నేను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగడం వెనుక కారణం అదే !

కాజల్ అగర్వాల్.. గతేడాది గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్ కూడా పక్కాగా ప్లాన్‌ చేస్తుంది. ఫుల్‌ బిజీగా మారింది. ‘లక్ష్మీ కల్యాణం’ తో టాలీవుడ్‌ తెరపై మెరిసిన కాజల్‌ నేటికీ టాప్‌ హీరోయిన్‌గానే కొనసాగుతోంది. మోడల్‌గా అడుగుపెట్టిన కాజల్‌ అగర్వాల్‌ తొలుత ‘క్యూ హో గయానా’ చిత్రంతో ప్రారంభించి… ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వం లో తెరకెక్కిన ‘లక్ష్మి కళ్యాణం’ మూవీతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. తెలుగులో వరుస అవకాశాలు ఆమెను వరించాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’ చిత్రం కాజల్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన సంగతి తెలిసిందే. ఆమె తెలుగులో తొలి చిత్రం ‘లక్ష్మి కళ్యాణం’ కి 23 లక్షల రెమ్యునరేషన్‌ అందుకుంది. ఇటీవలె మంచు విష్ణతో చేసిన ‘మోసగాళ్లు’ చిత్రానికి గాను అత్యధిక రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిందట. ఇప్పటికీ ఒక్కో సినిమాకు దాదాపు 2 కోట్ల వరకు అడుగుతుందట .

ప్రస్తుతం ముంబైలో ఓ విలాసవంతమైన భవనంలో నివసిస్తున్న కాజల్‌ ఇప్పటివరకు దాదాపు రూ. 80 కోట్ల వరకు ఆస్తులను కూడబెట్టిందని అనుకుంటున్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే.. తనవంతు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటుంది కాజల్‌. ప్రస్తుతం కాజల్‌ మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’, కమల్‌ హాసన్‌ ‘ఇండియన్‌-2’లో.. వీటితో పాటు నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ విషయంలో నేను సక్సెస్‌ అయ్యా !

# సినిమాల్లోకి వచ్చి పదిహేడేండ్లు గడిచిపోయాయి. నా జర్నీ చాలా హ్యాపీగా సాగింది. ఈ ప్రయాణంలో కొన్ని తప్పులు జరిగాయి. అందుకు నేనేం ఫీలవ్వడం లేదు. ఆ తప్పులే జీవిత పాఠాలు చెప్పాయి. నన్ను మిన్నగా నిలబెట్టాయి. పొరపాట్లు అందరూ చేస్తారు. అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. ఈ విషయంలో నేను సక్సెస్‌ అయ్యాననే భావిస్తున్నా.

  • దాదాపు ఏడాదిన్నపాటు ప్రపంచమంతా భయానక పరిస్థితుల్లో ఉండిపోయింది. కొవిడ్‌, లాక్‌డౌన్‌ అన్ని రంగాలను దెబ్బతీశాయి. సినిమా ఇండస్ట్రీకి ఇది పరీక్షా కాలం. ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌ ఇంత దారుణంగా దెబ్బ తీస్తుందని ఊహించలేదు. అయిన వారిని కోల్పోయి ఎన్నో కుటుంబాలు ఆవేదనలో కూరుకు పోయాయి. వారందరికీ నా సానుభూతి. ఇలాంటి సమయంలోనే దృఢంగా ఉండాలి. మరింత బలంగా తయారవ్వాలి.
  • లాక్‌డౌన్‌లో షూటింగ్స్‌ లేకపోవడంతో కాస్త తీరిక దొరికింది. అలాగని తింటూ కూర్చోలేం కదా! ఏదో ఒక వ్యాపకం ఉంటేనే మనసుకు ఊరట. అందుకే, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా. మెటాఫిజిక్స్‌, ఆస్ట్రానమీలో వర్చువల్‌ క్లాస్‌లు వింటున్నా. భగవద్గీత తరగతులు కూడా ఫాలో అవుతున్నా. ఆరోగ్యకర ఆహారం తీసుకుంటున్నా. హాయిగా వర్కవుట్లు చేసుకుంటున్నా. హ్యాండీక్రాఫ్ట్స్‌ చేస్తున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా టీచర్‌ అవతారమెత్తి మా పనిమనిషి ఐదేండ్ల కొడుక్కి ఇంగ్లిష్‌ చెబుతున్నా.
  • బాలీవుడ్‌లో ‘ఉమ’ అనే సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఇందులో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నా. ఫాంటసీ ఎలిమెంట్స్‌తో సబ్జెక్ట్‌ బాగా నచ్చింది. విభిన్న షేడ్స్‌ ఉన్న ఈ పాత్రను చాలెంజ్‌గా తీసుకున్నా. కథ, పాత్ర తీరుతెన్నుల గురించి దర్శకుడితో జూమ్‌లో డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లోనే షూటింగ్‌ మొదలవుతుందని ఆశిస్తున్నా.
  • దక్షిణాది ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను మరచిపోలేను. దక్షిణాదిలో కమర్షియల్‌ సినిమాల్లో నటించాను. మంచి సబ్జెక్టివ్‌ సినిమాలూ చేశాను. రకరకాల పాత్రలు పోషించాను. ఇక్కడి ప్రతిభావంతులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను.
  • సినిమాల్లోకి వచ్చిన కొత్తలో దక్షిణాది భాషలు అస్సలు అర్థమయ్యేవి కావు. ఇప్పుడు తెలుగు అనర్గళంగా మాట్లాడుతున్నా. తమిళం కూడా! కన్నడం, మలయాళం అర్థం చేసుకుంటా. భాషలపై పట్టు సాధించడానికి నేను చాలానే కష్టపడ్డాను. షూటింగ్‌ స్పాట్‌లో దర్శకుడు, ఇతర టెక్నీషియన్స్‌తోనూ మాట్లాడేదాణ్ని. ఇప్పుడు తెలుగులో యాసలు కూడా మాట్లాడగలను. అయినా, భావోద్వేగాలను పండించడానికి భాష రావాల్సిన పన్లేదు. కథను, పాత్రను అర్థం చేసుకోగలిగితే.. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలిగితే సన్నివేశాన్ని పండించగలం.
  • ఒక పని మొదలు పెట్టినప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. వాటికి బెదిరి పోవద్దు. మధ్యలో వెనుదిరిగే మనస్తత్వం కాదు నాది. ధైర్యంగా ముందుకు వెళ్లడమే తెలుసు. ఇన్నేండ్లు నేను ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగడం వెనుక కారణం కూడా ఇదే అనుకుంటా!
  • లాక్‌డౌన్‌తో థియేటర్లు కళ తప్పిన మాట వాస్తవమే. ఈ సమయంలో ఓటీటీ వేదిక ఇంటింటికీ పరిచయమైంది. అలాగని, ఓటీటీ ఎప్పుడూ థియేటర్లకు ప్రత్యామ్నాయం కాదు. నేను నటించిన వెబ్‌సిరీస్‌ ‘లైవ్‌ టెలికాస్ట్‌’ ఓటీటీలో రిలీజై సక్సెస్‌ సాధించడం ఆనందంగా ఉంది.
  • ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ ఫాలో అవుతుంటా. కంఫర్ట్‌గా ఉండేవే ధరిస్తాను. జీన్స్‌, టీషర్ట్‌ వంటి మోడర్న్‌ డ్రెస్‌లు వెసుకుంటా. అనామికా ఖన్నా, రాహుల్‌ మిశ్రా వంటి డిజైనర్ల దుస్తులు ధరిస్తాను, ఫుట్‌
    పాత్‌పై దొరికే దుస్తులూ కొంటాను. మంచి జువెలరీ కలెక్షన్‌ ఉంది నా దగ్గర. వజ్రాభరణాలంటే ఇష్టం.
  • ఆహారం విషయంలో మరీ స్ట్రిక్ట్‌గా ఏమీ ఉండను. అలాగని చిరుతిండ్లు, ఆయిలీ ఫుడ్‌ తినను. హెల్దీడైట్‌ ఫాలో అవుతాను. బ్రేక్‌ ఫాస్ట్‌లోకి జొన్నరొట్టె తీసుకుంటా. కాసేపయ్యాక పండ్లు తింటాను. లంచ్‌ టైమ్‌లో అన్నం, పప్పు, కూరలు తీసుకుంటాను. సాయంత్రం సాండ్‌విచ్‌, రాత్రి డిన్నర్‌లోకి అన్నం తింటాను.ఏం తిన్నా మితంగానే. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఫైబర్‌ సరైన మోతాదులో ఉండేలా డైట్‌ పాటిస్తాను.