అతడి వల్లనే టాప్ స్టార్‌ హీరో సినిమా వదులుకున్నా!

కరీనా కపూర్‌… “అతని ఆనందమే నాకు ముఖ్యం. అందుకే బిగ్గెస్ట్‌ ప్రాజెక్ట్‌ను వదులుకున్నా” అని అంటోంది కరీనా కపూర్‌. ప్రెగ్నేన్సీ కారణంగా కరీనా దాదాపు రెండేండ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. రీఎంట్రీ ఇస్తూ ఇటీవల ‘వీరె ది వెడ్డింగ్‌’ చిత్రంలో నటించి మంచి ప్రశంసలందుకున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్‌ నటిస్తున్న ‘భారత్‌’లో తొలుత కరీనాకే హీరోయిన్‌గా ఛాన్స్‌ వచ్చిందట. అయితే ఈ సినిమా ఏడు వేర్వేరు దేశాల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. పైగా ఐదు విభిన్న గెటప్స్‌లో కనిపించాల్సి ఉంది. దీంతో తన కుమారుడికి దూరంగా ఉండాల్సి వస్తుందని భావించిన కరీనా ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందట…

“తైమూర్‌ ఎదిగే ఏజ్‌ ఇది. ఈ టైమ్‌లో అతనితో నేను ఉండాలి. అతని ఆనందమే నాకు ముఖ్యం. అందుకే బిగ్గెస్ట్‌ ప్రాజెక్ట్‌ను వదులుకున్నా. మా బాబు తైమూర్‌ వల్ల ఓ ఇండియన్‌ టాప్ స్టార్‌ సినిమా వదులుకున్నా. తైమూర్‌ ఆనందం కంటే నాకు మరేది ముఖ్యం కాదు.ఈ విషయంలో నేను సరైన నిర్ణయమే తీసుకున్నానని భావిస్తున్నాను” అని కరీనా తెలిపారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌కి ప్రియాంకను తీసుకున్నారు. ఆమె ఓ హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ కారణంగా దీన్నుంచి తప్పుకున్న విషయం విదితమే. చివరకు కత్రినా కైఫ్‌ని ఎంపిక చేశారు. కరీనా ప్రస్తుతం ‘గుడ్‌ న్యూస్‌’ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో కలిసి నటిస్తున్నారు.