ఇక్కడ ఉండేది కొద్ది రోజులే ! మళ్లీ తిరిగి రాను !

 ఈ తరం తారలు ముఖ్యంగా కథానాయికలు ఫ్యూచర్‌ గురించి చాలానే ఆలోచిస్తున్నారన్నది కాదనలేని నిజం. ముఖ్యంగా సినిమానే జీవితం, నటనే శాశ్వతం అని వారు భావించడంలేదు. షూటింగ్‌కు వెళ్లామా, నక్షత్ర హోటళ్లలో గడిపామా, విదేశాల్లో ఎంజాయ్‌ చేశామా అని భావించే వాళ్లు ఒకప్పుడు ఉండేవారేమో, ఇప్పుడు లేరు. సినిమాలో నిలకడ నిరంతరం రాణించడం కష్టమనే నగ్న సత్యాన్ని గ్రహించి ఇక్కడ సంపాదించుకున్న డబ్బును ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టి అక్కడ లాభాలు గడిస్తున్నారు.

ప్రస్తుతం హీరోయిన్లుగా రాణిస్తున్న వారిలో తమన్నా తన తండ్రి నగల వ్యాపారంలో పాలు పంచుకుంటోంది. తాప్సీ తన మ్యారేజ్‌ ఎరేంజ్‌మెంట్స్‌ సంస్థను ప్రారంభించింది. ఇక నయనతార, త్రిష, నమిత, అనుష్క రియల్‌ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టి అక్కడ తమ సంపాదనను మరిన్ని రెట్లు పెంచుకుంటున్నారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అధునాతన వసతులతో కూడిన జిమ్‌ను నడుపుతోంది. ఇక నటి శ్రియ అలంకార వస్తువుల షాప్‌ను, నటి ఇలియానా వస్త్ర దుకాణం లాంటి ఇతర వ్యాపారాల్లో లాభాలు గడిస్తున్నారు.

ఇప్పుడు నటి కాజల్‌అగర్వాల్‌ ఇతర ఆదాయం కోసం దారులు వెతుక్కుంటోందని సమాచారం. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పుకొచ్చింది. దీని గురించి కాజల్‌ తెలుపుతూ… సినిమానే జీవితం, నటనే శాశ్వతం అనుకునే వారి పట్టికలో తన పేరు ఉండదని చెప్పింది. నిజానికి ఇక్కడ మార్కెట్‌ ఉన్నంత వరకే అవకాశాలు వస్తాయని, అది కాస్తా తగ్గితే నిర్మొహమాటంగా పక్కన పెట్టేస్తారని అన్నది. అందుకే ప్రతి కథానాయకి ఇతర రంగాలపై దృష్టి సారించాలని చెప్పింది. సినిమా తరువాత ఏమిటన్న ఆలోచన తనకూ వచ్చిందని, ఇతర వ్యాపార రంగంలోకి ప్రవేశించాలని భావిస్తున్నానని తెలిపింది. సినీతారలు ఇతర రంగాల్లో తమకు తగిన వ్యాపారాలను ఎంచుకోవాలని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చేసింది. తాను సినిమాను వదిలి ఇతర వ్యాపారంలోకి రంగప్రవేశం చేసిన తరువాత మళ్లీ తిరిగి రానని, ఇక్కడ ఉండేది కొద్ది రోజులేనని పేర్కొంది. మొత్తం మీద నటిగా సంపాదించిన డబ్బును  ఇతర రంగాల్లో ఇన్వెస్ట్‌ చేసి  భవిష్యత్ పరిణామాలకు కాజల్‌ రెడీ అయ్యిపోయిందని అర్ధమవుతోంది.

కాజల్‌ తమిళంలో అజిత్‌తో జత కట్టిన ‘వివేగం’, విజయ్‌తో రొమాన్స్‌ చేసిన ‘మెర్సల్’, అదే విధంగా తెలుగులో చిరంజీవితో నటించిన ‘ఖైదీ నంబర్‌ 150’, రానాకు జంటగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయన్నది తెలిసిందే.ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రాల్లో ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ చిత్రం ఒకటి. ఇది హిందీలో నటి కంగనా రనౌత్ పలు అవార్డులను గెలుచుకున్న ‘క్వీన్‌’ చిత్రానికి రీమేక్‌. ఈ చిత్రంతో తను పలు అవార్డులను అందుకుంటాననే నమ్మకాన్ని కాజల్‌ వ్యక్తం చేస్తోంది. ఇక నానీతో నటిస్తున్న ‘ఎంఎల్‌ఏ’ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది.