ఇకపై దర్శకురాలిగా నిరూపించుకునే ప్రయత్నం !

భిన్న కథలు, వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన కంగనా రనౌత్‌ అతి త్వరలోనే మెగాఫోన్‌ పట్టుకోబోతున్నారు. ఇప్పటికే నటిగా, స్క్రిప్ట్‌ రైటర్‌గా, గాయనిగా, ఎడిటర్‌గా.. ఇలా పలు విభాగాల్లో తనదైన మార్క్‌తో ప్రేక్షకులను అలరించిన కంగనా ఇకపై దర్శకురాలిగా తానేమిటో నిరూపించుకునే ప్రయత్నం చేయబోతున్నారట. దర్శకురాలిగా మారుతూ తొలి ప్రయత్నంగా ‘తేజు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు ప్రధాన పాత్రల మధ్య ఎలుక, పిల్లి మాదిరిగా ఛేజింగ్‌ చేసే కథాంశంతో ఉండే ఈ చిత్రంలో కంగనా పాత్ర గ్రే షేడ్స్‌ కలిగి ఉంటుంది. ఇందులోని ప్రధాన పాత్రల కోసం రాజ్‌కుమార్‌ రావు, ఆయూష్మాన్‌ ఖురానాలను కంగనా ఎంపిక చేశారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది.

కత్తిసాము ప్రాక్టీస్ చేస్తున్న కంగనా !

ప్రస్తుతం రాణి ఝాన్సీ లక్ష్మిభాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న’మణికర్ణిక’ చిత్రంలో కంగనా నటిస్తోంది.వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం తన తాజా సినిమా మణికర్ణికపై దృష్టి సారించింది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో వివాదం, పురుషాధిక్యంపై కామెంట్లు వీడియోలు పోస్టు చేస్తూ వివాదాల వెంట తిరుగుతూ వచ్చిన కంగనా రనౌత్ రూటు మార్చింది.

‘మ‌ణిక‌ర్ణిక’ – ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమా కోసం బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ కసరత్తులు మొదలెట్టింది. ఈ చిత్రం కోసం కంగనా రనౌత్ కసరత్తులు చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఆ  వీడియోలో రెండు కత్తులను ఒకేసారి తిప్పుతూ కత్తిసాము ప్రాక్టీస్ చేస్తున్న కంగనాను చూడొచ్చు. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌హిస్తున్న ఈ చిత్రంలో కంగ‌నా ప్ర‌ధాన పాత్ర ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్ర పోషించ‌నుంది.

ఈ సినిమాకు స్టంట్ డైరెక్ట‌ర్‌గా హాలీవుడ్‌కి చెందిన నిక్ పావెల్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిక్ పావెల్ సమక్షంలో ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్న సోనూ సూద్‌, అంకిత లోఖాండే, వైభ‌వ్ త‌త్వావాడిలు కూడా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఏప్రిల్ 27, 2018న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.