బహిరంగ లేఖతో కంగనా కుమ్మేసింది !

కరణ్ జోహార్, వరుణ్ ధవన్, సైఫ్ అలీఖాన్‌లు కలిసి వారసత్వంపై పేల్చిన ‘జోక్’ వికటించి, వారు కంగనాకు క్షమాపణ  చెప్పేదాకా వెళ్ళారు. సినీ ఇండస్ట్రీలో ‘వారసత్వం’పై వ్యాఖ్యలు చేసి పెద్ద చర్చ, వివాదాన్ని లేవదీశారు  బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్.  వీడని నీడలా అది ఇప్పటికీ ఆమెను వెంటాడుతోందనడానికి మొన్నటి ఐఫా అవార్డుల వేడుకలో జరిగిన ఉదంతమే నిదర్శనం. శుక్రవారం కంగనాకు క్షమాపణలు చెబుతూ సైఫ్ అలీ ఖాన్ ఓ లేఖ కూడా రాశారు. తాజాగా ఈ వివాదంపై నేరుగానైతే స్పందించలేదు గానీ… సైఫ్ రాసిన ఓపెన్ లెటర్‌కు బదులుగా మరో ఓపెన్ లెటర్ రాస్తూ వారసత్వంపై తన మాటకు కట్టుబడే ఉంటానని కంగనా రనౌత్ ప్రకటించారు…..

  ‘‘అవార్డుల వేదికపై జరిగిన చర్చ చాలా చిరాకుగా అనిపించినా.. మంచి చర్చకే బాటలు వేశారు. అందులోని కొన్ని కోణాలను నేను ఎంజాయ్ చేసినా.. మరికొన్ని నిరాశకు గురిచేశాయి. దీనిపై సైఫ్ రాసిన లేఖతోనే నేను నిద్ర లేచాను. చివరిసారిగా కరణ్ జోహార్ వారసత్వంపై ఓ బ్లాగ్ రాశారు. ఇప్పటి వ్యాఖ్యల కన్నా ఆ బ్లాగ్ నన్ను చాలా బాధించింది. సినీ వ్యాపారానికి టాలెంట్‌తో సంబంధం లేదని, దానికి వెనక ఇంకా ఎన్నో ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వ్యాఖ్యలను ఆయన తప్పుడు సమాచారంతోనో లేదంటే సరైన జ్ఞానం లేకుండానో చేసి ఉంటారు. ఆ వ్యాఖ్యలు ఎలా చేసినా.. ఆనాటి మహానటులు దిలీప్ కుమార్, కే ఆసిఫ్, బిమల్ రాయ్, సత్యజిత్ రే, గురు దత్ తదితర మహామహుల టాలెంట్, వారి అత్యున్నత ప్రమాణాలను కించపరిచారు. అవమానపరిచారు. ఇప్పటికీ ప్రపంచంలో అనేక రంగాల్లో టాలెంట్‌కు కాకుండా అలాంటి వారికే పట్టం కడుతున్నారనడానికి చాలా ఉదాహరణలున్నాయి. సైఫ్ నాకు ఈ విషయాన్నే ఉటంకిస్తూ ఓపెన్ లెటర్ రాశారు. దీనిపై నా ఉద్దేశాన్ని చెబుతున్నాను. దయచేసి ఎవరూ నా అభిప్రాయాలను తప్పుగా అర్థం చేసుకోవద్దు.
సైఫ్.. మీరు మీ లేఖలో ‘కంగనాకు నేను క్షమాపణలు చెప్పాను. ఇంక, ఈ విషయంలో ఎవరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడితో ముగిసిపోయింది’’ అని అన్నారు. కానీ, ఇది నా ఒక్కదాని సమస్యే కాదు. ప్రజ్ఞాపాటవాలు లేకపోయినా మానవుల భావోద్వేగాలను ఆధారం చేసుకుని ‘వారసత్వం’ అనే దానినే ఎక్కువగా వాడుకుంటున్నారు. విలువలను వదిలేసి మానవ భావోద్వేగాలతో చేసే వ్యాపారంలో ‘పైకి’ చెప్పుకొనే లాభాలేవస్తాయి. వాస్తవికతను చూస్తే.. 130 కోట్ల మంది ప్రజలకు ఆ లాభాల వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. అన్ని చోట్ల వారసత్వం అనేది పనికిరాదు. మంచి విలువలు నేర్పి గొప్ప విజయం సాధించిన వారి నుంచి నేను ఈ విలువలు నేర్చుకున్నాను. ఆ విలువలు ఏ ఒక్కరి సొత్తూ కాదు. అందరికీ చెందినవి. స్వామి వివేకానంద, ఐన్‌స్టీన్, షేక్స్‌పియర్.. ఏ కొందరికో చెందిన వ్యక్తులు కాదు. వాళ్లంతా కూడా సమాజం మొత్తానికి చెందిన వాళ్లు. వాళ్లు చేసిన మంచి పనులు మనకు భవిష్యత్తునిచ్చాయి. మన పనులు మన ముందు తరాల వారికి భవిష్యత్తును నిర్మించేలా ఉండాలి’’ అని ఆమె అందులో చెప్పింది