నన్నూ లైంగికంగా వేధించారు !

‘క్వీన్’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో డైరెక్టర్ వికాస్ బెహెల్.. విష్ చేస్తున్నట్లుగా నటిస్తూ గట్టిగా కౌగిలించుకునేవాడు. దీంతో చాలాసార్లు వదిలించుకోవడానికి ప్రయత్నించేదాన్ని”….  అంటూ లైంగిక వేధింపుల విషయమై తాజాగా బాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్ నోరువిప్పింది. ‘క్వీన్’ సినిమా దర్శకుడు వికాస్ బెహెల్ తనను లైంగికంగా వేధించాడని ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది కంగన.
వికాస్‌, మరో బాలీవుడ్‌ దర్శకుడు మధు మంతెన, అనురాగ్‌ కశ్యప్‌ కలిసి ఫాంటమ్‌ ఫిలింస్‌ పేరిట ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అయితే వికాస్‌ తనను వేధిస్తున్నారని.. ఆ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతి ఇటీవలే మీడియా ద్వారా వెల్లడించింది. దీనిపై స్పందించిన కంగన.. ‘ఆమె చెప్పే దానిలో నిజం ఉందని’ తెలిపింది.
‘‘2014వ సంవత్సరంలో ‘క్వీన్’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో డైరెక్టర్ వికాస్ బెహెల్.. విష్ చేస్తున్నట్లుగా నటిస్తూ గట్టిగా కౌగిలించుకునేవాడు. దీంతో చాలాసార్లు వదిలించుకోవడానికి ప్రయత్నించేదాన్ని. రోజూ రాత్రిళ్లు పార్టీలకు అటెండ్ కావటం వికాస్‌కి అలవాటు. అతనికి పెళ్లయినప్పటికీ.. ప్రతీ రోజు కొత్త పార్ట్‌నర్ కోసం వెతుకుతుంటాడు. షూట్‌లో అలసిపోయిన నేను నా గదిలో రెస్ట్ తీసుకునేదాన్ని. దీంతో త్వరగా నిద్రపోతానని.. నా గురించి అందరి ముందు ఎగతాళిగా మాట్లాడేవాడు వికాస్. ఇతరుల పెళ్లి, వ్యక్తిగత విషయాల గురించి నేను తప్పుబట్టను కానీ..వారి అలవాటు కాస్త వ్యసనంగా మారి వేరొకరికి ఇబ్బందికరంగా మారుతుంది’’ అని చెప్పింది కంగన.
‘క్వీన్‌’ సినిమా తర్వాత మరో స్క్రిప్ట్‌తో వికాస్ తనవద్దకు వచ్చాడనీ, అది నచ్చకపోవడంతో కథలో మార్పులు చేయాల్సిందిగా తాను సూచించానని కంగన తెలిపింది. దీంతో అహం దెబ్బతిన్న వికాస్ తనతో మాట్లాడటం మానేశాడని వెల్లడించింది. దీంతో ఆ ప్రాజెక్టు చేజారిపోయిందని పేర్కొంది. ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదని చెప్పింది.