గందరగోళం …. ‘విశ్వ‌రూపం2’ చిత్ర సమీక్ష

                                         సినీ వినోదం రేటింగ్ : 2/5 

ఆస్కార్ ఫిలిమ్స్ రాజ్ క‌మ‌ల్ ఫిలిమ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్‌ బ్యానర్ల పై కమల్‌హాసన్‌ దర్శకత్వం లో ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌ ఈచిత్రం నిర్మించారు
 
కధలోకి వెళ్తే …
లండ‌న్‌లో బ్లాస్ట్ ప్లాన్ చేసిన ఓమ‌ర్‌.. త‌ర్వాత రెండో ప్ర‌పంచ యుద్ధంలో లండ‌న్ సముద్రంలో మునిగిన 1500 ట‌న్నుల బాంబుల‌ను యాక్టివేట్ చేసి దాని ద్వారా లండ‌న్ సిటీని నాశ‌నం చేయాల‌నుకునే ప్లాన్ కూడా వేస్తాడు. విష‌యం ప‌సిగ‌ట్టిన విసామ్ అహ్మ‌ద్ (క‌మ‌ల్ హాస‌న్‌) త‌న భార్య‌, న్లూక్లియ‌ర్ సైన్స్‌లో పి.హెచ్‌.డి చేసిన నిరుప‌మ‌(పూజా కుమార్‌).. అసిస్టెంట్ ఆశ్రిత‌(ఆండ్రియా) స‌హా వెళ్లి అక్క‌డ స‌ముద్ర గ‌ర్భంలోని యాక్టివేట్ చేయ‌బోయే బాంబుల‌ను డీ యాక్టివేట్ చేస్తాడు. త‌ర్వాత ఇండియా చేరుకుంటాడు. ఇండియా చేరుకున్న నిర‌ప‌మ‌, ఆశ్రిత‌ల‌ను ఓమ‌ర్ కిడ్నాప్ చేస్తాడు. చివ‌ర‌కు ఓమ‌ర్‌ను విసామ్ అహ్మ‌ద్ ఏం చేస్తాడు? నిరుప‌మ‌, ఆశ్రిత‌ల‌కు ఏమౌతుంది? ఇండియాలో ఓమర్‌కు స‌హాయం చేసేదెవ‌రు? ఓమ‌ర్ ఇండియాను నాశనం చేయ‌డానికి ఏ ప్లాన్ వేశాడు? ఓమ‌ర్ ప్లాన్‌ను విసాద్ ఎలా అడ్డుకున్నాడు? అనే విష‌యాల‌ను సినిమాలో చూడాలి…..
 
విశ్లేషణ…
‘విశ్వ‌రూపం’ ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాలోని స‌న్నివేశాల‌కు.. చాలా సందేహాల‌కు స‌మాధానంగా రూపొందిన సీక్వెల్ `విశ్వ‌రూపం 2`. ఇందులో క‌మ‌ల్ హాస‌న్ పూర్తి స్థాయి క్యారెక్ట‌రైజేష‌న్‌ను రివీల్ చేశారు. అస‌లు క‌మ‌ల్ స్టార్ట్ చేసిన ఆప‌రేష‌న్‌కి మూలం ఏంటి? ఎలా ట్ర‌యినింగ్ పొందాడు. అస‌లు అల్‌ఖైదాలో ఎలా జాయిన్ అయ్యాడు? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు ఈ సినిమాలో స‌మాధానం దొరికాయి. అలాగే ఫ‌స్ట్ పార్ట్‌లోని లేని ..భార్య భ‌ర్త‌ల మ‌ధ్య ఎమోష‌న్స్‌, త‌ల్లికొడుకుల మ‌ధ్య ఎమోష‌న్స్‌.. అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. కమల్ తన తల్లిని కలుసుకున్నే సన్నివేశంలో వచ్చే చిన్ననాటి కొన్ని ఫ్లాష్ బ్యాక్ షాట్స్, బాక్ గ్రౌండ్లో వచ్చే ఎమోషనల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. అలాగే యూఎస్ ఆర్మీకి ఆల్ ఖైదా గ్యాంగ్ మధ్యన జరిగే మేజర్ యాక్షన్ ఎపిసోడ్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఫ‌స్టాఫ్‌లో స‌ముద్రంలోప‌ల వ‌చ్చే సీన్స్ బావున్నాయి.
‘విశ్వరూపం’ సినిమాతో హాలీవుడ్ స్థాయి స్పై థ్రిల్లర్‌ను దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం చేసిన ‘లోక నాయకుడు’ కమల్‌ హాసన్‌ ‘విశ్వరూపం 2’తో అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయారు.ఇంటర్వెల్‌ బ్లాక్‌ లాంటి ఒకటి రెండు సీన్స్ ‘భలే గుందని’ అనిపించినా ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో కనెక్ట్‌ అవ్వటం కాడు. ఫస్ట్‌ హాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్‌కు సంబంధించిన చాలా సన్నివేశాలు ‘విశ్వరూపం’ తొలి భాగంలోని సీన్సే కావటం కూడా నిరాశకలిగిస్తుంది. ఫ‌స్ట్ పార్ట్‌లోని గ్రిప్పింగ్ ‘విశ్వ‌రూపం 2’లో మిస్ అయ్యింది. సీన్స్ ల్యాగ్‌గా అనిపించాయి. కమల్ హాసన్ నటుడిగా మెప్పించినప్పటికీ ఇతర విభాగాల్లో విఫలమయ్యారు. ప్లో లేని కథలో, కన్ ఫ్యూజ్ చేసే కథనంతో సినిమా పై ఆసక్తిని చంపేసారు. అనవసరంగా వచ్చే క్లారిటీ లేని సీన్లుతో ఇబ్బంది పెట్టారు.ఈ చిత్రం కేవలం మల్టిప్లెక్స్ ఆడియెన్స్ కు, ఏ సెంటర్స్ ప్రేక్షకులకు మాత్రమే పరిమితం.  వారిని కూడా పూర్తిగా సంతృప్తి పరచదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ స్లో గా సాగడం, కథనంలో క్లారిటీ మిస్ కావడం ఈ సినిమా ఫలితాన్ని పూర్తిగా దెబ్బ తీశాయి.మొత్తానికి భారీ అంచనాలు మధ్యన విడుదలైన ఈ చిత్రం బాగా డిసప్పాయింట్  చేసింది.
నటీనటులు …
‘లోకనాయకుడు’ కమల్‌ హాసన్‌ మరోసారి అద్భుతమైన నటనతో సినిమాను నడిపించాడు. ఈ వయసులోనూ యాక్షన్‌ సీన్స్‌లో మంచి ఈజ్‌ కనబరిచారు. ఆయన బాడీ లాంగ్వేంజ్‌, డైలాగ్‌ డెలివరీ నిజంగా ఓ ‘రా’ ఏజెంట్‌నే చూస్తున్నామా? అన్నంత నేచురల్‌గా ఉన్నాయి. హీరోయిన్లుగా కనిపించిన పూజా కుమార్‌, ఆండ్రియాలకు రెండు భాగంలోనూ ప్రాధాన్యమున్న పాత్రలు దక్కాయి.వారి గ్లామ‌ర్ సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ఆండ్రియా యాక్షన్‌ సీన్స్‌లోనూ అదరగొట్టారు. ఇక కమల్ సరసన హీరోయిన్ గా నటించిన పూజా కుమార్ తన నటన తో పాటు తన గ్లామర్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వారి మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా బాగున్నాయి.  విలన్‌గా రాహుల్ బోస్‌ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో క్రూరమైన తీవ్రవాదిగా మెప్పించాడు. ఇతర పాత్రల్లో శేఖర్‌ కపూర్‌, జైదీప్‌, వాహీదా రెహమాన్‌ తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.
 
సాంకేతిక నిపుణులు…
యాక్ష‌న్ సీన్స్ ఎగ్జ‌యిటింగ్‌గా లేవు.శశాంక్‌ వెన్నెలకంటి డైలాగ్స్ కొన్ని చోట్ల బాగానే పేలాయి. మొహమ్మద్ గిబ్రన్ సమకూర్చిన పాటలు, ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా సినిమా స్థాయికి తగ్గట్టు లేదు.నేప‌థ్య సంగీతం ఇంకా బెట‌ర్‌గా ఉండుంటే బావుండేద‌నిపించింది. శామ్‌దత్‌, షైనుదీన్‌, షను జాన్‌ వర్గీస్‌ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.నీరసించిపోయే ఆడియన్స్ కి ఈ బ్యూటిఫుల్ విజువల్స్ కొంతవరకు ఊరట కలిగిస్తాయి.మహేష్ నారాయణ్, విజయ్ శంకర్ ఎడిటింగ్ పర్వాలేదు. కమల్ హాసన్, చంద్ర హాసన్ లు నిర్మాణ విలువలు కొంతమేరకు బాగున్నాయి – రాజేష్