మొదట్లో నేను కూడా అలాగే మోసపోయాను !

మొదట్లో నేను కూడా అలాగే అనుకొని మోసపోయాను….అని అంటోంది బాలీవుడ్ ‘క్వీన్’ కంగనారనౌత్ . తన జీవితంలో ప్రేమకిక చోటు లేదని తేల్చేసింది బాలీవుడ్ బ్యూటీ కంగనారనౌత్. తెలుగులో ‘ఏక్ నిరంజన్’  చిత్రంలో నటించిన ఈ భామ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడే పలువురితో ఎఫైర్స్ నడిపేసింది. సినిమాల్లోకి వచ్చాక ఆ ఎఫైర్లను కొనసాగించింది. హృతిక్ వివాదం తరువాత… ఇటీవల ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా ఎఫైర్లకు పుల్‌స్టాప్ పెట్టేసి, పూర్తిగా నటనపైనే దృష్టిపెట్టి బాలీవుడ్‌లో వరుస విజయాల్ని అందుకుంది కంగనారనౌత్. కంగనా యువతకు ఓ మంచి సందేశాన్ని కూడా ఇచ్చింది. “భౌతిక ఆకర్షణనే చాలామంది ప్రేమని అనుకుంటారు. మొదట్లో నేను కూడా అలాగే అనుకొని మోసపోయాను. ప్రేమించడానికి మానసికంగా  ఎంతో పరిణతి అవసరం. అప్పుడే సరైన వ్యక్తిని ప్రేమించగలుగుతాం”అని చెప్పింది కంగనారనౌత్.

రొమాంటిక్‌ సన్నివేశాలు ఒకటి పదిసార్లు తీస్తారు !

సినీ రంగంలో హీరోయిన్ల మీద లైంగిక వేధింపుల మీద చాలా వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా తెర వెనుక జరిగేది. తెర ముందు జరిగే లైంగిక వేధింపుల గురించి కంగనా తాజాగా చెప్పుకొచ్చింది. తెర మీద ముద్దు సన్నివేశాలు కానీ, రొమాంటిక్‌ సన్నివేశాలు కానీ ఒకటి పదిసార్లు తీస్తుంటారనీ, షాట్ బాగా వచ్చినా సరిగా రాలేదనే నెపంతో పదే పదే షూట్‌ చేస్తూ హీరోయిన్లను తెర మీద లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తోంది. గతంలో రేఖ కూడా ఇలాంటి మాటలే చెప్పింది. దీని బట్టి చూస్తే తెర మీద లైంగిక వేధింపులు నిజమే! అని నమ్మాల్సి వస్తోందని సినీ జనాలు అంటున్నారు.

వికలాంగ మహిళ అరుణిమ సిన్హా గా…

వైవిధ్యమైన చిత్రాలకు, ప్రయోగాత్మక పాత్రలకు, మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్‌గా కంగనా రనౌత్‌ నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆమె ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఆర్‌.బాల్కీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి భారతీయ వికలాంగ మహిళా అరుణిమ సిన్హా జీవితం ఆధారంగా ఆర్‌.బాల్కీ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇందులో అరుణిమ సిన్హా పాత్రకు కంగనాను ఎంపిక చేశారట. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మెంటర్‌ పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం కంగనా ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోనుందట. ‘ఈ పాత్రకు కంగనా నూటికి నూరుశాతం న్యాయం చేయగలదనే నమ్మకంతో ఉన్నాం. అలాగే ఆమె మెంటర్‌గా బిగ్‌ బి అమితాబ్‌ నటించడం ఆనందంగా ఉంది. అత్యద్భుత ప్రతిభగల ఇద్దరు ఆర్టిస్టులు ఈ చిత్రంలో నటించడం విశేషంగా భావిస్తున్నాను’ అని దర్శక, నిర్మాత ఆర్‌.బాల్కీ తెలిపారు.