జీవితం పట్ల నా దృష్టి కోణాన్ని మార్చేశాయి !

‘‘కరోనా వైరస్‌ కారణంగా తలెత్తిన పరిస్థితులు జీవితం పట్ల నాదృష్టి కోణాన్ని మార్చివేశాయి’’ అని అంటోంది కత్రినా కైఫ్‌. ‘‘ప్రపంచం మొత్తం ముందుకెళుతున్న సమయంలో కరోనా వచ్చి వెనక్కి నెట్టేసింది. కరోనాకు ముందు మన జీవితాలు ఎలా సాగాయి? అని ఆలోచిస్తే.. ఇకముందు అప్పటి పరిస్థితులు ఉంటాయా? అనే సందేహం కలుగుతోంది. మన సాధారణ జీవితం మనకు తిరిగి ఎప్పుడు లభిస్తుందో చెప్పలేం. దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అందుకే మనం రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన ఆహారపు అలవాట్లు కూడా ఆరోగ్యకరమైనవిగా ఉండటమే ఉత్తమం. నలుగురితో కలిసిమెలిసి ఉండాలంటారు.. కానీ ఇప్పుడు నలుగురి క్షేమం కోసం దూరంగా ఉండటమే మంచిది. కరోనాని తరిమేశాక ఈ దూరాన్ని కూడా తరిమేద్దాం’’ అని చెప్పింది.
 
వందమంది డ్యాన్సర్స్‌కి ఆర్థిక సహాయం !
కరోనా మహమ్మారి దెబ్బకు సినీ ఇండస్ట్రీ కుదేలైన సంగతి తెలిసిందే. షూటింగ్స్ లేకపోవడంతో సినిమా మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. బాగా బ్రతికినోళ్లు కూడా నెలల తరబడి ఆదాయం లేకపోవడంతో వేరే మార్గాలను వెతుక్కుంటున్నారు. కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటుంటే.. మరికొందరు సినీ కార్మికులు పండ్లు, కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. సినిమా షూటింగ్స్ తో పాటు ఇతర కార్యక్రమాలు కూడా లేకపోవడంతో డ్యాన్సర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీరి దీన స్థితిని చూసి కత్రినా కైఫ్ 100 మంది డ్యాన్సర్స్‌కి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చింది.వారికి కూరగాయల వ్యాపారం, టిఫిన్ సెంటర్స్ వంటివి పెట్టుకోవడానికి సహాయం చేసింది కత్రినా. ఇంతకు ముందు హృతిక్ రోషన్ 100 మంది గ్రూప్ డాన్సర్లకు సాయం చేశారు. హృతిక్ స్పూర్తితో.. ఇప్పుడు కత్రినా కూడా వారిని ఆదుకుంది. కత్రినా చేసిన సహాయానికి డ్యాన్సర్స్ ఆమెకు కృతఙ్ఞతలు తెలియజేశారు.
 
యువహీరో విక్కీ కౌశ‌ల్‌ తో ప్రేమ !
బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌, యువహీరో విక్కీ కౌశ‌ల్‌ ప్రేమ వ్యవహారం వార్తలు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలను విక్కీ తోసిపుచ్చారు. తాను సింగి‌లే అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ విక్కీ కత్రినాతో కలుస్తూనే ఉన్నాడని తెలుస్తోంది. అప్పుడప్పుడు వీరి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ.. వారి ప్రేమ నిజమే అని చెబుతున్నాయి. వారి ప్రేమాయణాన్ని ఎంత గోప్యంగా ఉంచాలనుకున్నా కూడా ఏదో రకంగా బయటికి వస్తూనే ఉంది. తాజాగా అర్థరాత్రి వేళ ముసుగు వేసుకొని కత్రినా ఇంటికి వెళ్లిన విక్కీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ ఫోటోలతో వీరిద్దరి మధ్య ప్రేమ వార్తలు మరింత బలపడ్డాయి.తొందర్లోనే వీరి పెళ్ళికూడా జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.