అవే నాకు విజయాల్ని తెచ్చిపెడుతున్నాయి!

సీనియర్‌ కథానాయికలు, నూతన తారలని కాకుండా అంకితభావంతో పనిచేసినవారే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతారని చెబుతున్నది కాజల్‌ . కష్టపడేతత్వమే ఇండస్ట్రీలో మన స్థానమేమిటో నిర్ణయిస్తుందని అంటోంది కాజల్‌ అగర్వాల్‌. అగ్ర కథానాయకులతో పాటు కొత్త హీరోలతో జోడీకడుతూ సుదీర్ఘ కాలంగా చిత్రసీమలో ప్రయాణాన్ని సాగిస్తున్నది కాజల్‌ .స్టార్‌ హీరోలతో మాత్రమే నటించాలి, పెద్ద సినిమాలు మాత్రమే చేయాలనే ప్రణాళికలు వేసుకొని ఎప్పుడూ నటించలేదని చెబుతున్నది. కాజల్‌ మాట్లాడుతూ..
“ఏ హీరోతో నటిస్తున్నాననే దాని కంటే కథ బాగుందా? నా పాత్రకు ప్రాధాన్యత ఎంతుంది? అనే విషయాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. ఆ విషయంలో ఎప్పుడూ రాజీపడను. కెరీర్‌ ఆరంభంలో సినిమా ఫలితం ఎలా ఉంటుందో.. ప్రేక్షకులు నన్ను ఎలా స్వీకరిస్తారో అనే భయాలు ఉండేవి. తప్పొప్పుల గురించి చిత్రబృందంతో చర్చిస్తే ఏమనుకుంటారో అని ఆలోచించేదాన్ని. సుదీర్ఘ కెరీర్‌ నేర్పిన పాఠాలతో.. ప్రస్తుతం పాత్రల ఎంపికలో నా ఆలోచన విధానం మారింది. అవే నాకు విజయాల్ని తెచ్చిపెడుతున్నాయి. భయాలు తొలగిపోయాయి. పరిణితితో నా మనసుకు నచ్చిన సినిమాల్ని ఎంచుకునే స్వేచ్ఛ దొరికింది” అని అంటోంది కాజల్‌.
 
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నా!
కరోనా కారణంగా తాను ఇంటి పట్టున ఉన్నప్పటికీ, సమయాన్ని వృథా చేయడం లేదని కాజల్ చెప్పింది. కరోనా కారణంగా షూటింగులన్నీ కూడా కేన్సిల్ అయ్యాయి. దాంతో తారలంతా కూడా స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. ఎవరి మనసుకు నచ్చిన పనులను వాళ్లు చేస్తూ, కాలక్షేపం చేస్తున్నారు.
“ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవడం తనకి అలవాటనీ, తాను నేర్చుకునేది.. జీవితంలో ఎంతవరకూ ఉపయోగపడుతుందనే విషయాన్ని గురించి తాను ఎప్పుడూ ఆలోచించనని కాజల్ చెప్పింది. తన మనసుకి నచ్చిన పనులను చేస్తూ వెళతాననీ, అప్పుడే తనకి సంతోషంగా అనిపిస్తూ ఉంటుందని చెప్పింది. అలా ప్రస్తుత పరిస్థిలోతుల్లో తాను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నానని అంది. సమయాన్ని వృథా చేయడం లేదనే సంతృప్తితో రోజులు గడుస్తున్నాయని కాజల్ చెప్పింది.
 
వారితో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలి!
టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లో కూడా స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈమె ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటిస్తోంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం పూర్తయినా కూడా కాజల్ క్రేజీ స్టార్‌గానే కొనసాగుతోంది. తాజాగా ఆమె తమిళ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్‌ల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది…
 
“తమిళ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్‌లతో కలిసి సినిమాల్లో నటిస్తున్న సమయంలో నేను చాలా ఎంజాయ్ చేశాను. వారిద్దరు చాలా గొప్ప నటులు అయినా కూడా.. తోటి నటులను గౌరవిస్తారు. వారితో నటించడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఇండస్ట్రీలో అత్యంత టాలెంట్ ఉన్న హీరోల్లో విజయ్ ఒకరు. ఆయన చాలా సహజంగా నటిస్తారు. సెట్స్‌లో ఉన్న సమయంలో విజయ్ ప్రపంచాన్ని మరిచిపోయి సినిమా గురించే ఆలోచిస్తారు. అందుకే ఆయనంటే ఒకరకమైన ప్రేమ, అభిమానం. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని కోరుకుంటాను. ఇక అజిత్ అద్భుతమైన వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయనది. అందుకే అజిత్ అంటే కూడా నాకు చాలా ప్రేమ. ఆయనతో కూడా మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను”అని చెప్పింది కాజల్ అగర్వాల్.