అసలు నేనే ఓ అసాధారణమైన వ్యక్తిని !

తాజాగా మళ్లీ వారసత్వంపై నోరు విప్పిందామె. ఆ మధ్య కాలంలో వారసత్వంపై సంచలన కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్. ఆ వ్యాఖ్యలతో భారీ చర్చ కి తెరదీసిందామె. బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నిర్వహిస్తున్న ఓ టాక్ షోలో ఆమె పాల్గొంది. ఇంటర్వ్యూలో భాగంగా వారసత్వంపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గానూ వస్తున్న నెగెటివ్ కామెంట్స్ పై అనుపమ్ ఖేర్ అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది. అంతేకాదు.. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్‌పైనా విమర్శలు గుప్పించింది…..
  ‘‘ప్రస్తుతం నడుస్తున్న చర్చలు నాపై , నా పనిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించవు.. నాకు జరిగింది నేను చెప్పాను. అందులో తప్పైతే నాకు కనిపించట్లేదు.  స్టార్స్ పిల్లల ఫై  పరిశ్రమ చూపిస్తున్న శ్రద్ధ నాలాంటి బయటివాళ్లపై చూపించట్లేదు. అదే చెప్పాను. పదేళ్ల పాటు నేను కష్టపడ్డాను. ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్థాయికి చేరుకున్నాను. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఎంతమందిని ఎదురించి ఉంటాను..? ఇన్నేళ్లపాటు నాతో కలిసి ప్రయాణం చేసిన వారిని అడగండి తెలుస్తుంది.. నేను ఎంతమందిని ఎదిరించి ఇలా ఉన్నానో. నా జీవితం అసాధారణమైనది. అంతెందుకు నేనే ఓ అసాధారణమైన వ్యక్తిని’’ అని అంటోంది కంగన. తాను తొలిసారి వారసత్వంపై స్పందించినప్పుడు కరణ్ జోహార్‌ ధర్మా ప్రొడక్షన్ వాళ్లు.. తమ బ్లాగులో వారసత్వాన్ని సమర్థించుకున్నారని, దాంట్లో కనీస చర్చ జరగలేదని విమర్శలు గుప్పించింది.