అంతగా ఆకట్టుకోలేదు కీర్తి సురేష్ ‘పెంగ్విన్’

కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన ‘పెంగ్విన్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ ప్రదర్శించిన రెండవ అతిపెద్ద తమిళ చిత్రం ఇది. గత నెల్లో జ్యోతిక ప్రధాన పాత్రలో వచ్చిన ‘పొన్మగల్ వంధల్’ కూడా ఓటీటీ ప్లాట్‌ఫాంపైనే విడుదలైంది.  తెలుగు, తమిళం, మళయాలంతో కలిపి మూడు భాషల్లో విడులైంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, ఆదిదేవ్, లింగ, అద్వైత్, హరిణి, నిత్య తదితరులు నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం ఈశ్వర్ కార్తీక్. కాగా, కార్తీక్ సుబ్బరాజ్, కార్తికేయన్ సంతానం, సుందరం, జయరాం నిర్మాతలుగా వ్యవహరించారు. కెమెరా కార్తీక్ పళని, సంగీతం సంతోష్ నారాయణ్.
 
‘పెంగ్విన్’ ఎమోషనల్ థ్రిల్లర్. మాతృత్వం, తల్లి – కొడుకుల మధ్య బంధం గురించి, తన కొడుకును కోల్పోయినప్పుడు ఆ తల్లి అనుభవించే బాధ గురించి మొత్తం కథ నడుస్తుంది. తల్లి ఎమోషన్స్ ను కొత్త కోణంలో ఆవిష్కరించిన దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడని పలు వెబ్ సైట్స్ కితాబునిచ్చాయి. తల్లి పాత్ర చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ను తీసుకొని, ఆసక్తికరంగా మలచడంలో దర్శకత్వ పనితనం బాగుందనే ప్రశంసలతో పాటు.. కొన్ని లోపాలు, చాలా ప్రశ్నలు తలెత్తుతాయనే వ్యాఖ్యలు.. సాంకేతిక పనితనం బాగుందనే పొగడ్తలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి. ప్ర‌థ‌మార్థంలో ప‌ట్టు చూపించిన‌ప్ప‌టికీ.. ద్వితీయార్థంలో మాత్రం దర్శకుడు పట్టుకోల్పోయాడు. థ్రిల్లర్ సినిమాలకు క్లైమాక్స్ ముఖ్యం. చివరివరకు సస్పెన్స్ ను ఎంత బాగా నడిపితే, అంత బాగా పండుతుంది. అయితే, క్లైమాక్స్ తేలిపోయిందని నిరాశపడ్డవారూ వున్నారు. క‌థ బాగానే ఉన్న క‌థ‌నంలో లోపాల‌తో కొన్నిచోట్ల గ‌జిబిజిగా అనిపిస్తుంది. ఇక సినిమాలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలియని న‌టీన‌టులే ఎక్కువగా ఉండటం కూడా ఓ మైన‌స్‌.
కీర్తి సురేష్ సహజత్వం ఉట్టిపడేలా తల్లి పాత్రలో జీవించిందని.. ముఖంలో భయం, ఆందోళనను తెరపై అద్భుతంగా ప్రదర్శించి ఆమె ప్రేక్షకుల సానుభూతిని పొందుతుందని ప్రశంసలొచ్చాయి. సాంకేతికంగా సినిమా బాగుంది. సంతోష్ నారాయ‌ణ్ అందించిన‌ సంగీతం ప్రేక్ష‌కుడిని క‌ట్టిప‌డేస్తుందని..కార్తీక్ పళని సినిమాటోగ్ర‌ఫీ అద్భుతంగా ఉందని నెటిజన్లు అభినందిస్తున్నారు.