‘మణికర్ణిక ఫిల్మ్స్‌’ పేరుతో నిర్మాత అవుతోంది !

నటిగా, గాయనిగా, స్క్రిప్ట్‌ రైటర్‌గా, ఎడిటర్‌గా రాణిస్తున్న కంగనా రనౌత్‌ ఇకపై నిర్మాతగానూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మణికర్ణిక ఫిల్మ్స్‌’ పేరుతో ఓ సొంత ప్రొడక్షన్‌ సంస్థను కంగనా ప్రారంభించబోతోంది. దీనికోసమై ఇప్పటికే ముంబైలోని బాంద్రాలో దాదాపు రెండు కోట్ల రూపాయల ఖర్చుతో ఓ పెద్ద బంగ్లాను కొనుగోలు చేసింది. సరికొత్త కథలతో సినిమాలను రూపొందించడం, నూతన ప్రతిభకు ప్రోత్సాహం కల్పించడమే ఈ ప్రొడక్షన్‌ హౌజ్‌ లక్ష్యమని కంగనా తెలిపింది. అంతేకాకుండా తన ప్రొడక్షన్‌ హౌజ్‌లో రూపొందబోయే తొలి షార్ట్‌ఫిల్మ్‌ ‘ది టచ్‌’కు కంగనానే దర్శకత్వం వహించడం విశేషం. కంగనా ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మణికర్ణిక’ చిత్రంలో నటిస్తోంది. ఝాన్సీ లక్ష్మీభాయ్  జీవిత నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

ప్రతి చిత్రంలో కంగనా నటన అద్భుతం !

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను చూసి తనకు చాలా గర్వంగా ఉందని ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ బసు అన్నారు. కంగనాతో కలిసి ఏడేళ్ల కిందట ‘గ్యాంగ్‌స్టర్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన కంగనాను చూస్తే తనకు నిజంగా ఆశ్చర్యం వేస్తోందని అన్నారు.

‘నేను నా చిత్రాన్ని తెరకెక్కించే సమయంలో ఆమె కళ్లల్లో ఓ మెరుపు చూశాను.. కానీ, నిజంగా ఆమె ఇంత పెద్ద నటి అవుతుందని మాత్రం అస్సలు ఊహించలేదు. ఆమె నిజంగా ఫెంటాస్టిక్, ప్రతి చిత్రానికి ఆమెలో పరిణతి పెరుగుతూ వస్తోంది. ఆమె పోషిస్తున్న ప్రతి పాత్రలో ఎంతో వైరుధ్యం చూపిస్తోంది. ‘క్వీన్‌’, ‘తను వెడ్స్‌ మను’ వంటి చిత్రాలే కాదు.. ‘రంగూన్‌’, ‘కట్టి బట్టి’, ‘సిమ్రాన్‌’ చిత్రాలు కూడా అద్భుతం. ‘రంగూన్‌’, ‘కట్టిబట్టి’, ‘సిమ్రాన్‌’ చిత్రాలకు వచ్చిన విమర్శలను నేను పట్టించుకోను. ప్రతి చిత్రంలో ఆమె నటన అద్భుతం’ అంటూ ఆయన తెగ పొగిడేశారు.