ఇంత మంచి టైమ్‌లో నేను ఉన్నందుకు ఎంతో సంతోషం !

‘మహిళలపై, మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాలు వస్తున్న ఈ టైమ్‌లో నేను నటిగా ఉండటం చాలా హ్యాపీగా ఉంది’ అంటోంది కాజోల్‌. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కాజోల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాపై జరిగిన చర్చ సందర్భంగా కాజోల్‌ మాట్లాడుతూ, ‘సోషల్‌ మీడియాలో స్పందించే టైమ్‌లో ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలి. నా వరకు నేను స్వీయ నియంత్రణని నమ్ముతాను. పవర్‌కి సంబంధించిన లాభానష్టాలేంటో సినీ స్టార్స్‌కి తెలుసు. సోషల్‌ మీడియాలో వచ్చే అంశాలపై మనం బాధ్యత వహించలేం. ప్రతి స్టార్‌ ట్వీట్‌ చేసే ముందు తన పదాల లిమిట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఇక్కడ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. అయితే మనం పోస్ట్‌ చేసే అంశం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి’ అని తెలిపింది.

ప్రస్తుత సినిమా పరిశ్రమ, సినిమాల తీరుతెన్నుల గురించి చెబుతూ, ‘గతంతో పోల్చితే ఇప్పుడు సినిమాల్లో చాలా మార్పు వచ్చింది. సహజంగా ఉండే, సమాజాన్ని ప్రతిబింబించే సినిమాలు వస్తున్నాయి. చాలా మంది పిచ్చి ప్యాషన్‌తో సినిమా రంగంలోకి వస్తున్నారు. కొత్త కథలను తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు మహిళలకు ప్రాధాన్యత పెరిగింది. ఇటీవల మహిళా ప్రధాన సినిమాలను ఎక్కువగా రూపొందిస్తున్నారు. మహిళల పాత్రలు కూడా చాలా శక్తివంతంగా ఉంటున్నాయి. అవి బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ఇలాంటి మంచి టైమ్‌లో నేను నటిగా కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమాలే కాదు ప్రేక్షకులు కూడా మారారు’ అని పేర్కొంది.

ఓ ఫిమేల్‌ ఓరియంటెడ్‌ మూవీలో….

ఇప్పుడు కథానాయికలంతా లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ వైపు మొగ్గు చూపుతున్నారు కదా! కాజోల్‌కి కూడా అలాంటి ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఈ ఇయర్‌ ఎండింగ్‌లో అది నెరవేరనుంది. ఈ ఏడాది ఓ ఫిమేల్‌ ఓరియంటెడ్‌ మూవీలో కాజోల్‌ కనిపిస్తారు. ఇటీవల తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ‘వీఐపీ 2’లో కాజోల్‌ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రదీప్‌ సర్కార్‌ దర్శకత్వంలో లీడ్‌ రోల్‌లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట. ఈ చిత్రాన్ని హీరో, కాజోల్‌ భర్త అజయ్‌ దేవగన్‌ నిర్మించనున్నారు. త్వరలో చిత్రీకరణ ఆరంభం కానుందట.

ఒక్కసారి కూడా షూటింగ్‌ కేన్సిల్‌ చేయించలేదు !

’25 ఇయర్స్‌ ఇండస్ట్రీ… కాని ఒక్క రోజు కూడా షూటింగ్‌కు డుమ్మా కొట్టలేదు’ అంటున్నది కాజోల్‌. ‘దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే’, ‘కుచ్‌ కుచ్‌ హోతాహై’, ‘కభి కుషీ కభి గమ్‌’ వంటి పెద్దహిట్స్ లో నటించిన కాజోల్‌ 25 ఏళ్లలో ఒక్కసారి కూడా తన కారణంగా షూటింగ్‌ కేన్సిల్‌ చేయించలేదని చెబుతోంది. ఒక్కోరోజు షూటింగ్‌ జరగకపోతే లక్షల కొద్దీ డబ్బు వేస్ట్‌ అవుతుంది. అది నా డబ్బు కాదు. నిర్మాతది. నిర్మాత జేబుకు చిల్లు పెట్టి… నేను చిల్‌ కావడం కరెక్ట్‌ కాదు.అందుకే జ్వరం వచ్చిన రోజుల్లో కూడా నేను షూటింగ్‌కు హాజరయ్యాను అంటోంది కాజోల్‌.