అదే నా సక్సెస్‌ సీక్రెట్‌ !

ఎంచుకున్న కథలు, సినిమాలే ఎక్కువ సంతృప్తినిచ్చాయి. నేను చేసిన ప్రతి సినిమా మనసు పెట్టే చేసాను. నటనను వృత్తి కన్నా బాధ్యతగా భావిస్తాను. అదే నా సక్సెస్‌ సీక్రెట్‌!….అని అంటోంది అందాల తార కాజల్ అగర్వాల్
నాపక్కన చేస్తున్నది సీనియరా? జూనియరా? అనేది పట్టించుకోను. ఎవరి పక్కన చేసినా పాత్రలో ఒదిగిపోతుంటాను కనుక,.. ‘అందరి పక్కన నేను సరిపోతాను’ అని నా దర్శకనిర్మాతలు అనుకోవడం నాఅదృష్టం. అదేవిధంగా నాప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరించడం … అన్నిటికన్నా గొప్ప అదృష్టం. ఇన్ని అదృష్టాలు ఉండడంవలనే ఇప్పటికీ హీరోయిన్‌గా కొనసాగగలుగుతున్నాను.
 
డబ్బు కాదు… నా పాత్ర, కధ ముఖ్యం !
డబ్బు కోసమే సినిమాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ డబ్బు కోసం సినిమాలు చేయలేదు. ఆ మధ్య ఓ సినిమా కోసం నా దగ్గరకి వచ్చారు. అప్పుడు నేను తీసుకుంటున్న మొత్తం ఇవ్వలేమనీ, తగ్గించమని అడిగారు. ‘ఎంత ఇవ్వదలుచుకున్నారో అంతే ఇవ్వండి. నాకు డబ్బు ముఖ్యం కాదు. నా పాత్ర, కథా ముఖ్యం’ అన్నాను. సినిమా విడుదలైన తరువాత మొదట ఇస్తామన్న దానికన్నా కొంత ఎక్కువే ఇచ్చారు. మరో సినిమాకి నాకు నేనుగా తక్కువ రెమ్యునరేషన్‌ అడిగాను. అసలు ఏనిర్మాతను ‘ఇంత ఇవ్వండి’ నేను అడగలేదు. కానీ “కాజల్‌ ఇంత పుచ్చుకుంటుంది….అంత పుచ్చుకుంటుంది” అంటూ లేనిపోని వార్తలు సృష్టించేస్తున్నారు. నా ప్రమేయం లేకుండా వచ్చే వార్తలను ఖండించడం కూడా మానుకున్నాను.
నా మెచ్యూర్టీ లెవల్స్‌ ఎక్కువ !
మామూలు అమ్మాయిగా ఉండిఉంటే నాది చాలాచిన్న ప్రపంచం. సినిమాల్లోకి రావడం వల్ల పెద్ద ప్రపంచం పరిచయమైంది. ఈ రంగంలో ఎన్నో విషయాలు నేర్చుకునే వీలు ఉంటుంది. నా పదేళ్ల కెరీర్‌… జీవితం గురించి ఇంకో పదేళ్లకు సరిపడా విషయాలను నేర్పించింది. నాస్నేహితులందరికన్నా నా మెచ్యూర్టీ లెవల్స్‌ ఎక్కువ. జీవితం గురించి వారికన్నా నాకున్న అవగాహన ఎక్కువ. ఒక సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? వ్యక్తులను ఎలా డీల్‌ చేయాలి? అనేది ఇక్కడ నేర్చుకున్నాను.