అతనితో చెయ్యాలని రెండు దశాబ్దాలుగా ఎదురుచూపులు

కరీనాకపూర్‌… “మా కాంబినేషన్‌లో సినిమా వస్తే అది కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ అవడం ఖాయం” అని అంటోంది కరీనాకపూర్‌.   ఫలానా హీరోతో యాక్ట్‌ చేయాలనో, ఫలానా హీరోయిన్‌తో నటించాలనో, ఫలానా దర్శకుడితో కలిసి పనిచేయాలనో, ఫలానా ప్రతిష్టాత్మక బ్యానర్‌లో రూపొందే సినిమాలో నటించాలని… ఇలా నటీనటులెవరైనా కలలు కంటుంటారు. కొన్నిసార్లు ఈ కలలు వెంటనే నెరవేరితే, కొన్నిసార్లు జీవిత కాలం ఎదురు చూసినప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితిని ప్రస్తుతం కరీనాకపూర్‌ ఫేస్‌ చేస్తోంది.
కళాత్మక చిత్రాల సృష్టికర్త సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించే ఒక్క సినిమాలోనైనా పని చేయాలని కరీనా గత 18 ఏండ్లుగా ఎదురు చూస్తోందట. సంవత్సరాలు గడుస్తున్నా ఆ కల కలగానే మిగిలిపోయిందని కరీనా ఆవేదన వ్యక్తం చేస్తోంది. 2000లో ‘బాజీరావ్‌ మస్తానీ’ కోసం మొదట సల్మాన్‌, కరీనాని ఎంపిక చేశారు. దాదాపు అంతా ఓకే అయ్యింది. అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది. దాదాపు 15ఏండ్ల తర్వాత దాన్ని 2015లో పూర్తి చేశారు. కాకపోతే సల్మాన్‌, కరీనా స్థానంలో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనె వచ్చారు. ఆ తర్వాత ‘రామ్‌లీలా’ టైమ్‌లోనూ కథానాయికగా తొలుత కరీనానే అనుకున్నారట. అది కూడా వర్కౌట్‌ కాలేదు. ఇలా రెండు సార్లు భన్సాలీతో పనిచేసే అవకాశాన్ని కరీనా కోల్పోయింది.
మరి ఇప్పటికైనా భన్సాలీతో చేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు కరీనా సమాధానమిస్తూ…’భన్సాలీతో పనిచేయాలని ఇప్పటికీ వెయిట్‌ చేస్తున్నా. నాతోపాటు నా అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మా అబ్బాయి తైమూర్‌కి పదేండ్లు వచ్చే లోపైనా అది నెరవేరుతుందని ఆశిస్తున్నా. మా కాంబినేషన్‌లో సినిమా వస్తే అది కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ అవడం ఖాయం’ అని తెలిపింది. ఇటీవల ‘వీరె ది వెడ్డింగ్‌’ చిత్రంతో ఆకట్టుకున్న కరీనా ప్రస్తుతం ‘గుడ్‌ న్యూస్‌’ చిత్రంలో అక్షయ్ కుమార్‌ సరసన నటిస్తోంది.