శ్రుతి, అక్షర లను కిడ్నాప్‌ చెయ్యబోయారు !

శ్రుతి హాసన్‌, ఆమె చెల్లెలు అక్షర హాసన్‌లను కిడ్నాప్‌ చేసేందుకు భారీ కుట్ర జరిగిందని, విషయం తెలియడంతో ఆ పన్నాగాన్ని ఆపగలిగానని గుర్తుచేసుకున్నారు… విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌.‘నాకు నచ్చిన 70 సినిమాలు’  అనే శీర్షికన ఇటీవలే ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్‌హాసన్‌ తన మనసులో మాటలను చెప్పుకొచ్చారు.

శ్రుతి, అక్షరలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలో.. ఇంట్లో పనిచేసేవాళ్లే బయటివారితో కలిసి కిడ్నాప్‌కు పథకం వేశారని, వారి చర్యలపై సందేహం కలగడంతో తానే కిడ్నాప్‌ విషయాన్ని పసిగట్టానని కమల్‌ చెప్పారు. ‘ఆ సమయంలో కిడ్నాప్‌కు ప్రయత్నించిన వాళ్లను చంపేయాలన్న ఆక్రోశం కలిగింది. కానీ దానిని అణుచుకుని సమస్యను పరిష్కరించుకున్నా. ఈ విషయం గురించి ఇప్పటిదాకా ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు నా పిల్లలు పెద్దవాళ్లయ్యారు. నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకునే పరిపక్వత ఉంది కాబట్టే కిడ్నాప్‌ విషయాన్ని బయటికి చెబుతున్నా’ అని కమల్‌ అన్నారు. నాటి సంఘటన తనను ఆలోచింపజేసిందని, ఆ తరువాత ఒక కథ రాయాలని కూర్చున్నప్పుడు.. పిల్లల కిడ్నాప్‌ నేపధ్యంలో కథ ఎందుకు రాయకూడదన్న ఆలోచనలోంచి పుట్టిదని, ఆ కథే ‘మహానది’ చిత్రంగా రూపుదిద్దుకుందని కమల్‌ తెలిపారు.కమల్‌కు నచ్చిన 70 సినిమాల్లో ‘మహానది‘ కూడా ఉంది. దాని నేపథ్యాన్ని వివరిస్తూ కమల్‌ ఈ మేరకు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.