ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొన్నా !

బాలీవుడ్‌లో మహిళా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన కథానాయికల్లో కంగనా ఒకరు. ప్రస్తుతం ఆమె క్రిష్‌ దర్శకత్వంలో ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రంలో నటిస్తున్నారు.’మణికర్ణిక’ చిత్రంలో నటించేటప్పుడు దాదాపు నా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదురైంది’ అని అంటోంది కంగనా రనౌత్‌.  ఝాన్సీ రాణి లక్ష్మిభాయి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా పలు యుద్ధ సన్నివేశాల్లో నటించేటప్పుడు కంగనా ముఖానికి కత్తిగాట్లు అయ్యాయి.

ఆ విషయాలను కంగనా చెబుతూ….’ఈ చిత్రం టైటిల్‌ను చూస్తే అర్థమవుతుంది ఇది యుద్ధ నేపథ్యంలో సాగే చిత్రమని. ఇందులో నా పాత్ర చాలా ఛాలెంజింగ్‌తో కూడుకున్నది. సినిమా కోసం కత్తి సాము, గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. ఎన్నో ప్రమాదాలకు గురయ్యాను. ఈ పాత్ర చేస్తూ దాదాపు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అంత కఠినంగా ఉంటుంది. అయినప్పటికీ పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాను. అది ఎలా ఉందనేది ప్రేక్షకులు నిర్ణయించాల్సి ఉంటుంది’ అని తెలిపింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాను ఏప్రిల్‌ 27న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

రాజకీయ ప్రవేశంపై పలు ఊహాగానాలు 

ఈ మధ్య బాలీవుడ్‌ భామ కంగనా రనౌత్‌ రాజకీయ ప్రవేశంపై పలు ఊహాగానాలు చెలరేగాయి. ఆమె ఓ రాజకీయ పార్టీలో చేరుతున్నారని, ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారనీ.. ఇలా పలు వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో కంగనా వివరణ ఇచ్చారు…. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆమె ప్రతినిధి అధికారిక ప్రకటన చేశారని బాంబే టైమ్స్‌ రిపోర్ట్‌ చేసింది.

క్వీన్‌ నటి కంగనా త్వరలో రాజకీయాల్లోకి రానున్నారంటూ కొద్ది రోజులుగా సాగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేసింది. ప్రధాని మోదీతో సమావేశమైనట్టు వచ్చిన వార్తలు నిరాధారమైనవని కంగనా ప్రతినిధి స్పష్టం చేశారు. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని స్వయంగా కంగనా పలుమార్లు చెప్పారని, బికనీర్‌లో ‘మణికర్ణిక’ సినిమా షూటింగ్‌లో ఆమె బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. అసత్య వార్తలను నమ్మవద్దని.. అవసరమైతే అధికారికంగా ఏ విషయమైనా కంగనా ప్రకటిస్తారని చెప్పారు.