అభద్రతాభావం పోయింది…హాయిగా ఉన్నా !

కైత్రినా కైఫ్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది.  వరుస ఫ్లాప్స్‌ తర్వాత భారీ విజయం వచ్చి చేరింది కైత్రినా కైఫ్‌ ఖాతాలో.ఆమె హీరోయిన్‌గా నటించిన ‘పితూర్‌’, ‘బార్‌ బార్‌ దేకో’, ‘జగ్గా జాసూస్‌’ ఈ మూడు సినిమాలు వరుసగా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. తాజాగా సల్మాన్‌ ఖాన్‌తో చేసిన ‘టైగర్‌ జిందా హై’ మంచి విజయం అందుకుంది. ఏకంగా మూడు వందల కోట్లు కలెక్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ…. ”బార్‌ బార్‌ దేకో’ సినిమా కాన్సెప్ట్‌ను ప్రేమించి నటించాను. ఇదొక అద్భుతమైన కథ. మంచి చిత్రాలు కూడా కొన్నిసార్లు ఎందుకు ఆడవో నాకర్ధం కావడం లేదు. ‘జగ్గా జాసూస్‌’ అనేది ఓ మహాకావ్యంలా ఉంటుంది. ఆ చిత్ర దర్శకుడు అనురాగ్‌ బసు ఓ గొప్ప విజన్‌ ఉన్న వ్యక్తి. అందుకే ఆ సినిమా అంత గొప్పగా తీశారు. కానీ ప్రేక్షకులు ఆదరించలేదు.

ఇప్పుడు చేసిన ‘టైగర్‌ జిందా హై’ ఇంత హిట్‌ అవుతుందని అనుకోలేదు. మామూలుగా కాదు ఓ పెద్ద బాంబ్‌లా పేలింది.గతంలో చాలా అభద్రతా భావంతో ఉండేదాన్ని. దానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇప్పుడు నాకు నేను ప్రశాంతంగా ఉన్నా. ప్రస్తుతం అంతా సినిమాలపైనే దృష్టి పెడుతున్నా. ఒత్తిడి అధిగమిస్తూ హాయిగా సినిమాలు చేసుకుంటూ పోతానంతే. గత రెండు సంవత్సరాలు చాలా కష్టంగా గడిచాయి” అని చెప్పింది కత్రినా. ఇప్పుడు ఆమె విజయ్ క్రిష్ణ ఆచారి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’లో చేస్తోంది. అమిర్‌ ఖాన్‌, అమితాబ్‌ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.