకాశం. సాధారణంగా శంకర్‌ చిత్రాల్లో కథానాయికలకు నటనకు మంచి అవకాశం ఉంటుంది. తాజాగా ‘ఇండియన్‌–2′(భారతీయుడు2) చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌కు అలాంటి పాత్రనేనట. ఇది చెప్పుకుని ఈ బ్యూటీ తెగ సంబరపడపోతోంది. మరోపక్క హిందీ చిత్రం ‘క్వీన్‌’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇది హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రం అన్న విషయం తెలిసిందే. దీంతో రెట్టింపు ఉత్సాహంతో ఉంది.

కాజల్‌ చూడడానికి చాలా సాఫ్ట్‌గా ఉన్నా, కోపం వస్తే కాళికగా మారిపోతుందట. ఈ విషయాన్ని ఇటీవల ఒక భేటీలో తనే చెప్పింది. తాను కథానాయకిగా పరిచయమై దశాబ్దం దాటిందని చెప్పింది.తాను ఉత్తరాదికి చెందిన యువతిని అయినా, ఇక్కడ తమిళ అమ్మాయిగానే చూస్తున్నారని, ఇది  చాలా సంతోషంగా ఉందని అంది. ఇకపోతే, తన మార్కెట్‌ పడిపోతుందని తానెప్పుడూ భయపడలేదని చెప్పింది. అందుకు కారణం.. వరుసగా అవకాశాలు తనను వెతుక్కుంటూ వస్తూనే ఉన్నాయని చెప్పింది. అందుకే ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను పక్కన పెట్టేశానని తెలిపింది. ప్రేమ వివాహమా? పెద్దలు కుదిరిచ్చిన వివాహం చేసుకుంటారా? అని చాలా మంది అడుగుతున్నారని, తనకు నచ్చిన వాడు తారసపడితే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని, లేని పక్షంలో పెద్దలు నిర్ణయించిన పెళ్లే చేసుకుంటానని చెప్పింది. ఇప్పుటి వరకూ మంచి చిత్రాలు చేస్తున్నానని అంది.

మరో విషయం ఏమిటంటే.. తాను చాలా ధైర్యవంతురాలినని, తనను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసునని చెప్పింది. తనకు కోపం వస్తే కాళికగా మారిపోతానని పేర్కొంది. ఒక సారి తన స్నేహితురాలిని ఒక వ్యక్తి వేధింపులకు గురి చేశాడని,అప్పుడు తాను అతని చొక్కా కాలర్‌ పట్టుకుని ముఖం పచ్చడయ్యేలా కొట్టానని చెప్పింది. ఇకపోతే అవకాశాల కోసం పడకగదికి పిలుస్తున్నారని కొందరు చెబుతున్నారని, ‘అది అబద్ధం కాదని అంది.అయితే అలాంటి సంఘటనలను తానెప్పుడూ ఎదుర్కోలేద’ని కాజల్‌అగర్వాల్‌ అంది. అదే విధంగా అన్ని రంగాల్లోనూ చెడ్డవాళ్లు ఉంటారని అంటోంది .