బడాఖాన్ లతో మూడు సినిమాల ముచ్చట

 బాలీవుడ్‌లో తన సహ నటీమణుల కంటే ఇప్పుడు రేసులో బాగా వెనుకబడింది కత్రిన కైఫ్. హృతిక్‌తో నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ తర్వాత ‘ఫాంటమ్’, ‘ఫితూర్’, ‘బార్ బార్ దేఖో’, ‘జగ్గా జాసూస్’ వంటి చిత్రాలతో వరుస పరాజయాలు కత్రినకు కంటిమీద కునుకులేకుండా చేశాయి.ఈ బాలీవుడ్ టాప్ బ్యూటీకి.. ఇప్పుడు అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. ఇక చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్సే తనను ఫ్లాపుల బాట నుంచి బయట పడేస్తాయని గంపెడు ఆశలు పెట్టుకుందట కత్రిన.
వరుసగా నాలుగు ఫ్లాప్స్ అందుకున్నా బాలీవుడ్‌లో మరే హీరోయిన్‌కు లేనంతగా ఇప్పుడు మూడు బడా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది కత్రిన కైఫ్. ఇక ఆ మూడు సినిమాలు కూడా ‘కింగ్స్ ఆఫ్ బాలీవుడ్‌’గా చెప్పుకునే ‘ఖాన్ త్రయం’తో నటిస్తున్నవే కావడం విశేషం. వీటిలో ముందుగా సల్మాన్‌తో నటించిన ‘టైగర్ జిందా హై’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.’ఏక్ థా టైగర్’ వంటి భారీ విజయం తర్వాత సల్మాన్‌తో మరోసారి ‘టైగర్ జిందా హై’లో నటించిన కత్రిన ‘జబ్ తక్ హై జాన్’ వంటి విజయం తర్వాత షారుఖ్ ఖాన్ తోనూ ‘ధూమ్-3’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆమిర్‌తోనూ కూడా నటిస్తోంది. ప్రస్తుతం కత్రిన నటిస్తోన్న షారుఖ్-ఆనంద్ ఎల్.రాయ్ మూవీ, ఆమిర్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. మొత్తంమీద చేతిలో ఉన్న మూడూ బడా బడా ప్రాజెక్ట్‌లే కావడంతో కత్రిన మళ్లీ మంచి ఫామ్‌లోకి వస్తానని కొండంత ఆశతో ఉంది.