వారు టెన్షన్‌ పడింది నా కోసం కాదు !

‘టైగర్‌ జిందా హై’ చిత్రం కోసం యాక్షన్‌ సీక్వెన్స్‌లో భాగంగా కారు ఛేజింగ్‌ దృశ్యాలు చిత్రీకరిస్తున్న టైమ్‌లో నేను నడుపుతున్న సూపర్‌ ఫాస్ట్‌ కారు అదుపుతప్పి ఓ గోడకి ధీ కొట్టింది. అయినప్పటికీ తృటిలో ప్రమాదం తప్పినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని అంటోంది కత్రినా కైఫ్‌. సల్మాన్‌ఖాన్‌, కత్రినా జంటగా నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ జిందా హై’. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో విడుదలైన ‘ఏక్‌ థా టైగర్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం నాయకానాయికలు సల్మాన్‌, కత్రినా చిత్ర ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ చిత్ర షూటింగ్‌ టైమ్‌లో జరిగిన ఓ కారు ప్రమాదం గురించి కత్రినా మీడియాకు తెలియజేసింది….

‘మొరాకోలోని సన్నపాటి గల్లీల్లో యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నారు. అందులో భాగంగా బాగా ఇబ్బందికరమైన బాగా ఇరుకైన గల్లీలో నేను సూపర్‌ ఫాస్ట్‌ కారును డ్రైవ్‌ చేసుకుంటూ రావాలి. రిహార్సల్స్‌ చేసిన తర్వాత షాట్‌కి రెడీ అయ్యాను. షాట్‌ చిత్రీకరిస్తున్న తరుణంలో అనుకోకుండా ఓ ప్లేస్‌లో కారు నడపటం ఇబ్బంది కావడంతో అదుపు చేయలేకపోయాను. దీంతో స్పీడ్‌గా వెళ్తున్న నా కారు ఎదురుగా ఉన్న గోడని ఢ కొట్టింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో యూనిట్‌ అంతా షాక్‌ అయ్యారు. హడావుడిగా అందరూ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు. నాకేమీ దెబ్బలు తగలకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొంత సేపటి తర్వాత నాకర్థమైంది ఏమిటంటే.. యూనిట్‌ టెన్షన్‌ పడింది నా కోసం కాదు.. నా కారుకి కట్టిన హై కాస్ట్‌ కెమెరా కోసం (నవ్వుతూ). ఇంత జరిగినా షాట్‌ బాగా రావడం సంతోషాన్నిచ్చింది’ అని కత్రినా చెప్పింది. షారూఖ్‌ఖాన్‌, ఆనంద్‌.ఎల్‌.రాయ్  కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం,
అమీర్‌ఖాన్‌తో ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ చిత్రాల్లో నటిస్తూ కత్రినా బిజీగా ఉంది.