యాభై కోట్లతో కంగనా కార్యాలయ కలల సౌధం!

కంగనారనౌత్ ప్రతిభావంతులైన కథానాయిక…వెండి తెర పైనే కాకుండా వార్తల్లోనూ ఎప్పుడూ ఉంటుంది.‌ మణికర్ణిక తో దర్శకురాలైన కంగనా.. చిత్ర నిర్మాణ రంగంలోకి కూడా అడుగెడుతూ ‘మణికర్ణిక ఫిల్మ్స్‌’ పేరుతో ఓ ప్రొడక్షన్‌హౌస్‌ను ఆరంభించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ముంబయిలోని విలాసవంతమైన పాలీహిల్‌ ప్రాంతంలో ఆఫీసును నెలకొల్పింది. దాదాపు 50కోట్ల భారీ వ్యయంతో కంగనా ఈ ఆఫీసు – స్టూడియో నిర్మించుకోవడం విశేషం. సాధారణంగా సినీతారలు తమ స్వగృహాల విషయంలో భారీ మొత్తాల్ని వెచ్చిస్తారు. కేవలం ఆఫీసు నిర్మాణం కోసమే 50కోట్లు ఖర్చుపెట్టి కంగనారనౌత్‌ ఇప్పుడు మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. పూర్తి ప్లాస్టిక్‌ రహితంగా, అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ ఆఫీసుకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది కంగనా. కళ్ళు చెదిరేలా ఉన్న ఈ భవంతిని గురించి చెబుతూ… తన పదేళ్ల శ్రమకు ప్రతిబింబంగా కట్టుకున్న కలల సౌధమిదని కంగనారనౌత్‌ వ్యాఖ్యానించింది.
 
లాక్‌డౌన్ కారణంగా చాలా మంది రోజు వారి కూలీలకు పనిలేకుండా పోయింది. వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వాలతో పాటుగా సినీ నటులు కూడా తమ వంతు సహాయం అందిస్తున్నారు. కంగనా తన వంతుగా 25 లక్షల విరాళాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేసినట్టు ఆమె సోదరి రంగోళి తెలిపింది. కంగనా రనౌత్ తల్లి ఆశా తన నెల పెన్షన్‌ను ప్రధాన మంత్రి సహాయ నిధికి అంజేశారు.
సంచలన వ్యాఖ్యలు..కేసు నమోదు!
కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమెపై కేసు నమోదయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో కొద్దిరోజుల క్రితం కరోనాతో ఓ జమాతీ మృతిచెందాడు. దీంతో అధికారులు ఆ జమాతీ కుటుంబానికి వైద్య పరీక్షలు చేసేందుకు వెళ్లారు. అక్కడ వైద్యులు, పోలీసులపై వారు దాడికి దిగారు. ఈ ఘటనపై కంగనా సోదరి రంగోలి చందేల్ స్పందిస్తూ… ఓ వర్గానికి చెందిన వారిని, సెక్యులర్ మీడియాను వరుసగా నిలబెట్టి కాల్చాలంటూ వ్యాఖ్యలు చేసింది. దీంతో రంగోలి చందేల్ ట్విటర్ ఖాతాను తొలగించారు. దీనిపై కంగనా స్పందిస్తూ.. కొద్దిరోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పెట్టింది.అందులో, సోదరి రంగోలి చందేల్ ట్విటర్ ఖాతాను తొలగించడాన్ని కంగనా తప్పుపట్టింది. రంగోలి చేసిన వ్యాఖ్యలకు సైతం మద్దతు తెలిపింది. అంతటితో ఆగకుండా ఆ వర్గానికి చెందిన వారు టెర్రరిస్టులంటూ పేర్కొంది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ముంబైకి చెందిన అడ్వకేట్ అలీ కాషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ కంగనాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో ఆమెపై కేసు నమోదయ్యింది.