నా మనసు… ‘మంచి కథే ఒప్పుకో’ అనాలి!

“నా మనసు ఓకే చెబితేనే ఏ సినిమా అయినా చేసేందుకు ఒప్పుకుంటాను”అని అంటోంది అందాల తార కాజల్ అగర్వాల్. మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్…స్టార్ హీరోలతో నటించి తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇక నటిగా తన సుదీర్ఘ ప్రయాణం గురించి కాజల్ మాట్లాడుతూ…
 
“నటిగా నా వయసు దశాబ్దం దాటింది. ఇంతకాలం హీరోయిన్‌గా మనగలుగుతున్నానంటే కారణం… మంచి కథల ఎంపికే. నటిగా రంగ ప్రవేశం చేసిన తొలి రోజుల్లో వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించేదాన్ని.అది ఒకరకంగా మంచి అనుభవాన్నే ఇచ్చింది. నాలో పరిణితి పెరిగింది. ఇప్పుడు మాత్రం మంచి కథలను ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నాను. దర్శకులు కథలు చెప్పినప్పుడు నా రోల్ బలమైనదా? అభిమానులకు నచ్చుతుందా? అందులో బాగా నటించగలనా? అని ఆలోచిస్తాను. చివరికి నా మనసు… ‘మంచి కథే ఒప్పుకో’ అని చెబితే ఆ చిత్రాన్ని అంగీకరిస్తాను. అలా ఒప్పుకొని నటించిన మంచి కథలే నన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. ఇక్కడ నిత్యం భిన్న మనస్తత్వాల మనుషులు కలుస్తుంటారు. వారితో ఎలా ప్రవర్తించాలన్న పరిపక్వత కూడా నాకు వచ్చింది ”అని కాజల్ పేర్కొంది.
 
నవ్వుతూ సంతోషంగా ఉండండి
‘నవ్వు మంచి మెడిసిన్‌’ అంటారు. ఆ మెడిసిన్‌ను ప్రతిరోజూ తీసుకోమంటారు కాజల్‌ అగర్వాల్‌. తన ట్వీటర్‌ ఫాలోయర్స్‌ 30 లక్షలకు చేరుకున్న సందర్భంగా నెటిజన్లతో చాట్‌ చేశారు కాజల్‌. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘మీరు నవ్వినప్పుడు చాలా అందంగా ఉంటారు. స్వచ్ఛంగా నవ్వడం మీకు ఎలా సాధ్యం ?’ అని ఓ నెటిజన్‌ అడిగితే…
‘‘మనలోని అంతరాత్మకు మన నవ్వు ప్రతిబింబం.నిజాయతీ గల నవ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇతరులకు మన పట్ల సద్భావం కలిగేలా చేస్తుంది. నవ్వును అలవాటుగా మార్చుకొని .. రోజూ నవ్వుతూ సంతోషంగా ఉండండి’’ అని చెప్పింది .
‘‘వివాహ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వివాహ బంధానికి నేను సిద్ధపడినప్పుడు పెళ్లి చేసుకుంటాను’’ అని పెళ్లి గురించి ఒకరు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ప్రస్తుతం ‘కాల్‌ సెంటర్’, ‘ఇండియన్‌ 2’, ‘ముంబై సాగ’ సినిమాలతో కాజల్‌ ఫుల్‌ బిజీ.