ఛాలెంజ్‌లు ఎదుర‌వ‌క‌పోతే గుర్తింపు కోల్పోయేదాన్ని!

“నాకు 15 ఏళ్ల వయసప్పుడు ఇంటి నుంచి పారిపోయాను. ఆ స్వేచ్చతో గొప్పగా ఫీలవుతూ.. ఉద్వేగానికి లోన‌య్యాను. రెండు సంవ‌త్స‌రాల‌కే సినిమా స్టార్‌న‌య్యాను. కానీ డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారిపోయాను”… అని చెప్పింది కంగ‌నా ర‌నౌత్. దేశ‌వ్యాప్తంగా ఉన్న లాక్‌డౌన్‌ను పాటించమని చెబుతూనే మ‌రోవైపు త‌న జీవితంలోని చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అనుభ‌వాల నుంచి నేర్చుకున్న పాఠాల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చింది. ఓ వీడియోను అభిమానుల‌తో పంచుకుంది. అందులో ఆమె మాట్లాడుతూ.. స్వీయ నిర్బంధంలో ఈ రోజును న‌వ‌రాత్రులుగా (తొమ్మిదో రోజు) అభివ‌ర్ణించింది. ఇన్నిరోజులు ఇంట్లో ఉండ‌టాన్ని బోర్‌గా ఫీల్ అవ‌కండని,నిజానికి చెడ్డ రోజులే మ‌న‌కు మంచి రోజులుగా మారుతాయ‌ని పేర్కొంది.
 
“నాకు 15 ఏళ్ల వయసప్పుడు ఇంటి నుంచి పారిపోయాను. ఆ స్వేచ్చతో గొప్పగా ఫీలవుతూ.. ఉద్వేగానికి లోన‌య్యాను. రెండు సంవ‌త్స‌రాల‌కే సినిమా స్టార్‌న‌య్యాను. కానీ డ్ర‌గ్స్‌ బానిస‌గా మారిపోయాను. నా జీవితం గంద‌ర‌ గోళంగా మారిపోయింది. అయితే అప్పుడు చావు నుంచి కూడా ర‌క్షించగ‌లిగే కొందరు వ్య‌క్తులు నాతో ఉన్నారు. ఇదే స‌మ‌యంలో ఒక ఫ్రెండ్ నా జీవితంలోకి ప్ర‌వేశించింది. యోగాను ప‌రిచ‌యం చేసింది. ‘రాజ‌యోగ’ పుస్త‌కాన్ని అందించింది. ఆధ్యాత్మిక‌త వైపు న‌డిపించింది. ఆ త‌ర్వాత నేను స్వామి వివేకానంద‌ను నా గురువుగా ఎంచుకుని…అప్ప‌టి నుంచి వ్య‌క్తిగతంగా ఎంతో ఎదిగాను. అయితే, చాలెంజ్‌లు ఎదుర‌వ‌క‌పోతే నా గుర్తింపును కోల్పోయేదాన్ని. ఆధ్యాత్మిక మార్గం లేకుండా.. తెలివి తేట‌ల‌ను..మాన‌సిక ఆరోగ్యాన్ని..స్వ‌శ‌క్తిని పెంచుకోలేక‌పోయేదాన్ని” అని తెలిపింది. కంగ‌నా బ్ర‌హ్మ‌చ‌ర్యం గురించి కూడా కొన్ని మాట‌ల‌ను చెప్పుకొచ్చింది. బ్ర‌హ్మ‌చ‌ర్యం అంటే.. పెళ్లికి దూరంగా ఉండ‌టం కానేకాద‌ని.. మ‌రెన్నో ప్ర‌యోజనాలున్నాయ‌ని తెలిపింది.
 
పెద్ద ఆఫర్లను సైతం తిరస్కరిస్తా!
‘క్వీన్‌’ తో ఉత్తమ నటిగా అవార్డు పొందిన కంగనా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా పరిణతి సాధిస్తూ… స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ ..పాత్ర నచ్చకపోతే పెద్ద ఆఫర్లను సైతం తిరస్కరిస్తానని చెబుతుంది. స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, బడా నిర్మాత ఆదిత్య చోప్రాకు తాను గతంలో ‘నో’ అన్న విషయాన్ని చెప్పింది. ‘సంజు’, ‘సుల్తాన్‌’ సినిమాల్లో నటించే అవకాశం తనకు లభించినా.. తానే వాటిని తిరస్కరించినట్లు తెలిపింది.
 
“రణ్‌బీర్‌ కపూర్‌ మా ఇంటికి వచ్చి మరీ ‘‘సంజు’ లో నటించమని నాకు ఆఫర్‌ ఇచ్చారు. అయితే ఆ సినిమాలో పాత్ర లో నటనకు ఆస్కారం ఉన్నట్లు అనిపించలేదు. కాబట్టి కుదరదని చెప్పాను. అసలు రణ్‌బీర్‌కు ‘నో’ చెప్పే హీరోయిన్‌ ఎవరైనా ఉన్నారా? ఇక, సల్మాన్‌ ఖాన్‌ ‘సుల్తాన్‌’ కోసం ఆదిత్య చోప్రా తొలుత నన్ను సంప్రదించారు. నేను కుదరదన్నాను. దాంతో ఆయన నాకు ఫోన్‌ చేసి… ఇంకెప్పుడూ నాతో కలిసి పనిచేయనని చెప్పారు. అదే జరిగింది. అయినా, నచ్చని పని చేయనందుకు పశ్చాత్తాప పడలేదు’’ అని కంగనా చెప్పింది.
 
నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే తనను ఇండస్ట్రీలో నిలబెట్టాయని.. సంజయ్‌ లీలా భన్సాలీతో సినిమా చేయకపోవడం కొంత బాధకు గురిచేసిందని కంగనా చెప్పింది. ‘పద్మావత్‌’ తర్వాత సినిమా చేద్దామన్నారని.. కానీ కుదరలేదని విచారం వ్యక్తం చేశారు. కాగా సంజయ్‌ దత్‌ బయోపిక్‌గా తెరకెక్కిన ‘సంజు’ మంచి విజయం సాధించింది..అదే విధంగా ‘సుల్తాన్‌’ కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది..