ఫ్లాప్‌ అయితే అంతా నన్ను అవమానించేవారు !

కంగనా రనౌత్‌… “సినిమా ఇండిస్టీ చాలా నీచంగా మారిపోయింది. చిన్న చిన్న ఆర్టిస్టుల ఇష్టాలు, అయిష్టాలను కూడా బహిరంగంగా చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పరిస్థితులు మారిపోయా”యని పేర్కొంది కంగనా రనౌత్‌. ఆమె నటించిన ‘మణికర్ణిక’ సినిమా విషయంలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. న్యూఢిల్లీలో జరిగిన ‘సిగేచర్‌ మాస్టర్‌ క్లాస్‌’ అనే కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ…
‘ఏ రంగంలోనైనా నేను మాస్టర్‌నో కాదో తెలియదు గానీ అన్ని పనులూ చేయగలను. మణికర్ణిక సినిమాను మళ్లీ పునర్నిర్మించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అంతా నేను చేసే పని వ్యర్థం అనేవారు. ఈ సినిమా ఒకవేళ ఫ్లాప్‌ అయితే అందరూ నన్ను అవమానించేవారు. ఈ సినిమాను పునర్నిర్మించడం అనేది ఓ పెద్ద రిస్క్‌. ఎప్పుడైనా సినిమా మొదట నుంచీ దర్శకత్వం చేయడం అనేది పెద్ద సమస్య కాదు. కానీ ఓ సినిమాను పునర్నిర్మించడం అంటే చాలా కష్టం. 50శాతం మంది నేను చేయలేను అనుకున్నారు. ఇప్పుడు చేసి చూపించాను. అదీ ప్రత్యేకమైంది. ఇలా దర్శకత్వంలోకి కొత్తగా వచ్చివారికి ఇదొక ప్రత్యేకమే. ఇప్పుడే కాదు.. ఈ సినిమా షూటింగ్‌లో గాయపడితే నా నుదిటిపై ఎనిమిది కుట్లు పడ్డాయి. అప్పుడు కూడా కొందరు నాపై దాడి చేశారు.
‘ఇది నా సినిమా’ అని చెప్పుకుంటున్నారు !
డిసెంబరులో క్రిష్‌కు ఈ సినిమా చూపించాలి అనుకున్నాం. కానీ సినిమా పూర్తిగా నాశనం అయిపోయింది, దాన్ని బాగు చేయలేం అనే భావనలో క్రిష్‌ ఉన్నారు. కానీ నేను సినిమాను పూర్తి చేశా. ఆయనకు చిత్రం నచ్చింది. అప్పటి నుంచి ‘ఇది నా సినిమా’, ‘ఇది నా సినిమా’ అని చెప్పుకుంటున్నారు. అతనికి క్రెడిట్‌ ఇచ్చినా మీడియా ముందుకు ఎందుకొచ్చారు? నేరుగా నన్ను కలిసి మాట్లాడి ఉండొచ్చుగా?. ఆయన ఒక్కసారి కూడా నన్ను కలవలేదు. మా ఆహ్వానాలకు ఏ రోజూ స్పందించలేదు. క్యారెక్టర్‌ ఆర్టిస్టులంతా ‘వాళ్లు మాకు ప్రామిస్‌ చేశారు.. కానీ అది జరగలేదు’ అని ఆరోపణలు చేస్తున్నారు. నాకు రహస్యంగా మెసేజ్‌లు చేశారు. ఏవేవో కారణాలు చెబుతున్నారు. అందుకే వారి ఫోన్‌ నెంబర్లు బ్లాక్‌ చేశా. అటు, ఇటు రెండు వైపులా నాటకాలు ఆడుతున్నారా?. నాలాగా, అంకిత, ప్రసూన్‌, శంకర్‌లాగా అంకితభావంతో పనిచేసి ఉంటే సినిమాకు ఎంతో ముఖ్యమైన వారంలో పబ్లిక్‌లోకి వెళ్లి యూనిట్‌ను ఎటాక్‌ చేయరు. వీరంతా కలిసి సినిమాకు నష్టం కలిగించారు. సోనూసూద్‌కు ఈ సినిమా గురించి మాట్లాడే హక్కు లేదు. సినిమాతో ఆయనకున్న కాంట్రాక్ట్‌ అయిపోయింది. ఈ సినిమాతో ఆయనకు ఎటువంటి సంబంధమూ లేదు” అని చెప్పింది కంగనా.