ఇప్పుడు నేను ప్రపంచంతో కలిసి నడుస్తున్నట్లుంది!

‘ఈ ప్రపంచం దారి ఒకవైపు’… ‘నా దారి ఒకవైపు’ అన్నట్లుగా గతంలో ఆలోచించేదాన్ని. ఇప్పుడు మాత్రం నేను ప్రపంచంతో కలిసి నడుస్తున్నట్లుగా ఉంది… అని అంటోంది కత్రిన కైఫ్. అప్పట్లో ఒకరోజు ఏదో జరిగింది… దాని గురించే ఎన్నో ఆలోచనలు. పదే పదే నన్ను డిస్టర్బ్‌ చేస్తున్నాయి. నేను వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సున్నితంగా ఉండేదాన్ని. ఇది మంచి పద్ధతి కాదు అనిపించింది. ఇప్పుడు నాలో మార్పు వచ్చింది. నా చుట్టూ జరిగే విషయాలను లోతుగా విశ్లేషిస్తున్నాను. ఇబ్బంది పెట్టే ఆలోచనలను మనసు నుంచి బయటికి పంపడంతో పాటు ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. కొత్త ప్రపంచానికి ద్వారాలు తెరుచుకున్నట్లు అనిపించింది.
 
పనికిరాని విషయాలను మనసులోకి ఆహ్వానించి.. మనం వాటితో నలిగిపోతుంటాం. అందుకే వాటిని దూరంగా పెట్టడం అవసరం. అకారణ ఆందోళన, అకారణ భయం… ఇలాంటి సమస్యలను బాలీవుడ్‌లో చాలామంది ప్రముఖులతో పాటు నేను కూడా ఎదుర్కొన్నాను. ఆలియా భట్‌ తన సమస్యల గురించి చెప్పుకుంది. డిప్రెషన్‌తో తాను ఎలా పోరాడింది దీపికా చెప్పింది. నా విషయానికి వస్తే పుస్తకాలు, ఇతర విషయాలు తోడ్పడ్డాయి. ఈ విశ్వం నా వల్లో, మీ వల్లో నడవడం లేదు. అటువంటప్పుడు అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ విశ్వాన్ని ఎవరైతే నడుపుతున్నారో..మనల్ని తీసుకెళ్లాల్సిన సమయంలో తీసుకువెళతారు. అర్థం చేసుకోవాల్సిన విషయమేమిటంటే…మనకు ఉన్నది ఒకటే జీవితం, ఏదో ఒకరోజు మనం వెళ్లిపోవాల్సిన వాళ్లమే. ఇది గుర్తుంచుకుంటే చాలా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి.
 
నేను నాదైన ప్రపంచంలో చిన్నప్పుడు ఉండేదాన్ని. ‘ఇలా జరిగితే బాగుంటుంది కదా!’ అని కలలు కనేదాన్ని. అవి నన్ను నలుగురిలో కలవకుండా చేశాయి. ఇప్పుడు ‘అలా జరిగి ఉండాల్సింది కాదు’ అంటూ గతాన్ని తలచుకొని బాధ పడను. ప్రతి సంఘటనా పాఠాన్ని నేర్పే అనుభవం, ఒక ప్రయాణం అనుకుంటాను. అనుభవాలు నేర్పించే పాఠాల వల్ల మానసిక పరిణతి వస్తుంది. ప్రతి వ్యక్తికీ తనదైన లక్ష్యం, గుర్తింపు ఉండాలని, ఎప్పుడు ఇతరులకు భారం కాకూడదనుకుంటాను.
 
పనికొచ్చే పనిచేస్తేనే తృప్తి!
కత్రినాకైఫ్ “గత 16 ఏళ్లుగా బాలీవుడ్‌లో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. అయితే అప్పటికీ, ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు జరిగాయి”అని అంటోంది. “ఇప్పుడు పరిశ్రమ పై ఓ క్లారిటీ వచ్చింది. మంచేదో, చెడోదో తెలుసుకోగలుగుతున్నాను. అందువల్లే నేను వచ్చి ఇన్నేళ్లు అయినా.. అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి రాలేదు. అంతేకాదు బయట అందరికీ తెలిసిన కత్రినా వేరు.. నాలోని కత్రినా వేరు. నాలో ఎవరికీ తెలియని మరో యాంగిల్ కూడా ఉంది”అని ఆమె అంటోంది.. కత్రినా చూడటానికి ఎప్పుడూ కూల్‌గా కనిపిస్తుంది. కానీ లోపల కత్రినా వేరట. సినిమాలో ఏ సీన్ ఎలా చేయాలి…అని లోలోపల తెగ ఆలోచిస్తూ ఉంటుంది. “డ్యాన్స్, సాంగ్స్, గ్లామర్, కాస్టూమ్స్… ఇలా ఒకటేమిటి చేసే సినిమాలోని ప్రతి విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాను. నా పని నేను చేసుకొని ఇంట్లో కూర్చోవడం నాకు అస్సలు నచ్చదు . నలుగురికి పనికొచ్చే పనిచేస్తేనే తృప్తిగా ఉంటుంది”అని చెబుతోంది కత్రినాకైఫ్.