తెలుగు తెరను వెలిగించిన విలక్షణ నటుడు !

సూర్యుడికి ఎదురుగా డాబామీద నుంచొని జరీపంచే మీద సిల్కు లాల్చీ, దానిమీద కండువా వేసుకుని ఠీవిగా తల పైకెత్తి, నారాయుడనేవాణ్ణి హత్యచేయించి, శవాన్ని కారు డిక్కీలో తేసుకొచ్చిన సెక్రెటరీతో “అబ్బా సెగెట్రీ ! ఎప్పుడూ పనులూ, బిగినెస్సేనా. పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి, ఆ పెత్యక్ష నారాయుడి సేవ జేసుకోవద్దూ. కళ్ళెట్టుకు సూడు. పైనేదో మర్డరు జరిగినట్టులేదూ ఆకాశంలో. సూరీడు నెత్తురు గడ్డలా లేడూ. ఆ… మడిసన్నాక కాసింత కలాపోసనుండాలయ్యా. ఉట్టినే తిని తొంగుంటే మడిసికీ, గొడ్డుకీ తేడా ఏటుంటది.” అప్పట్లో ‘ముత్యాలముగ్గు’ చిత్రంలో కొంపలు కూల్చే కాంట్రాక్టరు అచ్చమైన గోదావరి గ్రామీణ మాండలికంలో చెప్పే మారుమోగిపోయిన డైలాగు ఇది. ఈ కాంట్రాక్టరు సంభాషణలతో విడుదలైన ఎల్.పి. రికార్డులు, ఆడియో క్యాసెట్లు ఆ రోజుల్లో విపరీతంగా అమ్ముడుపోయి రికార్డులు సృష్టించాయి. ఆ సంభాషణల సృష్టికర్త ముళ్ళపూడి వెంకట రమణయితే, అంత ప్రత్యేకంగా వాటికి శబ్దరూపం కలిపించింది రావు గోపాలరావు అనే రంగస్థల నటుడు.
భమిడిపాటి రాధాకృష్ణ రచించిన ‘కీర్తిశేషులు’ అనే సాంఘిక నాటకంలో ‘మురారి’ పాత్రలో ఒదిగిపోయి నటించిన ఈ రంగస్థల నటుడు చాలా ప్రశంసలు అందుకున్నారు. మద్రాసులో జైహింద్/మన సత్యం “కీర్తిశేషులు సహాయనిధి” కోసం ఆ నాటకాన్ని ఏర్పాటు చేసినప్పుడు చలనచిత్ర పరిశ్రమ అతణ్ణి గుర్తించింది. ‘నాటకరంగంలో పేరు సంపాదించి సినిమా రంగంలోకి అడుగిడినవాళ్ళు తొందరలోనే రాణిస్తారు’ అనేందుకు ప్రత్యక్ష ఉదాహరణ రావు గోపాలరావు. అచిరకాలంలోనే చలనచిత్ర ప్రవేశం చేసి అటు విలనీ తోబాటు మంచి హాస్యాన్ని కూడా మేళవించి గోపాలరావు ప్రేక్షకులను సమ్మోహనపరచారు. కానీ పిన్నవయస్సులోనే ఆగస్టు 13, 1994న 57 ఏళ్ళకే ఆయన అకాల మరణం చెందడం దురదృష్టం.  ఈ సందర్భంగా ఆ విశిష్ట నటుణ్ణి గురించి కొన్ని విశేషాలు…
రంగస్థలం నుంచి ఎదిగి…
రావు గోపాలరావు కాకినాడ కు సమీపంలో వుండే గంగనపల్లి గ్రామంలో జనవరి 14, 1937 న సంక్రాంతి పర్వదినాన జన్మించారు. రావు సత్యనారాయణరావు, సీతాయమ్మ ఆయన తల్లిదండ్రులు. మొదటినుంచి నాటకాలంటే గోపాలరావుకు విపరీతమైన ఆసక్తి. అతని స్నేహితులు గోపాలరావును బాగా ప్రోత్సహించేవారు. అతడు నటించిన “ధన్యజీవులు” అనే నాటకం గోపాలరావుకు మంచి పేరుతెచ్చి పెట్టడంతో ఆయన నాటకాల వైపు మొగ్గు చూపారు. దాంతో “అసోసియేటెడ్ అమెచూర్ డ్రామా కంపెనీ” అనే సంస్థను నెలకొల్పి ఎన్నో సాంఘిక నాటకాలను అనేకచోట్ల ప్రదర్శించారు. ఆరోజుల్లో కోస్తా జిల్లాలలో పండగలకు, పబ్బాలకు పరిషత్ నాటక పోటీలు విస్తృతంగా జరిపేవారు. గోపాలరావు పరిషత్ నాటకాలకు వస్తే అతనికే ఉత్తమ నటుడి బహుమతి దక్కేది. ‘నటసార్వభౌముడు’ ఎస్.వి. రంగారావును, దర్శకుడు రామినీడును సన్మానించాలని గోపాలరావు స్నేహితులు రాజమహేంద్రవరంలో ఒక సభను ఏర్పాటుచేసి, అందులో “కీర్తిశేషులు” నాటకాన్ని ప్రదర్శించారు. అందులో మురారి పాత్ర పోషించిన గోపాలరావు నటనకు ముగ్ధులైన రామినీడు, గోపాలరావు ను మద్రాసుకు పిలిపించారు. ఇందులో ఎస్.వి. రంగారావు ప్రమేయం కూడా వుంది. రామినీడు దర్శకత్వం వహించిన “భక్తపోతన”(1966) సినిమాలో రంగారావుది శ్రీనాధుని పాత్ర. అందులో శృంగార నైషధాన్ని రాజుకు అంకితమిచ్చే ఘట్టముంది. ఆసందర్భంగా శ్రీనాధుడు రాజు కాళ్ళకు దణ్ణం పెట్టాలి. ఎవరికంటే వాళ్లకు దణ్ణం పెట్టడానికి ఇష్టపడని రంగారావు, రావు గోపాలరావు ను పిలిపించి అతనిచేత రాజా మామిడి శింగనామాత్యుని పాత్ర పోషింపజేసి, అతని కాళ్ళకు దణ్ణం పెట్టారు. అలా రంగారావు ఆశీస్సులు పొందే అవకాశం గోపాలరావుకు దక్కింది. రామినీడు అతనిలో వున్న ‘స్పార్క్’ ను గమనించి “భక్త పోతన” సినిమాకు సహాయ దర్శకునిగా గా కూడా అవకాశం కలిపించారు. రామినీడుకు గోపాలరావు నటనతోబాటు అతని ప్రవర్తన కూడా నచ్చడంతో తరవాత నిర్మించిన “బంగారు సంకెళ్ళు”(1968), “మూగప్రేమ”(1971) సినిమాలకు కూడా గోపాలరావునే సహాయ దర్శకునిగా నియమించారు. ప్రతాప్ ఆర్ట్స్ సంస్థ నిర్మాత కె. రాఘవ కీర్తిశేషులు నాటకం చూసి, రావు గోపాలరావు కు “జగత్ కిలాడీలు” (1969) లో ప్రధాన విలన్ పాత్రను పోషించే అవకాశం ఇచ్చారు. అయితే గోపాలరావు వాయిస్ అతనికి నచ్చక వేరేవారితో డబ్బింగ్ చెప్పించారు. తదనంతర కాలంలో అదే వాయిస్ రికార్డులు సృష్టిస్తుందని బహుశా రాఘవ ఊహించి వుండరు. అయితే కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించిన “గండర గండడు” (1969) సినిమాలో గోపాలరావు తన సొంత కంఠంతోనే పాత్రను పోషింఛిమెప్పించారు.
“ముత్యాలముగ్గు”తో తిరుగులేని స్టార్…
బాపు-రమణల మాగ్నం ఓపస్ “ముత్యాలముగ్గు” (1975). అది బాపు-రమణల నిర్మాణ ప్రతిభకు ఓ మైలు రాయైతే, రావు గోపాలరావుకు ఓ కలికితురాయి. ఉత్తర రామాయణ కథను అంతర్లీనంగా ఉండేలా రూపొందించిన ఈ సినిమాలో గోపాలరావు ఓ విలక్షణ విలన్ అవతారమెత్తారు. సిల్కు లాల్చీ, ఉత్తరీయం, పంచెకట్టు, ఫ్రెంచ్ కటింగ్ మీసాలతో ఓ మోతుబరి ఆసామిలా కనిపిస్తూ, వెన్నపూసిన కత్తిలాంటి విలనీ అద్భుతంగా పోషించారు. ముఖ్యంగా గోదావరి యాసలో తను పలికే డైలాగులతోనే సినిమా వందరోజుల పండగ చేసుకున్నదంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా విజయంతో గోపాలరావు స్టార్డం ఆకాశాన్నంటింది. ఎక్కువగా పులిదిండి అవుట్ డోర్, హైదరాబాద్ జ్ఞాన్ భాగ్ ప్యాలెస్ లో నిర్మించిన ఈ సినిమా బాపు-      రమణలకే కాకుండా గోపాలరావుకు అఖండ కీర్తిని ఆర్జించిపెట్టింది. ఈ సినిమా తరవాత గోపాలరావు తెలుగు సినిమా విలనీకి ఓ కొత్త రూపునిచ్చారు. “వేటగాడు” సినిమాలో ప్రాసతో కూడిన పెద్దపెద్ద డైలాగులు, వింతైన విలనీతో ఆ సినిమాకే ఒక ప్రత్యేకత కట్టబెట్టారు. “మనవూరి పాండవులు” సినిమాలో విలనీ మరో రకమైన ప్రత్యేకతను సంతరించుకుంది. ఆరోజుల్లో మిమిక్రీ కళాకారులు రావు గోపాలరావు డిక్షన్ ను అనుసరిస్తూ ఎన్నో పేరడీలు వల్లించి ఆదరణ పొందిన విషయం మరువరానిది. “గోపాలరావు గారి అమ్మాయి” సినిమా ఆయన పేరుతోనే రావడం రావు గోపాలరావు కు సినిమా రంగంలో వున్న ప్రత్యేకతను తెలియజేసింది. గోపాలరావు సహ కళాకారిణిని వివాహమాడడం కూడా ఆయన కళలకు ఇచ్చే ప్రాధాన్యతను గుర్తుచేస్తుంది. ఆయన భార్య కమలకుమారి ప్రఖ్యాత హరికథా కళాకారిణి. కాకినాడ సూర్యకలా మందిరంలో ఆమె హరికథా కాలక్షేపం చేస్తుండగా, ఆ కార్యక్రమానికి హాజరైన గోపాలరావు ఆమెమీద మనసు పారేసుకున్నారు. తరవాత రాజమహేంద్రవరం ‘లలితా కళా నికేతన్’ వాళ్ళు ఆహ్వానించిన ఉత్సవాలకు హాజరైనప్పుడు, ఆ సంస్థ సభ్యుల సమక్షంలోనే ఇద్దరూ 1966లో ఒక ఇంటివారైనారు. కమలకుమారి ఈ మధ్యనే హైదరాబాదులో కాలం చేశారు. బాపు దర్శకత్వంలోనే వచ్చిన భక్తకన్నప్ప, గోరంతదీపం, కలియుగ రావణాసురుడు, త్యాగయ్య, బులెట్, జాకీ సినిమాలలో రావు గోపాలరావు తన నటనను విభిన్నంగా ప్రదర్శించడం విశేషం. కొండవీటి సింహం, మగధీరుడు, కిరాయిరౌడీలు, జస్టిస్ చౌదరి, కటకటాల రుద్రయ్య, కొండవీటి రాజా, మగధీరుడు, ఘరానా మొగుడు, చండశాసనుడు, బొబ్బిలిపులి, బొబ్బిలి బ్రహ్మన్న, యమగోల, అభిలాష, దేవాలయం, అనుగ్రహం, అల్లరిప్రియుడు, ఖైదీ సినిమాలలో గోపాలరావు నటన అద్భుతంగా వుంటుంది. కేవలం విలన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో హాస్యాన్ని కూడా గోపాలరావు పండించారు. “రావు గోపాలరావు” సినిమాలో నత్తి ప్రొఫెసర్ గా, “పట్నం వచ్చిన పతివ్రతలు”, “మల్లెపువ్వు” సినిమాల్లో మాలిష్ మారాజుగా, “మావూర్లో మహా శివుడు” సినిమాలో శివుడుగా, “స్టేషన్ మాస్టర్” సినిమాలో స్టేషన్ మాస్టర్ గా రాణించారు. ముత్యాల ముగ్గులో పాత్రకు భిన్నంగా “ఇంటిదొంగ” సినిమాలో కంటనీరు పెట్టించే పాత్రను పోషించి మెప్పించారు. రావు గోపాలరావు వాచకానికి ప్రేక్షకులు జేజేలు కొట్టారు. దక్షిణ ఆసియాలో సినిమా సంభాషణలు, సౌండ్ ట్రాక్ తో విడుదలైన తొలి లాంగ్ ప్లే రికార్డు ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాలరావుది కావడం ఒక రికార్డు.
ఆంధ్రవిశ్వ విద్యాలయం ‘కళాప్రపూర్ణ’
రంగస్థల నటుడుగా రాణిస్తూ, సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో గోపాలరావు ఎక్కువగా పాల్గొనేవారు. జయప్రకాష్ నారాయణ స్పూర్తితో “సోషలిస్టు” పార్టీలో చేరి సామజిక సేవచేశారు. గోపాలరావు కళారాధనకు గుర్తుగా ఆంధ్రవిశ్వ విద్యాలయం ఆయనకు 1990లో ‘కళాప్రపూర్ణ’ (డాక్టరేట్) ప్రదానం చేసింది. పలు నాటక సంస్థలు గోపాలరావుకు “నటవిరాట్” అనే బిరుదును ప్రదానం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కమిటీ సభ్యునిగా గోపాలరావు వ్యవహరించారు. “సితార”, “నంది”, “చిత్తూరు నాగయ్య” పేరుతొ ఇచ్చే బహుమతులు కూడా గోపాలరావును వరించాయి. ఆయన ఎన్.టి. రామారావుకు చాలా సన్నిహిత మిత్రుడు. ఆయన పరిపాలనా కాలంలో గోపాలరావు 1984-85 మధ్య ఆంధ్రప్రదేశ్ లిజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా పనిచేశారు. తరువాత ఆయనను తెలుగు దేశం పార్టీ రాజ్యసభకు ఎంపిక చేసింది. 1986-92 మధ్య కాలంలో గోపాలరావు రాజ్యసభ సభ్యునిగా వున్నారు. నిర్మాతగా గోపాలరావు “స్టేషన్ మాస్టర్”, “లారీ డ్రైవర్”, “భార్గవరాముడు”, “వింతదొంగలు” వంటి చిత్రాలు నిర్మించి విజయం సాధించారు. ఆయన చివరిసారిగా 1993 లో నాలుగు సినిమాలలో నటించారు. అవి “ఆ ఒక్కటీ అడక్కు”, “అల్లరి ప్రియుడు”, “అల్లరి అల్లుడు” సినిమాలు. నాలుగవది “ప్రేమ అండ్ కో” సినిమా ఆయన చనిపోయిన కొద్ది రోజుల తరవాత విడుదలైంది. అదే గోపాలరావు ఆఖరి చిత్రం. మొత్తమ్మీద రావు గోపాలరావు 125 సినిమాలకు పైగా నటించారు. భార్యను ఏనాడూ “నువ్వు” అని సంబోధించని గోపాలరావు కు ముగ్గురు సంతానం. వారిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అతని కుమారుడు రావు రమేష్ క్యారక్టర్ నటుడుగా ఇప్పుడు రాణిస్తున్నారు. తెరపై ఎన్నో ప్రతినాయక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన రావు గోపాలరావు మధుమేహవ్యాధి తీవ్రమై, కిడ్నీలు చెడిపోయిన స్థితిలో ఆగస్టు 13, 1994 న కాలం చేశారు.
”ముత్యాలముగ్గులో…
నారాయుడూ…ఆ ఎగస్పార్టీ వాళ్లిచ్చే డబ్బు నువ్వే ఇవ్వరా మిగిలిపోతావు అంటే వినిపించుకున్నావా? కరుసైపోయావు. కారు ఎనకసీట్లో దర్జాగా రాజాలా కూసుని ఎల్లేటోడివి. ఇప్పుడు డిక్కీలో తొంగున్నావు. దర్జా తగ్గిపోలే.”/ “చూడు గుర్నాధం. నీలాటోళ్ళు నన్ను బాగా పొగిడేసి బోర్లా కొట్టిన్చేస్తున్నారని బయమేసి ఈ బట్రాజు మేళం ఎట్టిచ్చాడు మా శగట్రీ. ఎవరైనా సరే పొగిడారో… ఈళ్ళు బాజా కొట్టేస్తారు. నేను బరతం పట్టేస్తాను.”/“అయ్ బాబోయ్.. అదేటండి అలా సూసేత్తన్నారు. ఆవిడ ఎవరనుకున్నారు? పెద్ద ఆఫీసరు భార్య…ఇద్దరు పిల్లలు. దీన్సిగదరగ…ఆఫీసర్ల పెళ్ళాలు డాన్సు చెయ్యకూడదేటండి! కలాపోసన. పొద్దత్తమాను తిని తొంగుంటే ఇక గొడ్డుకీ, మడిసికీ తేడా ఏటుంటాది? అంచేతే డాన్సు కోసం సెపరేషనుగా ఓ డిపార్టుమెంటే పెట్టేశాను.” (కరడుగట్టిన కాంట్రాక్టరు పాత్రలో)
“వేటగాడు”లో…
గాజుగదీ గాజుగదీ అనాలని మోజుపడి ప్రతిరోజూ ఆ మాటనే పోజుగా స్క్రూ లూజుగా వాడితే మనబూజు దులిపేసి గ్రీజు పెట్టేస్తారురా నిరక్షర కుక్షి.”/ “కొండయ్యగారు ఏదో ఆటకీ ఈపూట తేట తెలుగులో ఒక మాటన్నారని అలా చీటికీ మాటికీ అంటున్నారని నువ్వు సూటిగా కోపం తెచ్చుకుంటే తీట తీరిపోయి వీధిలో చాటలమ్ముకుంటూ, పాటలు పాడుకుంటూ పూటతిండి అడుక్కుని బతకాల్రా బేటా
“మనవూరి పాండవులు”లో…
కన్నప్పా! తాగి వాగుతున్నావు. ఇంటికెళ్ళి పడుకో. ఒకేళ పొద్దున్న బతికి బావుండి మేలుకున్నావనుకో…. దొరగార్ని తిట్టానని గుర్తొచ్చి మనసు పాడైపోయి సచ్చిపోతావు. పో…ఆంజనేయ దండకం సదూకుంటూ పడుకో” (దొర మూడోకన్ను తెరుచుకొని కన్నప్ప మీద కత్తి దూస్తూ)
“భక్త కన్నప్ప”లో…
భక్తులారా నిన్న రాత్రి కూడా యధాప్రకారం కైలాసం వెళ్లి స్వామిని సేవించి వచ్చాను. మీ మీ కష్టసుఖాలూ, కోరికలూ వారికి మనవి చేశాను. నేను కైలాసం వెళ్ళకపోతే స్వామివారు బెంగపెట్టుకుంటారు. రా సుబ్బన్నా. నీ కష్టాల గురించి స్వామికే కాదు, అమ్మవారికి కూడా విన్నవించాను. తల్లీ….ఇలా బతికి చితికిన కుటుంబం. వాళ్లకి మళ్ళీ దశెత్తుకోవాలంటే కరుణించక తప్పదు అని చెప్పగా వారు సరేనన్నారు.” (కైలాసనాథశాస్త్రి తన భక్తులతో)
“గోరంతదీపం”లో…
సర్లేవో. వేళకి తిండిలేక నీరసవొస్తే వేళాకోళమొకటి. మా సేటు నేనంటే ముచ్చటపడి చస్తాడు. రాజశేఖరం… నువ్వారో ఘంటకి రాపోతే గడియారాలాగిపోతాయి. నా ఫ్యాక్టరీలు నడవవోయ్ అంటాడు. నువ్విలా నిలబడి ఖడేరావను… చాలు… వర్కర్లు ఝామ్మని పనిజేస్తారు. నువ్వింటికెల్తానంటే నాకు గుండె గాభరా అంటాడు.” (రాజశేఖరం తన భార్యతో గొప్పలు చెబుతూ)
“త్యాగయ్య”లో…
రాజదర్శనం త్రోసిరాజని, రాముడి పూజకోసం వచ్చేస్తావా? ఏం చూసుకొనిరా నీకా పొగరు? ఆ కండ కావరం! నాన్నగారికన్నా గొప్పవాడివా? కొత్తగా కొమ్ములు మొలిచాయా? ఆయనతో చిన్నప్పుడు రాజసభకు వెళ్ళలేదూ! అక్కడ రామాయణం చదవలేదూ” (సాత్వికత ఉట్టిపడేలా) ఇలా ఇంకెన్నో…
– సేకరణ: ఆచారం షణ్ముఖాచారి