కంగనా, విజయేంద్ర ప్రసాద్ ల ‘అపరాజిత అయోధ్య’

కంగనా రనోత్‌ వరుసగా రెండుసార్లు జాతీయ అవార్డు గెలుచుకొన్న నటి .తన నటనతో కంగనా రనౌత్ బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది. గత ఏడాది ‘మణికర్ణిక : ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రంతో దర్శకురాలిగా కూడా రాణించింది. జయలలిత జీవిత కధా చిత్రం ‘తలైవి’ సినిమా త్వరలో విడుదల కానుంది. ‘తలైవి’ పోస్టర్‌, టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు సహ దర్శకురాలిగా కూడా మెప్పించిన కంగనా.. ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైంది. ‘అయోధ్యలో రామమందిరం నిర్మాణం’.. ‘సుప్రీంకోర్టు తీర్పు’.. ఈ అంశంతో సినిమా తీసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
అయోధ్య రామమందిర నిర్మాణం ఆధారంగా ప్రముఖ రచయిత, ‘బాహుబలి’ ఫేం విజయేంద్రప్రసాద్‌ రచించిన ‘అపరాజిత అయోధ్య’ అనే సినిమాకు కంగనా రనౌత్‌.. నిర్మాత బాధ్యతలతోపాటు దర్శకత్వం కూడా చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌ గురించి కంగనా సోదరి గత నవంబర్‌ నెలలోనే అధికారికంగా ప్రకటించింది. ‘సినిమాకు దర్శకత్వం వహించాలన్న కోరిక నాకు లేదు. కాన్సెప్ట్‌ స్థాయి నుంచి పనిచేసి ఒక ప్రాజెక్ట్‌గా దీన్ని ప్రారంభించాను. దీన్ని మరో దర్శకుడితో నిర్మించాలనుకొన్నాను. ఇదే సమయంలో నేను చాలా బిజీగా ఉన్నాను. విజయేంద్రప్రసాద్‌ రచించిన ఈ సినిమా కథ పెద్ద కాన్వాస్‌పై చెయ్యాల్సిన చిత్రంగా భావిస్తున్నాను. నా సహచర భాగస్వాములు కూడా నేను దర్శకత్వం వహించాలని ఆసక్తిగా ఉన్నారు. చివరకు నేను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తే బాగుంటుందని భావించాను‘ అని ఒక ప్రకటనలో కంగనా రనోత్‌ తెలిపింది.
విశేషం ఏమిటంటే .. ఈ చిత్రంలో కంగనా నటించడం లేదంట. ఈ సినిమాను చక్కటి దృశ్యకావ్యంగా మలిచేందుకు సర్వశక్తులు ఒడ్డి పనిచేయాలని నిర్ణయించుకొని.. ఈ సినిమాలో నటించడం లేదంట. ఈ కథంశం వివాదాస్పదమైంది కాదని.. ప్రేమ, విశ్వాసం, ఐక్యత కథాంశం.. అన్నింటికి మించి దైవాంశంతో ఉండే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పింది కంగనా రనోత్‌. ఎన్నో ఏండ్లుగా వివాదాస్పదంగా ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు కథాంశంతో సినిమా అనేసరికి ..సినిమా ఎలా ఉండబోతున్నదో? అని సినీ పరిశ్రమ వర్గాలు ఆతృతతో ఎదురుచూస్తున్నారు
 
డిజిటల్‌ వైపు వెళ్లేందుకు కూడా…
లాక్‌డౌన్‌ తర్వాత వ్యక్తిగా, ఆర్టిస్టుగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నానని అంటోంది కంగనా రనౌత్‌. ‘‘లాక్‌డౌన్‌ తర్వాత మన సినిమాలు, వాటి బిజినెస్‌లు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. అసలు ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో కూడా ఇప్పుడే ఊహించలేం. కొన్ని కథలను థియేటర్స్‌లో చూస్తేనే చాలా బాగుంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆలోచిస్తే భవిష్యత్‌లో డిజిటల్‌ మీడియమ్‌కి డిమాండ్‌ పెరిగే అవకాశం కనిపిస్తోంది.
నటిగా నేను సక్సెస్‌ అయ్యాను. సినిమాలు చేస్తున్నాను. నేను కూడా ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించాను. భవిష్యత్‌లో డిజిటల్‌ వైపు వెళ్లేందుకు కూడా సిద్ధంగానే ఉన్నాను. సృజనాత్మకత కలిగిన వ్యక్తిగా నేను సాధించాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉందని నాకు తెలుసు’’ అని చెప్పింది కంగనా రనౌత్‌. ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘తలైవి’, ‘తేజస్‌’, ‘థాకడ్‌’ అనే మూడు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు కంగనా చేస్తోంది.