గట్టి పోటీలో నెగ్గితేనే ఆ స్థాయి దక్కింది !

‘‘ఏ రంగంలో అయినా రాణించాలంటే మన లక్ష్యం పెద్దదిగా ఉండాలి, పోటీపడే మనుషులు మన చుట్టూ ఉండాలి. సినిమా రంగం కూడా అందుకు మినహాయింపు కాదు’’ అంటోంది కీర్తిసురేష్‌. తక్కువ చిత్రాలతోనే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని, స్టార్‌ కథానాయికల జాబితాలో చేరిపోయింది కీర్తి. ప్రస్తుతం తన చేతినిండా సినిమాలున్నాయి. తెలుగుతో పాటు తమిళంలోనూ బిజీగా ఉంది. కీర్తి మాట్లాడుతూ… ‘‘పోటీ లేకపోతే ఎలా? మనల్ని మనం మరింత మెరుగుపరుచుకోవడానికి అది చాలా అవసరం. అయితే దాన్ని చూసి భయపడ కూడదు. ఎక్కువగా ఆలోచించనూ కూడదు. ప్రతిభ, అదృష్టం రెండూ పక్క పక్కనే ఉంటాయి. అవి రెండూ జోడు గుర్రాల్లాంటివి. ఒకదానికి మరోటి సహాయం చేసుకోవాల్సిందే. కొన్నిసార్లు అదృష్టం, మరికొన్నిసార్లు ప్రతిభ ఆధిపత్యం చలాయిస్తుంటాయి. స్టార్‌లుగా రాణించినవాళ్లని ఎవ్వరినైనా చూసుకోండి. కేవలం అదృష్టంతోనే వాళ్లు విజేతలు కాలేదు. ఎంతో గట్టి పోటీ ఎదుర్కొని వచ్చారు. అందుకే ఆ స్థాయి దక్కింది…” అని అంటోంది.
 
రెండు విభిన్న పాత్రల్లో…
అరుదైన అవకాశాలు కీర్తీ సురేశ్‌కు ఆదిలోనే వరిస్తున్నాయి. కెరీర్‌ తొలి దశలోనే ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో అసాధారణ నటనను ప్రదర్శించి విమర్శకులను సైతం మెప్పించింది.చాలా తక్కువ టైమ్‌లోనే బాలీవుడ్‌ అవకాశాన్ని దక్కించుకున్న నటి కీర్తీ సురేశ్‌. తొలిసారి బాలీవుడ్‌లో నటిస్తున్న హిందీ చిత్రంలో కీర్తీసురేశ్‌ ద్విపాత్రాభినయం చేయబోతోందన్నది తాజా సమాచారం. ‘బదాయ్‌ హో’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన అమిత్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్‌దేవ్‌గన్‌ హీరోగా నటిస్తున్నారు.ఈ సినిమాలో కీర్తీ సురేశ్‌ రెండు విభిన్న పాత్రల్లో నటించబోతోందని తెలిసింది. ఒకటి యుక్త వయసులో ఉన్న అమ్మాయి కాగా, మరోటి పెద్ద వయసున్న స్త్రీలా కనిపిస్తారట.అయితే మధ్య వయసు పాత్ర కోసం ఎలాంటి ప్రాస్థెటిక్‌ మేకప్‌ను వాడకుండా తన నటనతోనే వైవిధ్యాన్ని చూపిస్తానంటోంది. ఇది భారతీయ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు, శిక్షకుడు ‘సయ్యద్‌ అబ్దుల్‌ ఇబ్రహీం’ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మాత బోనీకపూర్‌ నిర్మిస్తున్న చిత్రం.
చిరంజీవి తో అరుదైన అవకాశం
‘మహానటి’ సినిమా కీర్తి సురేష్‌ కెరీర్‌నే పూర్తిగా మలుపు తిప్పింది. స్టార్‌ హీరోయిన్‌ జాబితాలో చేరడమే కాదు, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకూ కేరాఫ్‌గా నిలబడేలా చేసింది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో పలు భారీ ఆఫర్స్‌ కీర్తిని వరిస్తున్నాయి. ఇటీవలే మణిరత్నం సినిమాలో ఛాన్స్‌ కొట్టేసింది. మలయాళంలో మోహన్‌లాల్‌తో ‘మరక్కార్‌: అరబికడలింటే సింహం’ లోనూ నటిస్తోంది. తాజాగా చిరంజీవి సరసన నటించే అరుదైన అవకాశం కీర్తి దక్కించుకుందట. చిరంజీవి ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్నారు. అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో కథానాయికగా కీర్తిసురేష్‌ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. దీని కోసమై దర్శకుడు కొరటాల కీర్తితో ఇప్పటికే చర్చలు కూడా జరిపారట.