నేను ఆశించే నిజాయితీ కరువైపోతోంది!

“నేను ఎవరి నుంచి నిజాయితీని ఆశిస్తానో.. వారి నుంచి అది కరువైపోతోంది. ముఖ్యంగా నా సినిమాల గురించి.. నాకు దగ్గరగా ఉన్న వాళ్లు నిజాయితీగా అభిప్రాయాలను చెప్పడం లేదు”…అని ఆవేదన వ్యక్తం చేసింది కరీనా కపూర్‌. బాలీవుడ్‌ చిత్రసీమలో నాతో పాటు పని చేసే వారు ఎవరు నిజాయితీగా ఉంటారో చెప్పలేం. ఎవరి గురించైనా ..ఉన్న విషయం చెప్పినా దాన్ని సానుకూలంగా తీసుకోవడం లేదు .నా చుట్టూ ఉన్న వారే నాచిత్రాల విషయంలో వాస్తవం చెప్పడం లేదని ఆమె ఆవేదన చెందుతోంది. వ్యక్తుల విషయంలోనైనా, సినిమాల విషయంలోనైనా ముక్కుసూటిగా ఉండే వ్యక్తి కరీనా కపూర్‌. అటువంటిది ఆమె ఈ విషయంలో ఆవేదనగానే మాట్లాడింది.
 
సినిమా రంగంలోని వారి నిజాయితీ గురించి మాట్లాడుతూ…
నిజాయితీ గురించి నేను పెద్దగా ఆలోచించడం లేదండి. నేను నిజం చెప్పినా వాళ్లు దాన్ని మంచిగా తీసుకోవడం లేదు. నేను ఎవరి నుంచి నిజాయితీని ఆశిస్తానో వారి నుంచి అది కరువైపోతోంది . ముఖ్యంగా నా సినిమాల విషయంలో నాకు దగ్గర ఉన్న వాళ్లు నిజాయితీగా వాళ్ల అభిప్రాయాలను చెప్పడం లేదు. ముఖ్యంగా స్టార్స్‌ చుట్టూ ఉన్న వాళ్ళు వాస్తవంగా వ్యవహరించాలి. నా విషయానికి వచ్చినప్పుడు మరీ ఎక్కువ పాటించాలి. నా చుట్టూ ఉన్న వాళ్లు నేను ఏది చెబితే దానికి .. ‘అవును మేడమ్‌’, ‘యస్‌ మేడమ్‌’, ‘సూపర్‌’ అని అనడం నాకు నచ్చదు. ఇంకో విషయం ఏమిటంటే… నటులుగా ఎదుగుతున్న వారు పక్క వారు ఇచ్చే సూచనల గురించి చాలా ఆతృతగా ఎదురు చూస్తారు. వాళ్లు ఇచ్చే సలహాను బట్టే వారి తర్వాత ప్రాజెక్టులో మార్పులు ఉంటాయి. ఇప్పుడు నా పరిస్థితీ అంతే. కానీ పరిశ్రమలో ఇప్పుడు అలా లేదు. ఒకరినొకరు పొగుడుకోవడం చాలా ఎక్కువయిపోయింది” అని పేర్కొంది.
 
“నేను చిత్ర పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్ధాలు గడిచిపోయాయి. అయినా అభిమానులు ఇప్పటికీ నన్ను యువతరం నటులతో పోల్చుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నన్ను ఇప్పటి కొత్త తరం వారితో పోల్చడం సరికాదు’ అని అంటోంది స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌. ఓ ఇంటర్వ్యూలో కరీనా మాట్లాడుతూ… ‘నేను చిత్ర పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్ధాలు గడిచిపోయాయి. అయినా అభిమానులు ఇప్పటికీ నన్ను ప్రస్తుత యువతరంతో పోల్చుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది’ అని అన్నారు. ఎప్పుడూ తనని ఇతరులతో పోల్చడం సంతోషకరమైన విషయమే అయినప్పటికీ… ఎందుకు అలా పోల్చడం? … అది సరైన పద్దతి కాదని తన అభిప్రాయాన్ని చెప్పింది . ‘ఇరవై ఏళ్ల నుంచి నేను నటిస్తున్నాను. నా పనేంటో నేను చేసుకుంటున్నాను. ప్రస్తుతం నా సినీ జీవితం పట్ల సంతృప్తిగా ఉన్నాను’ అంటూ కరీనా చెప్పుకొచ్చింది.
 
కరీనా కపూర్‌ 2000 సంవత్సరంలో అభిషేక్‌ బచ్చన్‌ సరసన ‘రెఫ్యూజీ’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. రెండవ చిత్రం ‘అశోక’ విజయవంతం కావడంతో కరీనాకు మంచి బ్రేక్‌ వచ్చింది. మూడవ సినిమాతోనే అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌తో కలిసి బ్లాక్‌ బ్లాస్టర్‌ హిట్‌ ‘కభీ ఖుషీ కభీ గమ్’లో హృతిక్‌కు జోడిగా నటించింది . ఆ తరువాత ‘చమేలీ’, ‘జబ్‌ ఉయ్ మెట్‌’, ‘దేవ్’, ‘3 ఇడియట్స్’, ‘బజరంగీ భాయిజాన్‌’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి హిట్ సినిమాలలో నటించి కరీనా స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది . గ్లామరస్‌ పాత్రలతో పాటు పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ చేస్తూ.. యువతరం హీరోయిన్స్‌కు గట్టి పోటీనిస్తూ వస్తోంది కరీనా. కరీనా కపూర్‌ అక్షయ్ కుమార్‌తో కలసి చేసిన ‘గుడ్‌ న్యూస్‌’ ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.