ఆకట్టుకునే లక్షణాలు లేని… ‘ఎమ్ఎల్ఏ’ (మంచి లక్షణాలున్న అబ్బాయి)  

                              సినీవినోదం రేటింగ్ : 2/5
బ‌్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లపై ఉపేంద్ర మాధ‌వ్‌ రచన ,దర్శకత్వం లో కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మించారు
 
అనంత‌పురం జిల్లాలో వీర‌భ‌ద్రపురంలో నాగ‌ప్ప‌(జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి), గాడ‌ప్ప(ర‌వికిష‌న్‌) కుటుంబాల మ‌ధ్య ఎప్పటి నుండో రాజ‌కీయ పోటీ నెల‌కొని ఉంటుంది. ప్ర‌తిసారి గాడ‌ప్ప కుటుంబ‌మే నెగ్గుతూ వ‌స్తుంటుంది. సంప్ర‌దాయప‌రంగా మ‌రోసారి ఎన్నిక‌ల్లో గాడ‌ప్ప విజ‌యం సాధించి ఎమ్మెల్యేగా అవుతాడు. ఊరి పిల్ల‌ల‌ను స్కూలుకి పంప‌కుండా త‌న గాజు ఫ్యాక్ట‌రీలో ప‌నిచేయిస్తూ.. వారికి సిలికోసిస్ అనే వ్యాధి రావ‌డానికి కూడా కార‌ణ‌మ‌వుతుంటాడు . దాంతో గాడ‌ప్ప చేసే అక్ర‌మ దందాల‌పై ఓ జ‌ర్న‌లిస్ట్ ఆధారాలు సేక‌రిస్తాడు. ఆ జ‌ర్న‌లిస్టును గాడ‌ప్ప చంపేస్తాడు. అక్క‌డి నుండి క‌థ హైద‌రాబాద్‌కి షిఫ్ట్ అవుతుంది. హైద‌రాబాద్‌లోని క‌ల్యాణ్‌(నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌) త‌న తండ్రిని కాద‌ని.. త‌న చెల్లెల‌కి..
ఆమెకిష్ట‌మైనవాడు(వెన్నెల‌కిషోర్‌)తో పెళ్లి చేయిస్తాడు. తండ్రి వెళ్ల‌గొట్ట‌డంతో బావ‌, చెల్లెలుతో క‌లిసి బెంగ‌ళూరుకి వెళతాడు. అక్క‌డ ఇందు( కాజ‌ల్ అగ‌ర్వాల్‌)ను చూసి ప్రేమిస్తాడు. త‌న బావ కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు క‌ల్యాణ్‌. త‌న కంపెనీకి ఛైర్మ‌న్ కూతురు.. కంపెనీ ఎం.డియే ఇందు అని తెలుసుకుని షాక్ తింటాడు. కానీ ఇందుని ప్రేమిస్తున్నాన‌నే చెబుతాడు. అలాంటి స‌మ‌యంలో కంపెనీకి ఓ స‌మ‌స్య వ‌స్తుంది. క‌ల్యాణ్ ఆ స‌మ‌స్య‌ను తెలివిగా ప‌రిష్క‌రిస్తాడు. అంత‌లోనే క‌థ‌లో ట్విస్ట్ మొద‌ల‌వుతుంది. ఇందు త‌న ఛైర్మ‌న్ కూతురు కాద‌ని.. గాడ‌ప్ప పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అనే నిజం తెలుస్తుంది. దాంతో క‌ల్యాణ్ ఏం చేస్తాడు? త‌న కూత‌ురుని పెళ్లి చేసుకునే అబ్బాయి ఎమ్మెల్యేగా ఉండాల‌ని నాగ‌ప్ప పెట్టే షరతును దాటి ఇందుని కల్యాణ్ ఎలా సొంతం చేసుకుంటాడు? క‌ల్యాణ్ ఎమ్మెల్యే అవుతాడా? అనే నిజం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే….
 
మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్‌ ‘ఎమ్ఎల్ఏ’ (మంచి లక్షణాలున్న అబ్బాయి)గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్ క‌థ లో ఏమాత్రం కొత్త‌ద‌నం క‌న‌ప‌డ‌లేదు. పాత క‌థ‌ల‌ను క‌లిపి కొట్టి ప‌క్కా రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ చేసి ఆక‌ట్టుకోవాల‌నుకునే ప్ర‌య‌త్నం బెడిసి కొట్టింది. క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఫార్ములా వ‌ర్కువ‌ట్ అయితే ఓకే.. కాక‌పోతేనే బోరింగ్ అయిపోతుంది. ఇక్క‌డ జ‌రిగింద‌దే….
 
అమ్మాయి ప్రేమను దక్కించుకోవడం కోసం ఎంఎల్ఎ అవ్వాలనుకోవడం కొత్త పాయింట్. నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ రాసుకున్న ఈ లైన్ బాగున్నా, దాన్ని తెరమీద ఆసక్తికరంగా చూపించడంలో విఫలమయ్యాడు. కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా లేవు, స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉంది. అందుచేత సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కథకు కనెక్ట్ కాలేడు. హీరో విలన్ తో ఛాలెంజ్ చేసి ప్రజలకు మంచి చేయటం వంటి అంశాలని ఇదివరకే చాలా సినిమాల్లో మనం చూసాం. ఈ సినిమా కూడా అదే ధోరణిలో నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కంపెనీలో చాలా సన్నివేశాలు సినిమాకు అవసరం లేదనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ బాగున్నా, అప్పుడే సినిమాలోని అసలు కథ మొదలైనా, తర్వాత ఏం జరుగుతుందనేది ప్రేక్షకులకు సులభంగా తెలిసిపోతుంటుంది. దీంతో సినిమా ఆసక్తి కలిగించదు . పైగా అన్నీపొంత‌న లేని స‌న్నివేశాలు. సెకండాఫ్‌లో సినిమా అంతా విలేజ్‌లోనే రాజ‌కీయ గొడ‌వ‌ల మ‌ధ్య సాగుతుంది. ఆ గొడ‌వ‌లు కూడా ఇంత‌కు ముందు సినిమాల్లోని చూసేసిన సన్నివేశాల‌ను గుర్తు చేసాయి.
 
క‌ల్యాణ్ రామ్ త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. కల్యాణ్ రామ్ లుక్ ప‌రంగా కొత్త‌గా ఉన్నాడు. బ‌రువు త‌గ్గ‌డం.. కాస్ట్యూమ్స్ విష‌యంలో తీసుకున్న శ్ర‌ద్ధ కార‌ణంగా ఆ కొత్త‌దనం మ‌న‌కు క‌న‌ప‌డుతుంది. కళ్యాణ్ రామ్‌ డ్యాన్స్‌ లు ఆకట్టుకుంటాయి. యాక్షన్ సీన్స్‌ లోనూ పర్ఫెక్షన్‌ చూపించాడు. కాజ‌ల్ పాత్ర‌కు పెద్ద అవకాశం లేకున్నా, ఆమెఅందం, అభినయం బాగున్నాయి. ద్వితీయార్థంలో పల్లెటూరు అమ్మాయిగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి మెప్పించింది. . ఇక సినిమాలో మ‌రో మెయిన్ పాత్ర విల‌న్ ర‌వికిష‌న్‌. సినిమా ప్ర‌థ‌మార్థంలో అంద‌రూ భ‌య‌ప‌డేలా ఉండే విల‌న్ సెకండాఫ్‌కి వ‌చ్చేసరికి ఓ జోక‌ర్‌లా మారిపోతాడు. హీరో అత‌న్ని ఆట ప‌ట్టిస్తుంటాడు. ర‌వికిష‌న్ విల‌నిజాన్ని స‌రిగ్గా వాడుకోలేదు. పోసానికి, క‌రాటే క‌ల్యాణికి మ‌ధ్య జ‌రిగే కామెడి, డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తుంది. అజ‌య్‌, క‌ల్యాణ్ రామ్‌, బ్ర‌హ్మానందం కామెడీ ట్రాక్ చాలా సిల్లీగా క‌న‌ప‌డుతుంది. ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్‌, 30 ఇయర్స్‌ పృథ్వీ,ప్రభాస్‌ శ్రీనులు నవ్వించే ప్రయత్నం చేశారు.
 
ఉపేంద్ర మాధవ్ రాసిన “పిల్లలకు ఆస్తులు ఇస్తే అవి ఉంటేనే బ్రతుకుతారు, అదే చదువు ఇస్తే ఎలాగైనా బ్రతుకుతారు” వంటి డైలాగ్స్ బాగున్నాయి. ప్రసాద్ మురెళ్ళ కెమెరా పనితనం బాగుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాకు పనిచేసిన ఆయన ఈ సినిమాతో మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. మణిశర్మ సంగీతం అంతగా ఆకట్టుకోదు . పాటలు చెప్పుకోదగ్గవిగా లేకున్నా విజువల్‌ గా బాగున్నాయి. నేపథ్యం సంగీతం హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసే సీన్స్‌ తో పాటు, యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో ఫర్వాలేదు . ఎడిటింగ్‌ విషయంలో త‌మ్మిరాజు ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది – రవళి