అతని బోధనలే నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి !

కంగనా రనౌత్‌… ఖాళీ దొరికితే చాలు జాలీ వెకేషన్‌కే కాదు తన ఇష్టదైవాలనూ దర్శించుకుంటారు. మనసులోని భావాలను కుండబద్దలు గొట్టినట్లుగా చెప్పడం బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ ప్రత్యేకత. అందుకే ఆమె అంటే కొందరికి ఇష్టం. మరి కొందరికి కష్టం. ఇలా బోల్డ్‌గా మాట్లాడే కంగనా రనౌత్‌లో దైవభక్తి అపారం. ఖాళీ దొరికితే చాలు జాలీ వెకేషన్‌కే కాదు తన ఇష్టదైవాలనూ దర్శించుకుంటారు….
 
“నేను చెప్పే మాట మీరు నమ్మకపోవచ్చు, ఎందుకంటే నా కుటుంబం మొత్తం నాస్తికులే. ఏ మతాన్నీ అనుసరించరు. కానీ ఎందుకో తెలీదు. నాకు చిన్ననాటి నుంచి దైవభక్తి ఎక్కువ. నా తల్లితండ్రులు కూడా ఎన్నడూ అడ్డు చెప్పలేదు. మతం అంటే క్రమశిక్షణ. ఎవరైనా ఏదో ఒక మతానికి కట్టుబడాలన్నది నా అభిప్రాయం. స్వామి వివేకానంద బోధనలనూ, భగవద్గీత సారాన్నీ, సనాతన ధర్మాలనూ ఎక్కువగా విశ్వసిస్తా. అవే నాలో ధార్మికబీజాలను నాటాయి. వివేకానంద బోధనలే నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. ఆయనే నా గురువు”
 
దానికి కారణం దైవబలమే !
నేను స్వతహాగా శివ భక్తురాలిని. నా ప్రతి సినిమా ప్రారంభానికి ముందు వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటాను. ఈ సారి కూడా ‘మణికర్ణిక’ సినిమా పోస్టర్‌ను అక్కడే ఆవిష్కరించాను. ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం నా సినిమాపై కచ్చితంగా ఉంటుందని నమ్ముతున్నా. గంగా నది పరవళ్లు, దైవాన్ని స్మరిస్తూ సాగే పాటలు… ఆ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఎదురయ్యే వాతావరణంతో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. నాకేం కావాలో ఆ శివుడికే తెలుసని నా నమ్మకం. గత ఏడాది కుటుంబసభ్యులతో కలిసి జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రంలో ఉన్న వైష్ణోదేవి ఆలయానికి వెళ్లాను. అయితే ఇది తొలిసారి కాదు. చాలాసార్లు ఆ యాత్రలో పాల్గొన్నా. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం దైవబలమే!