సొసైటీకి హాని కలిగించే వాటిలో భాగం కాను !

కంగనా రనౌత్‌ ‘ఐటమ్‌ సాంగ్స్‌ని బ్యాన్‌ చేయండి’ అనేసింది.”మున్నీ బద్‌నామ్‌ హుయీ డార్లింగ్‌ తేరే లియే…”, “చిక్‌నీ చమేలీ చిక్‌నీ చమేలీ…”, “మై నేమ్‌ ఈజ్‌ షీలా…” …తెరపై తారలు ఈ ఐటమ్‌ సాంగ్స్‌కి డ్యాన్స్‌ చేస్తుంటే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఆ మాటకొస్తే ఐటమ్‌ సాంగ్స్‌ కోసమే థియేటర్లకు వెళ్లేవాళ్లు ఉంటారు. అలాంటి క్రేజీ సాంగ్స్‌కి ‘ఇక ఫుల్‌స్టాప్‌ పెట్టండి’ అని ఎవరైనా అంటే ‘ఎందుకమ్మా అంత కోపం’ అంటారు. ఇప్పుడు కంగనా రనౌత్‌ని అలానే అంటున్నారు. ఎందుకంటే సూటిగా సుత్తి లేకుండా …‘ఐటమ్‌ సాంగ్స్‌ని బ్యాన్‌ చేయండి’ అనేశారు.

టాప్‌ హీరోయిన్స్‌ సైతం ఐటమ్‌ సాంగ్‌లో యాక్ట్‌ చేస్తుంటారు. కానీ కంగనా రనౌత్‌ మాత్రం ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లైనా ఒక్క ఐటమ్‌ సాంగ్‌లోనూ కనిపించలేదు. దానికి కారణం ఏంటి? అని కంగనాను అడిగితే– ‘‘నాకు ఆనందాన్నిచ్చేవి అందరికీ నచ్చాలి, ఆనందాన్నివ్వాలని రూలేం లేదు. నాకు ఫెయిర్‌నెస్‌ బ్రాండ్‌లను ప్రమోట్‌ చేయడం, పెద్ద హీరోలతో యాక్ట్‌ చేయడం, ఐటమ్‌ సాంగ్స్‌లో కనిపించటం పెద్దగా నచ్చవు. నిజానికి,  వాటితో కెరీర్‌కి వచ్చే బూస్టప్‌ మామూలుగా ఉండదు. అయినా నాకు నచ్చవు.

ఐటమ్‌ సాంగ్స్‌లో పెద్దగా చేయటానికి ఏమీ ఉండదు. ఎక్కువ శాతం అవి మహిళలను తక్కువ చేసే విధంగానే ఉంటాయి. ఐటమ్‌ సాంగ్స్‌లో ‘మోహినీ, మున్నీ’ అని పేర్లు వినిపిస్తుంటాయి. అలా పిలిపించుకోవటం నాకు నచ్చదు.  నా అభిప్రాయం ఏంటంటే …ఐటమ్‌ సాంగ్స్‌ని బ్యాన్‌ చేయాలి. సొసైటీకి హాని కలిగించే వాటిలో భాగం అవ్వడానికి నేను రెడీగా లేను. రేపు సొసైటీలో మన ఆడపిల్లలను ఇలాంటి పేర్లు పెట్టి పిలవలేం కదా. ఇలాంటి పాటలను పిల్లలు చూస్తుంటారు. వీటి ద్వారా వాళ్లేం నేర్చుకుంటారు? ఏమీ ఉండదు కదా. అందుకే మనం రెస్పాన్సిబుల్‌గా ఉండాలి’’ అని పేర్కొన్నారు కంగనా

కబడ్డీ క్రీడాకారిణిగా ‘క్వీన్‌’ 
‘క్వీన్‌’ చిత్రం తర్వాత కంగనా రనౌత్‌ కెరీర్‌ గ్రాఫ్‌ మారిపోయింది. శక్తివంతమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. ఫిల్మ్‌ మేకర్స్‌, రచయితలు కూడా కంగనా కోసమే ప్రత్యేకంగా కథలను, పాత్రలను క్రియేట్‌ చేస్తున్నారు. ‘తనువెడ్స్‌ మను’, ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’, ప్రస్తుతం రూపొందుతున్న ‘మెంటల్‌ హై క్యా’, ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ వంటి చిత్రాల్లో అసమాన ప్రతిభను కనబర్చిన కంగనా తాజాగా మరో విభిన్న పాత్రలో మెరవబోతోంది. ఈసారి క్రీడాకారిణిగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్‌లో క్రీడా నేపథ్య చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో దర్శకుడు అశ్విని ఐయ్యర్‌ తివారీ ‘కబడ్డీ’ ఇతివృత్తంతో ఓ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో కథానాయికగా కంగనాను ఎంపిక చేశారు. కథ నచ్చి అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు తన డేట్స్‌ను కూడా కంగనా సర్దుబాటు చేసిందని సమాచారం. అంతేకాదు కబడ్డీ క్రీడాకారిణిగా కనిపించేందుకు పలువురు కోచ్‌ల సహాయంతో తనను తాను మలచుకునేందుకూ రెడీ అవుతోందని చిత్రబృందం తెలిపింది