పది నిమిషాల డాన్స్‌ షోకి భారీ పారితోషికం డిమాండ్‌ !

గతంతో పోలిస్తే అగ్ర హీరోలకు దీటుగా బాలీవుడ్‌ కథానాయికలు బాగా రాణిస్తున్నారు. సినిమాలు, పాత్రల ఎంపిక విషయంలోనే కాదు పారితోషికం విషయంలోనూ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటున్నారు. ఈ ధోరణిని కేవలం సినిమాలకే పరిమితం చేయడం లేదు. ప్రత్యేక ఈవెంట్ల కోసం అవకాశం వచ్చినప్పుడు అక్కడ కూడా తమ పనికి తగ్గట్టు పారితోషికాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. రెండేండ్ల క్రితం ఐపీఎల్‌ ఓపెనింగ్‌ సెర్మనీలో స్పెషల్‌ సాంగ్‌లో అదరగొట్టి ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కత్రీనా కైఫ్‌ తాజాగా మరోసారి ఐపీఎల్‌లో మెరవబోతున్నారు. కత్రినాకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఈ ఏడాది ఐపీఎల్‌ క్లోజింగ్‌ సెర్మనీలో ఆమెతో ప్రత్యేక డాన్స్‌ చేయించాలని నిర్వహకులు భావించారు. అందుకు కత్రినా కూడా గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌ హిట్‌ సాంగ్‌ ‘స్వాగ్‌ సె స్వాగత్‌’ సాంగ్‌కి కత్రినా డాన్స్‌ చేయనున్నారట. సల్మాన్‌, కత్రినా జంటగా నటించిన ‘టైగర్‌ జిందా హై’ చిత్రంలోని పాట ఇది. అయితే పది నిమిషాల పాటు ఉండే ఈ డాన్స్‌ షోకి కత్రినా భారీగానే రెమ్యూనరేషన్‌ తీసుకొబోతున్నారట. గతంతో పోల్చితే రికార్డు స్థాయిలో పారితోషికం డిమాండ్‌ చేశారని సమాచారం. అయినప్పటికీ నిర్వా  హకులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.  కత్రినా ప్రస్తుతం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’, ‘జీరో’ చిత్రాల్లో నటిస్తోంది.

కత్రినాకు భారీగా ముట్టజెప్పారు !
కత్రినా ఇటీవలి కాలంలో సినిమాల్లో కన్నా వార్తల్లోనే ఎక్కువగా కనపడుతోంది. ఇప్పుడు కూడా ఆమె గురించిన ఓ వార్త బాలీవుడ్‌లో తెగ షికారు చేస్తోంది. ఇంతకీ అసలు సంగతేమిటంటే….ఇటీవల కత్రినా ఓ పెళ్ళిలో తెగ సందడి చేసింది. అది బంధువులు లేదా స్నేహితుల పెళ్ళికాదట. పూర్తిగా ఆమెకు తెలియని వారి పెళ్ళట. అలా తెలియని వారి పెళ్ళికి వెళ్ళడమే కాకుండా క్లీవేజ్ షో కూడా చేసిందట! ఇటీవలికాలంలో బాలీవుడ్‌ తారలు ఇలా పెళ్ళిళ్ళలకూ పార్టీలకు వెడుతూ స్పెషల్‌ అట్రాక్షన్‌ అవుతున్నారు. కత్రినా కూడా అదే పనిచేసిందన్నమాట! ఇందుకుగాను కత్రినాకు భారీగా ముట్టజెప్పారని బాలీవుడ్‌ జనాలు అంటున్నారు. కొంత కాలం క్రితం వరకూ యాడ్‌లా ద్వారానే సినీ ప్రముఖులకు భారీగా డబ్బు ముట్టేది. ఇప్పుడు కొత్తగా ఇలాంటి వాటి ద్వారా కూడా భారీగానే పుచ్చుకుంటున్నారు. అంటే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను నూటికి నూరుపాళ్ళు ఆచరిస్తున్నారన్నమాట