ఆ రెండు సినిమాలకు మోక్షం ఉందా ?

సినీనటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఎంతోమంది నటులు రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో కమలహాసన్ కూడా పాలిటిక్స్‌లోకి వచ్చేందుకు ‘సై’ అనేశాడు. ఒకవైపు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రజనీకాంత్ సిద్ధమవుతుండటంతో… ఆయనకంటే ముందు తానే రాజకీయాల్లోకి రావాలని కమల్ హాసన్ భావిస్తున్నట్టు తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య సినిమాలకంటే ఎక్కువగా రాజకీయాలపై ఫోకస్ చేస్తున్న ఆ స్టార్ హీరో, తన సినిమాలను మధ్యలోనే వదిలేసి పాలిటిక్స్‌లోకి అడుగుపెడతాడేమో? అని సినీ‌వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అదే జరిగితే ‘ఆ సినిమాలు అటకెక్కినట్టే!’ అని కొందరు చర్చించుకుంటున్నారు.కమల్ హాసన్ పాలిటిక్స్‌లోకి రావడంపై ఎవరికీ అభ్యంతరాలు లేకున్నా ఆయన తన సినిమాలన్నింటినీ పూర్తి చేసి రాజకీయాల్లోకి వస్తారా? లేక వాటిని మధ్యలోనే వదిలేసి రాజకీయరంగంలోకి దూకేస్తారా? అన్నది ఆసక్తి రేపుతోంది.
 కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది విడుదలకు నోచుకోవడం లేదు. అసలు ఈ సినిమా విడుదలకు అడ్డంకి ఏంటనే విషయంలోనూ ఎవరికీ అంతగా క్లారిటీ లేదు. ఇక కమల్ హాసన్ నటిస్తున్న మరో సినిమా ‘శభాష్ నాయుడు’ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ మధ్య కమల్‌కు గాయం కావడంతో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్, ఇప్పటివరకు వరకు మళ్లీ మొదలుకాలేదు.కమల్ తీరును గమనిస్తున్న చాలామంది అసలు ఈ సినిమాను పూర్తి చేసే ఆలోచన కమల్‌కు ఉందా ? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారట. ఆయన పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టి ఉంటే ఈ రెండు సినిమాలు ఎప్పుడో  ఆడియెన్స్ ముందుకు వచ్చేవి. కానీ ఆయన ఇప్పుడు తన ఫోకస్ అంతా రాజకీయాలపైకి మళ్లించడంతో ఈ రెండు సినిమాలకు ఎప్పటికి మోక్షం లభిస్తుందనే విషయాన్ని ఎవరూ చెప్పలేకపోతున్నారు.