పడిపోతున్న నన్ను నిలబెట్టారు !

“సైఫ్‌ అలీఖాన్‌ కెరీర్‌ పరంగా పడిపోతున్న నన్ను నిలబెట్టారు. నేను కోలుకునేలా చేసారు” …అని కరీనా కపూర్‌ అన్నారు. తన కుమారుడు తైమూర్‌ అలీ ఖాన్‌కి జన్మనివ్వక ముందు కరీనా బాలీవుడ్‌లో అత్యంత క్రేజీ కథానాయిక. రీఎంట్రీ తర్వాత కూడా ఏమాత్రం వన్నె తగ్గకుండా ఎప్పటిలాగే రాణిస్తున్నారు. పలు ఆసక్తికర ప్రాజెక్ట్‌ల్లో నటిస్తూ బిజీగా ఉన్న కరీనా తన వ్యక్తిగత విషయాలను తొలిసారి సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది….
 
“అక్క కరిష్మా సినిమాలు చేస్తున్నప్పుడు ఎంతో సంతోషించాను. నటించాలనే కోరిక అప్పుడే కలిగింది. నేను ఇండిస్టీలోకి అడుగుపెట్టిన కొత్తలో మంచి ఛాన్స్‌లు చాలానే వచ్చాయి. అద్భుతమైన సినిమాల్లో నటించా. కానీ ఓ సంవత్సరం నాకు ఒక్క సినిమా కూడా లేదు. కెరీర్‌ ముగిసిపోయిందనుకున్నా. జీరో సైజ్‌ అవ్వాలని చెప్పారు. కెరీర్‌లో ఒడిదుడుకులు సహజమే. కానీ సినీ ప్రముఖుల విషయంలోఈ ఎత్తు పల్లాలు చాలా కఠినంగా ఉంటాయి. నా జీవితంలో కెరీర్‌ పరంగా పడిపోతున్న సమయంలో సైఫ్‌ నన్ను పట్టుకున్నారు. నన్ను నేను ప్రేమించుకునేలా చేశారు. ‘తషన్‌’ సినిమా చిత్రీకరణ సమయంలో సైఫ్‌పై నాకున్న అభిప్రాయం మారింది. ఆయన కోసమే నా హృదయం కొట్టుకుంటుందని పించింది.
 
ఆయన నాకంటే పదేండ్లు పెద్ద, పైగా పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. కానీ ఆయన నా జీవితాన్ని ఎలా బ్యాలెన్స్‌ చేసుకోవాలో నేర్పించారు. ఇద్దరం ప్రేమించుకున్నాం. ఓసారి సైఫ్‌ అమ్మని కలిసి ‘మిగతా జీవితం కరీనాతో గడపాలనుకుంటున్నా. కలిసి జీవించాలనుకుంటున్నాం’ అని చెప్పారు. అమ్మ అభ్యంతరం చెప్పలేదు. పెద్దల సమక్షంలో మా పెళ్లైంది. మా ప్రేమకి ప్రతిరూపంగా తైమూర్‌ జన్మించాడు. తల్లి కావడమే నా జీవితంలో గొప్ప విషయం. తైమూర్‌ నాలో భాగం. తను లేకుండా ఒక గంట కూడా ఉండలేను. ఇప్పుడు కెరీర్‌, కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకోగలుగుతున్నా. ఓ నటిగా, మహిళగా ఇంకా ఎంతో సాధించాలనుకుంటున్నా’ అని కరీనా చెప్పారు. ప్రస్తుతం ‘గుడ్‌ న్యూస్‌’ చిత్రంలో కరీనా నటిస్తోంది.