బిజినెస్ ఉమెన్‌గా కొత్త పాత్రలోకి కత్రినా

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న కత్రినాకైఫ్ ఇకపై బిజినెస్ ఉమెన్‌గా మారబోతోంది. ధనార్జనకు ఆస్కారం ఉన్న వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. కత్రినా తన కెరీర్‌లో కొత్త దశలోకి అడుగుపెట్టబోతోంది. తన ఆలోచనలు ఇటీవల పూర్తిగా మారాయి. అనుష్క శర్మ, ప్రియాంక చోప్రాలాగా నిర్మాతగా రాణించేందుకు… సన్నీలియోన్‌లాగా కార్పొరెట్ వరల్డ్‌లో రాణించేందుకు ప్రణాళికలు వేస్తోంది. ముందుగా సినీ నిర్మాతగా రాణించేందుకు కత్రినా సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘హీ లవ్స్ మీ.. హీ లవ్స్ మీ నాట్’ అనే ఫ్రెంచి మూవీ హక్కులను ఈ భామ చేజిక్కించుకుంది. ఈ సినిమాను రీమేక్ చేసే సన్నాహాల్లో ఉన్నామని కత్రినాకైఫ్ తెలిపింది. “నిర్మాతగా నా తొలి ప్రయత్నమిది. తెరపై నిర్మాతగా పేరు వేసుకోబోతున్నాను. ఈ ఏడాదే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాం”అని ఈ స్టార్ బ్యూటీ తెలిపింది. దీనితో పాటు .. సినీరంగంతో సంబంధం లేకుండా తన పేరుతో సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్‌ను ప్రారంభించేందుకు కత్రినా సిద్ధమవుతుండడం విశేషం. ఈ బిజినెస్ కోసం ఇప్పటికే వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
అలాంటి ప్రేమను ఆశించడం వ్యర్థం!
ప్రేమ.. జీవితంలో చైతన్యాన్ని నింపే ఓ అందమైన భావన. అయితే ప్రేమ పేరుతో మన వ్యక్తిత్వాన్ని, గుర్తింపును పణంగా పెట్టడం నాకు నచ్చదు. ఏ బంధంలోనైనా ఆత్మగౌరవం చాలా ముఖ్యం అంటున్నది కత్రినాకైఫ్. ఆమె కథానాయికగా నటించిన ‘భారత్’ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో ముచ్చటించిన కత్రినాకైఫ్ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది….
 
“ప్రేమలో ప్రతి ఒక్కరూ స్వార్థంగా ఆలోచిస్తారు. తాము అందించే ప్రేమకు మించిన ప్రతిఫలాన్ని ఆశిస్తారు. అక్కడే అహం దెబ్బతింటుంది. దాంతో విభేదాలు వస్తాయి. ఎలాంటి షరతులు లేని బంధంలోనే స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. నేటి రోజుల్లో అలాంటి ప్రేమను ఆశించడం వ్యర్థం” అంటూ తాత్విక ధోరణిలో వ్యాఖ్యానించింది. ప్రేమలో వైఫల్యాలు జీవితం పట్ల తన దృష్టికోణాన్ని మార్చివేశాయని, ఇప్పుడు మరింత పరిణితితో..ఆత్మవిశ్వాసంతో ఆలోచిస్తున్నానని చెప్పింది.
 
గతంలో సల్మాన్‌, రణబీర్‌ కపూర్‌ వంటి వారితో కత్రినా ప్రేమలో ఉందని వార్తలు వినిపించాయి. తాజాగా కత్రినా విక్కీ కౌసల్‌తో కలసి డేటింగ్‌లో ఉందని, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలయ్యింది. ఈ నేపథ్యంలో కత్రినాకైఫ్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. దీనిపై కత్రినా ‘బాలీవుడ్‌ లైఫ్‌’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తాను ఇప్పటికీ ఒంటిరిగానే ఉంటున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈమె ‘భారత్‌’ సినిమాలో నటించారు. త్వరలో అక్షయ్ కుమార్‌ హీరోగా నటిస్తున్న ‘సూర్యవంశి’ సినిమాలో కథానాయికగా చేస్తోంది.