ఇలానే మరో రెండు దశాబ్దాలు పూర్తి చేస్తా !

‘నటిగా ఇండిస్టీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి కావస్తున్నాయి. ఇలానే విజయవంతంగా మరో రెండు దశాబ్దాలను పూర్తి చేయాలనుకుంటున్నా’ అని అంటున్నారు కరీనా కపూర్‌.
2000 సంవత్సరంలో ‘రెఫ్యూజీ’ చిత్రంతో హీరోయిన్‌గా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది కరీనా. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి అగ్ర నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రెగెన్సీ కారణంగా కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంది. కుమారుడు తైమూర్‌ అలీ ఖాన్‌కు జన్మనిచ్చిన తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ ‘వీరె ది వెడ్డింగ్‌’ చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ…..

‘ఈ జర్నీ ఎంతో గౌరవ ప్రదమైనది. సుసంపన్నమైనది. 18 ఏండ్లుగా నటిగా కొనసాగుతున్నా. ఈ జర్నీలో నాకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకున్నాను. అందుకోసం నన్ను నేను ఎంతో మార్చుకున్నాను. కాలంతోపాటు జనరేషన్‌ కూడా మారింది. ఎంతో మంది వస్తున్నారు.. పోతున్నారు. కానీ నేనింకా పదిలంగా నా స్థానంలో ఉన్నానంటే అది నా నమ్మకమే. ఇటీవల మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాలు పెరుగుతున్నాయి. సమాన అవకాశాల విషయంలో మహిళలు గళం విప్పటం అభినందనీయ పరిణామం. మాతృత్వాన్ని ఆస్వాదించిన తర్వాత తిరిగి ‘వీరె ది వెడ్డింగ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. శశాంక్‌ ఘోష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రం నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రాన్ని జూన్‌ 1 విడుదల చేయబోతున్నారు. కచ్చితంగా నాకిది మంచి రీఎంట్రీ ఫిల్మ్‌ అవుతుందని నమ్ముతున్నాను’ అని చెప్పింది.

‘సైజ్‌ జీరో’ ట్రెండ్‌ సెట్టర్‌ !
‘సైజ్‌ జీరో’ అంటూ ఒక ట్రెండ్‌ పట్టుకొచ్చింది. అందరూ దాన్ని ఫాలో కాగానే, కర్వీగా ఉండడమే అందం అనేసింది.మాస్‌ సినిమాల్లో కనిపిస్తే చాలు అని హీరోయిన్లు అనుకున్నప్పుడల్లా కొత్త కొత్త జానర్స్‌ను ఎంచుకుంది.ఎప్పటికప్పుడు ట్రెండ్‌ సృష్టిస్తుంది. అందరూ ఆ ట్రెండ్‌ను అందుకోగానే మళ్లీ కొత్త ట్రెండ్‌. ఈ ట్రెండ్‌సెట్టర్‌ విశేషాలివీ…

ఇద్దరు పిల్లలనూ స్టార్లను చేసింది !
బాలీవుడ్‌లో కపూర్‌ ఫ్యామిలీకి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. కరీనా కపూర్‌ అయినా, అక్క కరిష్మా కపూర్‌ అయినా, అనుకుంటే ఈజీగా హీరోయిన్లు అయిపోవచ్చు. కానీ తండ్రి రణధీర్‌ కపూర్‌కు తన పిల్లలు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు. ఒప్పుకోలేదు. ‘పిల్లలను నేనే పెంచి పెద్ద చేస్తా’ అని బబితాకపూర్‌ రణధీర్‌కు దూరమైంది. ఇద్దరు పిల్లలనూ స్టార్లను చేసింది. ‘మా ఇద్దరినీ అమ్మే పెంచి పెద్ద చేసింది’ అని చెబుతూంటుంది కరీనా. ‘అలాగని నాన్న ప్రభావం నా మీద లేదని చెప్పను’ అని కూడా అంటుంది. కరీనా సూపర్‌స్టార్‌ అయ్యాక రణధీర్‌ మళ్లీ ఇంటికి దగ్గరయ్యాడు. వారిది ఇప్పుడు క్యూట్‌ ఫ్యామిలీ.

నిజంగానే క్యూట్‌ ఫ్యామిలీ!
సైఫ్‌ అలీఖాన్, కరీనాకపూర్‌లకు హాట్‌ కపుల్‌ అన్న పేరుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పటి నుంచే ఈ జోడీకి మంచి పేరుంది. ఇప్పుడు వీరి జీవితంలోకి తైమూర్‌ కూడా వచ్చేశాక క్యూట్‌ ఫ్యామిలీ అంటూ అభిమానులు వీరికి ఒక స్పెషల్‌ ప్లేస్‌ ఇచ్చేస్తారు. సైఫ్‌.. కరీనా.. తైమూర్‌.. నిజంగానే క్యూట్‌ ఫ్యామిలీ!