నా పార్టీ విభిన్నంగా ఉండబోతోంది !

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అంతా ఆశ్చర్యపోయే ప్రకటన చేశారు.ఓవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, మరోవైపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం కర్ణాటక పర్యటనలో ఉన్న సమయంలోనే  బెంగళూరులోని తన రిసార్ట్‌లో ‘సొంత పార్టీ’ యోచనను మీడియా ముందుంచారు. పార్టీ పేరు, సింబల్‌పై ఇంకా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే వచ్చే ఏడాది మేలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పారు. చాలాకాలంగా రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన తనకు ఉన్న విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు….

‘ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తున్నాను. అది పూర్తికాగానే పార్టీ నిర్మాణానికి పూర్తిగా అంకింతమవుతాను’ అని ఉపేంద్ర తెలిపారు. కాగా, ఉపేంద్ర బీజేపీలో చేరుతారని, బెంగళూరులో అమిత్‌షాను కలుస్తారని ఊహాగానాలు రెండ్రోజులుగా బలంగా వినిపించాయి. అయితే ఈ ఊహాగానాలను మీడియా సమావేశంలో ఉపేంద్ర కొట్టిపారేశారు. ‘ఒక పార్టీ పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడిన పని’ అనే ఆలోచనతోనే పలువురు మంచి వ్యక్తులు రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పారు. తన పార్టీ  విభిన్నంగా ఉండబోతోందని ఉపేంద్ర చెప్పారు.

పార్టీ కోసం ఎవరి నుంచీ డబ్బులు తీసుకునేది లేదని అన్నారు. రాజకీయ ప్రచారానికి అంతా అనుసరించే సంప్రదాయ విధానాలను కూడా తాను అనుసరించేది లేదని, సోషల్ మీడియా, ఇతర మీడియా ఔట్‌లెట్స్ ద్వారా పార్టీని ప్రజల ముందుకు తీసుకు వెళ్తానని చెప్పారు. ఎన్నికలకు సమయం తక్కువ ఉన్నందున పార్టీని జనం ముందుకు తీసుకువెళ్లడం కష్టం కావచ్చన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. ‘నిజం చాలా శక్తివంతమైందని నేను నమ్ముతాను. ప్రజలకు చాలా వేగంగా చేరువవుతాననే నమ్మకం నాకుంది’ అని చెప్పారు. తన పార్టీ విషయంలో ప్రజలు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.