బాగా నచ్చినా.. చెయ్యలేకపోతే బాధేస్తుంది !

కత్రినాకైఫ్‌… ‘ఒక్కోసారి మనకు కథ, కథనాలు బాగా నచ్చినప్పటికీ ఆ చిత్రంలో నటించేందుకు వీలు పడదు. ఇలాంటి సందర్భం వచ్చిన ప్రతీసారి నాకెంతో బాధేస్తుంది’ అని అంటోంది బాలీవుడ్‌ కథానాయిక కత్రినాకైఫ్‌.‘వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌’, ‘సూయిధాగా’, ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’, ‘జీరో’ వంటి తదితర చిత్రాలతో ఈ ఏడాదంతా సందడి చేసిన కత్రినా ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ సరసన ‘భారత్‌’ చిత్రంలో నటిస్తోంది. దీంతోపాటు రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కబోయే డాన్స్‌ నేపథ్య త్రీడీ చిత్రంలోనూ నటించేందుకు కత్రినాకైఫ్‌ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈచిత్ర షూటింగ్‌ జనవరిలో ప్రారంభం కానుంది.
అయితే ఈ చిత్రంలో నటించేందుకు సమయంలేక పోవడంతో కత్రినాకైఫ్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది. ‘రెమో చెప్పిన కథ, కథనం నాకెంతో బాగా నచ్చింది. పైగా ఇది త్రీడీలో చేస్తున్న డాన్స్‌ నేపథ్య చిత్రం కావడంతో మరింత ఆసక్తి కలిగింది. అంతేకాదు షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందా? అని ఎంతో ఎగ్జైటెడ్‌గా చూశాను. కానీ ‘భారత్‌’ సినిమా షూటింగ్‌ ఏకధాటిగా జరుగుతోంది. ఈ సినిమా కోసం నా డేట్స్‌ అన్ని కేటాయించాను. దీంతో రెమో సినిమా చేసేందుకు టైమ్‌ లేదు. అందుకే ఈ ప్రాజెక్ట్‌ చేయడం లేదని చెప్పాల్సి వచ్చింది. నా పరిస్థితిని దర్శకుడు రెమో కూడా అర్థం చేసుకున్నారు’ అని కత్రినాకైఫ్‌ తెలిపింది. పాకిస్తాన్‌ అమ్మాయి, ఇండియా అబ్బాయి ఓ ఇంటర్నేషనల్‌ డాన్స్‌ కాంపిటీషన్‌లో పరిచయం అవుతారు. ఆ తర్వాత వీరిద్దరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయనే పాయింట్‌తో ఈసినిమా కథ ఉంటుందని ఇప్పటికే రెమో చెప్పిన విషయం విదితమే.
కొన్ని సార్లు అలా జరుగుతుంది !
‘పరాజయాలతో నిరాశ చెందడం కొన్ని సార్లు మంచిదే. అవి మనల్ని మరింత దృఢంగా మారుస్తాయి’ అని అంటోంది కత్రినా కైఫ్‌. అమీర్‌ ఖాన్‌తో కలిసి నటించిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ ఇటీవల విడుదలై పరాజయం చెందింది. దీంతో సినిమా ఫ్లాప్‌కు తాను పూర్తి బాధ్యత వహిస్తానని ఆ మధ్య అమీర్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై కత్రినా స్పందిస్తూ… ‘ఈ సినిమాపై అమీర్‌ స్పందించిన విషయం నాకు తెలుసు. పరాజయానికి ఆయనే బాధ్యత వహిస్తానని చెప్పడం నన్ను బాధించింది. మా ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు. కొన్ని సార్లు మనకు తెలియకుండానే అలా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. నిరాశపడటం కొన్ని సార్లు మంచిదే. ఎందుకంటే అది మనకు మేలుకొలుపు లాంటిది.  ‘జీరో’ చిత్రం కూడా  చాలా మంచి చిత్రమని చెబుతాను. ఇందులో చాలా మంచి కథ ఉంది. ఇప్పుడున్న దర్శకుల్లో ఆనంద్‌ ఎల్‌ రాయ్ మంచి కథకుడు. భావోద్వేగాలను బాగా పండిస్తారు ‘ అని కత్రినాకైఫ్‌ తెలిపింది.
వాటిని బాగా ఎంజాయ్ చేశాను !
ఇదిలా ఉంటే, నా సినిమాల్లో ఇకపై ఐటెమ్‌ సాంగ్స్‌ పెట్టనని, గతంలో పెట్టినందుకు కరణ్‌జోహార్‌ క్షమాపణలు తెలిపిన నేపథ్యంలో దీని గురించి కత్రినాకైఫ్‌ మీడియాతో మాట్లాడుతూ…’ఐటెమ్‌ సాంగ్స్‌లో నర్తించినంత మాత్రాన నేనెప్పుడు వాటిని తప్పుగా భావించలేదు. మహిళను ఓ వస్తువుగా చూస్తున్నారనే భావన ఎప్పుడూ కలగలేదు. అంతేకాదు వాటిలో నర్తిస్తూ బాగా ఎంజాయ్ చేశాను. తప్పు అనేది మనం చూసేదాని బట్టి ఉంటుంది’ అని చెప్పింది. కత్రినాకైఫ్‌ గతంలో ‘చిక్నీ చమేలీ..’, ‘షీలా కి జవానీ’ వంటి ప్రత్యేక పాటల్లో ఆడిపాడి ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసిన విషయం విదితమే.